BREAKING NEWS

బహుభాషాకోవిదులు..బూర్గుల!

బహుభాషావేత్త, సాహితీవేత్త, ఆయన ఎన్నో సంస్థలను స్థాపించి కార్యదర్శిగానూ సేవలందించారు. ఆయన  సేవానిరతి, సాహితీ ప్రగతి చరిత్రలో నిలిచిపోయింది. స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి కూడా. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసిన ఘనత ఆయన సొంతం.

వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు. అటువంటి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి రేపు(సెప్టెంబర్ 14న, 1967).. కావున ఈ సందర్భంగా ఆయన జీవిత, రాజకీయ, ప్రజాసేవ విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం:
 
బాల్యం, చదువు

1899 మార్చి 13వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి తాలూకాలో ఉన్న పడకల్లు గ్రామంలో జన్మించారు బూర్గుల రామకృష్ణారావు. తండ్రి నరసింగరావు, తల్లి రంగనాయకమ్మ. వీరి ఇంటి పేరు 'పుల్లంరాజు'. వీరి స్వగ్రామం బూర్గుల, నేటి షాద్‌నగర్‌. అయితే వీరు మహారాష్ట్రలో చదువుకొనే రోజులలో అక్కడి ఆచారం మేరకు ఊరు పేరునే ఇంటిపేరుగా పెట్టుకోవడం వల్ల 'బూర్గుల' అన్నది వారి ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. ప్రాథమిక విద్య పూర్తవ్వగానే హైదరాబాద్‌కు వచ్చి, ఇక్కడి ధర్మవంత్‌ పాఠశాలలో, ఎక్సెల్షియల్‌ స్కూల్‌లో చేరి ఉన్నత పాఠశాల విద్యను కొనసాగించారు. 

1915, బొంబాయి విశ్వవిద్యాలయంలో మెట్రిక్‌ పరీక్ష పాసై, హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత పుణెలోని ఫెర్గూసన్‌ కాలేజీలో బీఏ ఆనర్స్ చదివి, అందులోనూ మొదటి శ్రేణి తెచ్చుకొన్నాడు. తర్వాత బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి ఎల్ఎల్‌బీ పట్టా పొందాడు. అనంతరం బారిష్టర్‌ ఆస్గర్‌ దగ్గర జూనియర్‌గా చేరి, 1925లో న్యాయవాద వృత్తి చేపట్టారు. 
తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, పారసీ, మరాఠీ, కన్నడ వంటి పలుభాషల్లో ప్రావీణ్యం ఉంది. అష్టభాషవిశారదుడు అనిపించుకున్నారు. అందువల్లేనేమో కొంతకాలం 'అంజుమాన్‌ ఇస్లామియా హైస్కూల్‌'లో పర్షియన్‌ అధ్యాపకుడిగానూ పని చేశాడు.
 
న్యాయవాదిగా

సివిల్‌, క్రిమినల్‌ కేసులను వాదించి సమర్థుడైన న్యాయవాదిగా అనతికాలంలోనే పేరు సంపాదించుకున్నాడు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానంలో అధికార భాష ఉర్దూ అయినందువల్ల న్యాయస్థానాల్లో వకీలు ఉర్దూ భాషలోనే వాదించవలసి ఉండేది. ఇటు బ్రిటిషు ప్రభుత్వ పరిధిలోని సికింద్రాబాద్‌, బ్రిటిషు రెసిడెంట్‌ నివాస ప్రాంతమైన సుల్తాన్‌బజార్‌, కోఠి ప్రాంతాలలో బ్రిటిషు వారికి చెందిన కోర్టులలో వాదనలు ఇంగ్లీషులో కొనసాగేవి. బూర్గులవారికి ఉర్దూ, ఇంగ్లీషు భాషలపై మంచి పట్టు ఉండడంవల్ల ఇటు నిజాం కోర్టు, అటు బ్రిటిషు కోర్టుల్లో ఆయా భాషలలో వాదించడంలో దిట్ట అనిపించుకున్నాడు. 

ప్రజాసేవకై పనిచేసే సామాజిక కార్యకర్తలపై ప్రభుత్వం కక్షతో తప్పుడు కేసులు బనాయించి, కోర్టుకు లాగితే బూర్గులవారు వారికి మద్దతుగా నిలిచి, వాదించి గెలిపించేవాడు. రామకృష్ణారావు మక్తేదారు జమీందారీ కుటుంబానికి చెందినవాడు.

హైదరాబాద్‌ సంస్థానంలో జాగీర్దారులు, మక్తేదారులు, దేశముఖులు, దేశపాండ్యాలు గ్రామాలను, పొలాలను ఆక్రమించుకొని నైజాం నవాబుకు కొంత రుసుం చెల్లిస్తూ, తమ తమ ప్రాంతాలలో సర్వాధికారాలు చెలాయిస్తుండేవారు. అభ్యుదయ భావాలు కలిగిన బూర్గులవారికి జమీందారీ పెత్తనాలు నచ్చలేదు. ప్రజాస్వామిక పద్ధతుల వైపు ఆకర్షితులైన ఆయన ఆనాటి రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1916లోనే కొందరు యువకులతో కలిసి 'హైద్రాబాద్‌ యంగ్‌ మెన్స్‌ యూనియన్‌' స్థాపించి, దానికి కార్యదర్శిగా పని చేశారు.

1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్న జాతీయ నాయకుల ప్రసంగాలను బూర్గులవారు తెలుగులోకి అనువాదం చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సమావేశంలో ఒక శాసనంపై వాదోపవాదాలు సైతం జరిగాయి. దీనిని పైస్థాయి వారు పరిశీలించి ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనితో ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ శాఖ ఉండేది.

ఖద్దరు ప్రచారం, అస్పృశ్యత నివారణ, సంఘ సామరస్యం వంటి అంశాలతో ఇది పనిచేస్తూ ఉండేది. 1924లో జరిగిన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, స్వదేశీ సంస్థానాల ప్రజల సమాఖ్యలలో బూర్గులవారు ప్రముఖపాత్ర పోషించారు.
 
ఎన్నో సంస్థలు

1930-40ల మధ్య నిజాం రాష్ట్రంలో తలెత్తిన ముల్కీ ఉద్యమ సమయంలో స్థానికులైన హిందూ, ముస్లింలు కలిసి బయటి నుంచి వచ్చిన వారి ఆధిపత్యాన్ని తిప్పికొట్టడానికంటూ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అదే 'అంజుమనే జమీయత్‌ నిజాం'. దీనికి బూర్గుల కార్యదర్శిగా పనిచేశారు. 1937లో రాజ్యాంగ సంస్కరణల స్వరూపాన్ని సూచించడానికి 'హైదరాబాద్‌ ప్రజాపక్ష పరిషత్‌' ఏర్పడింది. 

1938లో హైదరాబాద్‌ సంస్థానంలోకి ప్రవేశించకూడదని జయప్రకాష్‌ నారాయణ్‌ను నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఆ తరుణంలో ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి రామకృష్ణారావు జైలుకు వెళ్లారు. 

1947లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన హైదరాబాద్‌లోని రజాకారు ప్రభుత్వం భారతదేశంలో విలీనం కావడానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని బేగంబజారులో జరిగిన ఒక రాజకీయ సభలో ప్రసంగించినందుకు గాను బూర్గులవారికి కారాగార శిక్ష పడింది. 

జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన మద్రాసు వెళ్లి అక్కడ కాంగ్రెసు ప్రచార కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో నిజాం ప్రభుత్వం బూర్గులవారికి హైకోర్టు జడ్జి పదవి కానీ, న్యాయశాఖ మంత్రి పదవి కానీ ఇవ్వాలనుకుంది. కానీ అవి ప్రజాప్రభుత్వ పదవులు కానందువల్ల ఆయన వాటిని స్వీకరించలేదు.

1950 జూన్‌లో వెల్లోడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులలో బూర్గులవారు ఒకరు. వీరు ఆ సమయంలో రెవెన్యూ శాఖామంత్రిగా, విద్యాశాఖమంత్రిగా పనిచేశారు. కౌలుదారుల శాసనం, భూకమాతాల గరిష్ట శాసనం వంటివి తీసుకొచ్చారు. 

1951-52లో జరిగిన ఎన్నికల తరువాత రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పూర్వం నుంచే బూర్గులవారిపై నెహ్రూ, సర్దార్‌ వల్లభాయి పటేళ్ల అభిమానం చూరగొన్నాడు.

ముఖ్యమంత్రిగా నాలుగేళ్లు పరిపాలనా బాధ్యతను చక్కగా నిర్వహించారు. 
ఆయన ఎంతటి రాజకీయ దురంధరులో అంతటి సాహిత్య కోవిదులు. సనాతన విలువల పట్ల ఎంతటి గౌరవమో, ఆధునిక భావాల పట్ల అంతే ఆదరణ కనబరిచిన అభ్యుదయవాది. 

సాహిత్య సదస్సులలో అత్యంత ఆసక్తితో తప్పనిసరిగా పాల్గొనేవారు. కవి సమ్మేళనాలు, సారస్వత సమావేశాలు, ముషాయిరాలు నిర్వహించి కవి పండితులను సత్కరించేవారు.

ఈనాటి రాజ్‌భవన్‌ ఆనాటి వారి అధికార నివాసంగా ఉండేది. అక్కడి సభా మందిరంలో ఆనాడు డా. సి.నారాయణరెడ్డి రచించిన 'నాగార్జున సాగరం' కావ్యగాన సభ జరిపించారు. ఆయన పూనిక వహించి 1926లో 'శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం' రజతోత్సవాలు, 1951లో స్వర్ణోత్సవాలు ఘనంగా జరిపించారు. ఆయన విమర్శలను, ప్రశంసలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞుడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.

◆ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత ఆయన ఆరు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల గవర్నరుగా, 1966లో నాలుగేళ్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన ప్రజ్ఞకు ప్రశంసగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశాయి. తమ బహుభాషా వైదుష్యం చేత శాసనసభలో ఎవరు ఏ భాషలో మాట్లాడినా వారికి ఆ భాషలోనే సమాధానం ఇచ్చేవారట. 

◆ బూర్గుల రామకృష్ణారావుగారు 1967 సెప్టెంబర్‌ 14న కన్నుమూశారు.