BREAKING NEWS

బ్రిటన్‌ 'రాణి' ఇక లేరు..!

మహిళా పాలకుల విషయంలో ఆమే సుదీర్ఘకాలం పాలించిన ప్రపంచ నాయకురాలు. యూకేను ఎక్కువ కాలం పరిపాలించిన క్వీన్ ఎలిజబెత్‌-2 తన 96 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం కన్నుమూసినట్లు బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
 
జననం

1926 ఏప్రిల్‌ 21న మేఫెయిర్‌లోని డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌(కాబోయే రాజు), అల్బెర్ట్‌(రాజు అయ్యాక జార్జ్‌-4), డచెస్‌ ఆఫ్‌ యార్క్‌(కాబోయే రాణి), లియాన్‌(రాణి అయ్యాక ఎలిజబెత్‌)లకు జన్మించారు. ఎలిజబెత్ పుట్టిన పదేళ్లకు, 1936లో ఆమె తల్లిదండ్రులు అన్యూహ్య పరిస్థితుల మధ్య బ్రిటన్‌ రాణి, రాజుగా బాధ్యతలు చేపట్టారు. ఎలిజబెత్‌-2, ఆమె సోదరి ప్రిన్సెస్‌ మార్గరేట్‌ విద్యాభ్యాసం అంతా బకింగ్‌హామ్‌ ప్యాలెస్ లోనే జరిగింది. ఆమెకు చరిత్ర, ఇంగ్లిష్, ఆంగ్ల సాహిత్యం, సంగీతంపై ఆసక్తి ఎక్కువ. ఎలిజబెత్‌కు రాచకుటుంబానికి చెందిన అమ్మాయిననే గర్వం ఉండేదికాదు.

ఆమెకు గుర్రాలు, కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టం. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి ఆమె కొన్ని ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించారు. ఎలిజబెత్‌-2 పాతికేళ్ల వయసులో, 1952లో ఆమె తండ్రి కింగ్‌ జార్జ్‌ కన్నుమూశారు. దాంతో ఎలిజబెత్‌-2 రాణిగా బాధ్యతలు స్వీకరించింది. తొలుత ఆమె రాణిగా బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించినా.. ఆ తర్వాత పీఠాన్ని అధిరోహించారు. 

ఏడు కామన్వెల్త్‌ స్వతంత్ర దేశాలకు- (కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, శ్రీలంకకు కూడా రాణిగా ఉండేవారు. అప్పటికే భారత్‌ గణతంత్రాన్ని ప్రకటించుకుంది. ఉత్తర ఐర్లాండ్‌ సంక్షోభ పరిష్కారం, ఆస్ట్రేలియాలో రాజకీయ సంక్షోభాన్ని ఆమె సమర్థంగా పరిష్కరించారు. బ్రిటన్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో ఆమె చొరవ ఉంది. బ్రిటిష్‌ పాలనలో ఉన్న 20కి పైగా దేశాలకు ఆమె స్వాతంత్ర్యాన్ని ప్రసాదించారు. 

◆ ఆమె జరిపిన చైనా(1986), రష్యా(1994) ఐర్లాండ్‌(2011) పర్యటనలు చరిత్రాత్మకం. అంతకు ముందు 1972లో యుగోస్లావియాలో పర్యటించి, ఓ కమ్యూనిస్టు దేశాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్‌ రాణిగా పేరు తెచ్చుకున్నారు. 1974లో బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సంక్షోభం తలెత్తినప్పుడు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడింది. ఆమె విపక్ష నేతను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 

1947 నవంబరులో ఆమె గ్రీస్‌, డెన్మార్క్‌ల మాజీ రాకుమారుడు ఫిలిప్‌ మౌంట్‌బాటన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫిలిప్‌ను ఆమె మొదటిసారి 1934 కలిశారు. 1939లో మూడోసారి కలిసినప్పుడు ఎలిజబెత్‌ వయసు 13. అప్పట్లో ఆమె ధైర్యంగా ఫిలిప్‌ను ప్రేమిస్తున్నానని చెప్పారు. అప్పట్లో వీరి ప్రేమపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఫిలిప్‌ బ్రిటిషర్‌ కాకపోవడం, ఆయనకు రాకుమారిని పెళ్లాడే స్థాయి లేకపోవడం కారణమే. ఎలిజబెత్‌-ఫిలిప్‌కు నలుగురు సంతానం. వారు.. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చార్లెస్‌, ప్రిన్సెస్‌ రాయల్‌ అన్నె, డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌ ప్రిన్స్‌ ఆండ్రూ, ఎర్ల్‌ ఆఫ్‌ వెసెక్స్‌ ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌. 

◆ ఎలిజబెత్‌ రాణిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడా ఫిలిప్‌ కొంత ఇబ్బంది పడ్డారు. ‘‘నా పిల్లలకు నా ఇంటి పేరు పెట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ దేశంలో ఒక వ్యక్తి తన పిల్లలకు తన ఇంటిపేరు పెట్టుకోలేకుండా ఉంటే.. బహుషా అది నేనొక్కడినే’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యానించారు. అయితే.. ఫిలిప్‌-ఎలిజబెత్‌లు 1960లో మౌంట్‌బాటన్‌ అనే బాలుడిని దత్తత తీసుకున్నారు. అతనికి ఫిలిప్‌ ఇంటిపేరు ఇచ్చారు. అయితే.. మౌంట్‌బాటన్‌కు రాచరిక హోదా ఉండదు. గత ఏడాది ఏప్రిల్‌లో ఫిలిప్‌ కన్నుమూశారు.
 
అసలు కిరీటం వెనుక కథ

కింగ్‌ జార్జ్‌-3 మనవరాళ్లలో తదుపరి రాణి కిరీటాన్ని ధరించనున్న వారి వరుసలో ఎలిజబెత్‌ స్థానం మూడోది. ఆమె రాణి అవుతుందని మొదట్లో ఎవ్వరూ ఊహించలేదు. ఆమె పెదనాన్న ఎడ్వర్డ్‌-8 1936లో కింగ్‌జార్జ్‌-3 మరణం తర్వాత రాజయ్యారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. రాజు కుమార్తెల్లో ఒకరికే రాణి అయ్యే అవకాశం ఉండగా, ఎలిజబెత్‌ స్థానం రెండుకు చేరుకుంది. అనూహ్యంగా కింగ్‌ ఎడ్వర్డ్‌-8 విడాకులు తీసుకోవడంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దాంతో.. ఎలిజబెత్‌ తండ్రి రాజయ్యారు. సోదరి మార్గరేట్‌ తప్ప.. సోదరులు ఎవరూ లేకపోవడంతో ఎలిజబెత్‌ తదుపరి రాణి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఒకవేళ ఆ తర్వాత ఎలిజబెత్‌కు ఒక సోదరుడు జన్మించి ఉన్నా.. ఆమెకు దక్కిన అవకాశం అలా చేజారి ఉండేది.
 
70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్‌–2 రాణి ప్రపంచంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్‌ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్‌ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్‌ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్‌ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి.

ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై ప్రసార మాధ్యమాలు విమర్శనాస్త్రాలు విసిరాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్‌ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్‌–2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు. ఎలిజబెత్‌ కుమారుడు చార్లెస్‌ను బ్రిటన్‌ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన కింగ్‌ చార్లెస్‌–3గా పదవిలో కొనసాగుతారు.  

◆ క్వీన్ భారత్ ను 1983లో రెండోసారి, భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సమయం(1997)లో మూడోసారి సందర్శించారు. సుదీర్ఘకాలం పరిపాలించిన రాణి బ్రిటన్‌ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు పాలించిన రాణిగా ఎలిజబెత్‌-2 2015లోనే రికార్డు సాధించారు. అంతకుముందు ఈ రికార్డు క్వీన్‌ విక్టోరియా(1837-1901) పేరిట ఉండేది. ప్రపంచ చరిత్రలోనే అత్యధికకాలం పాలించిన రెండోవ్యక్తిగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 రికార్డుకెక్కారు. 

◆ 1643-1715 మధ్యకాలంలో.. 72 ఏళ్ల 110 రోజుల పాటు లూయిస్‌-15 ఫ్రాన్స్‌ను పాలించారు. ఆయన మొత్తం 26,407 రోజులపాటు పాలన కొనసాగించగా.. క్వీన్‌ ఎలిజబెత్‌-2 పాలన 70 ఏళ్ల 110 రోజులు(25,782 రోజులు). 

◆ క్వీన్‌ ఎలిజబెత్‌ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగుఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనా, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందాలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను ప్రోత్సాహించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు కూడా కావడం గమనార్హం. క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు.    
    
◆ 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్‌ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు. 

◆ యునైటెడ్‌ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్‌, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్‌ ఐల్యాండ్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌, ది గ్రెనాడైన్స్‌, తువాలుకు కూడా క్వీన్‌ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు.

◆ ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసం అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. 

◆ 1977, 2002, 2012, 2022 సంవత్సరాల్లో ఆమె తను రాణిగా బాధ్యతలు చేపట్టడానికి గుర్తుగా రజత, స్వర్ణ, వజ్రోత్సవాలు, ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకొన్నారు.