BREAKING NEWS

నటనలో 'రెబల్'.. కృష్ణంరాజు!

విలన్ పాత్రల నుంచి హీరోగా మారి స్టార్ అయిన తొలి తెలుగు నటుడాయన. సాఫ్ట్ రోల్స్ అయినా..  ఉగ్రమైన పాత్రలు పోషించినా తిరుగులేనిది ఆయన నటన. ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రారాజుగా వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజుగారు నిన్న(ఆదివారం)  తెల్లవారుఝామున అనారోగ్యంతో మరణించాడన్న వార్త అటు సినీ పరిశ్రమను, తెలుగు ప్రజలను విషాదంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా ఆయన సినీ, జీవిత విశేషాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం: 
 
జననం

1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు కృష్ణంరాజు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి చినవెంకట కృష్ణంరాజు. ఎనిమిదో తరగతివరకు మొగల్తూరు హై స్కూల్‌‌‌‌‌‌‌‌, నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదివారు. క్షత్రియుల కుటుంబం కావడంతో పాఠశాలలో ఆయన్ని రాయల్ ఫ్యామిలీకి చెందిన రాజులా చూసేవారు.  ఆ తర్వాత హైదరాబాద్ బద్రుకా కాలేజ్‌‌‌‌‌‌‌‌లో బీకాంలో చేరారు.  అదే సమయంలో తమ బంధువులు నడిపే ‘ఆంధ్రరత్న’ అనే దినపత్రికలో జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌గా పని చేశారు. మరోవైపు ఫొటోగ్రఫీపై మక్కువతో అబిడ్స్‌‌‌‌‌‌‌‌లో ‘రాయల్ స్టూడియో’ పేరుతో ఫొటో స్టూడియోను కూడా నడిపారు. స్టిల్ ఫొటోగ్రఫీతో పాటు డాక్యుమెంటరీస్, యాడ్ ఫిల్మ్స్ తీశారు.  హైస్కూల్‌‌‌‌‌‌‌‌ రోజుల నుంచే సినిమాలపై ఆసక్తి.. అది కాలేజీ రోజులకు మరింత పెరిగింది. అదే ఆయన్ను సినిమాలవైపు అడుగులు వేసేలా చేసింది. 
 
రెబల్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

యాభై సంవత్సరాలపాటు సినీ పరిశ్రమలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించారు.  భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం..లాంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. సాంఘిక, పౌరాణిక చిత్రాలతో పాటు జానపద చిత్రాల్లోనూ ఆయన నటించారు.

‘కటకటాల రుద్రయ్య’తో రెబల్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. 90 తరువాత హీరో నుంచి క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌ చేశారు కృష్ణంరాజు. అందులోనూ తన ఇమేజ్‌‌‌‌‌‌‌‌కు తగ్గ హుందాతనం ఉన్న పాత్రకే ఓకే చెప్పారు. బావబావమరిది, జైలర్ గారి అబ్బాయి,  గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం, నాయుడు గారి కుటుంబం, మా నాన్నకు పెళ్లి, సుల్తాన్‌‌‌‌‌‌‌‌, బిల్లా, రెబల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో అలా నటించినవే. దాదాపు 40 సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి ఆయన స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. హీరోగా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించి, విలన్‌‌‌‌‌‌‌‌గా మారి, ఆపై తిరిగి తనను తాను ఓ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మలచుకున్న సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ మేడ్ హీరో కృష్ణంరాజుగారు. 
 
విలన్ నుంచి హీరో

సినిమాలపై ఆసక్తితోనే డిగ్రీ పూర్తిచేయకుండానే మద్రాసు వెళ్లారు కృష్ణంరాజు. కొన్ని ప్రయత్నాల తర్వాత ‘తేనెమనసులు’ చిత్రానికి సంబంధించి మేకప్ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. కృష్ణ హీరోగా సెలెక్టయితే కృష్ణంరాజు రిజెక్ట్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని రిజెక్షన్లు ఎదురైనప్పటికీ, ఆయన కోరుకున్నట్టుగానే ప్రత్యగాత్మ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లోనే హీరోగా పరిచయమయ్యారు.  ‘చిలకా గోరింక’ ఆయన తొలిచిత్రం. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో విలన్‌‌‌‌‌‌‌‌గా నటించారు.

అప్పటివరకూ ఒక మూస పద్ధతిలో వెళ్తున్న విలనిజానికి చెక్ పెట్టి తనదైన విలన్‌‌‌‌‌‌‌‌ షేడ్ తో మెప్పించారు కృష్ణంరాజు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి సీనియర్ లను మొదలుకొని కృష్ణ, శోభన్‌‌‌‌‌‌‌‌ బాబులాంటి తన వయసు హీరోల చిత్రాల్లోనూ బెస్ట్ విలన్‌‌‌‌‌‌‌‌ అనిపించుకున్నారు. విలనిజమ్‌‌‌‌‌‌‌‌లోనూ హీరోయిజం చూపించి నటుడిగా ట్రెండ్‌‌‌‌‌‌‌‌ సెట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. విలన్‌‌‌‌‌‌‌‌గా దాదాపు ఓ ముప్ఫై సినిమాలు చేసి వుంటారు. ఆ తర్వాత ‘ఇంటిదొంగలు’ చిత్రంతో సపోర్టింగ్‌‌‌‌‌‌‌‌ హీరోగా మారారు. అలా 60 సినిమాలు చేసి, తన 61వ సినిమాతో నిర్మాతగా సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు.
 
గోపీకృష్ణా మూవీస్‌‌‌‌‌‌‌‌ విజయ సారథి… 
విలన్‌‌‌‌‌‌‌‌గా, సపోర్టింగ్‌‌‌‌‌‌‌‌ హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే ‘గోపీకృష్ణా మూవీస్‌‌‌‌‌‌‌‌’ బ్యానర్‌‌ని స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ వ్యవహారాలన్నీ ఆయన తమ్ముడు సూర్యనారాయణరాజు చూసుకునేవారు. ఈ సంస్థలో తీసిన కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం సంచలన విజయాలు సాధించి, నిర్మాతగానే కాక హీరోగానూ కృష్ణంరాజు స్థాయిని అమాంతంగా పెంచాయి. అలాగే కటకటాల రుద్రయ్య, మనవూరి పాండవులు.. వారం రోజుల్లోపే విడుదలై సిల్వర్జూబ్లి హిట్స్‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి. ఆ తర్వాత తీసిన ‘మధుర స్వప్నం’ నిరాశపరిచినా, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ భారీ విజయాన్ని అందుకుంది.

ఆ ఉత్సాహంతో ‘తాండ్ర పాపారాయుడు’ తీశారు. కానీ అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. అదే సమయంలో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రాన్ని ‘ధర్మాధికారి’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ తర్వాత మా ఇంటి మారాజు, ప్రాణ స్నేహితులు చిత్రాలు నిర్మించారు. కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన ‘యమధర్మరాజు’ చిత్రం ఆర్థికంగా ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దాంతో నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకుని ‘బిల్లా’తో రీఎంట్రీ ఇచ్చారు. ‘రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో ఆయన కూతురు ప్రసీద కూడా తండ్రిలా నిర్మాతగా పరిచయమయ్యారు. 
 
గుర్తింపు..

కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన కృష్ణంరాజు మొత్తం180పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని సినిమాలు ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టాయి. 1977లో ‘అమరదీపం’ చిత్రంలో నటనకుగానూ రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. 1978లో ‘మనవూరి పాండవులు’ సినిమాకుగానూ మరోసారి రాష్ట్రపతి అవార్డు దక్కింది.  అలాగే అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు ఉత్తమ నటుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ లైఫ్‌‌‌‌‌‌‌‌టైమ్ అచీవ్‌‌‌‌‌‌‌‌మెంట్ అవార్డుతో పాటు, 2014లో రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు. 
 
ప్రభాస్‌‌‌‌‌‌‌‌ కెరీర్ వెనుక..

కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రభాస్.  తన నటవారసుడిగా ప్రభాస్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేయడం మొదలు అతను ప్యాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్టార్ అవడం వరకూ తెరవెనుక కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. ప్రభాస్‌‌తో కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాల్లో ఆయన కలిసి తెర పంచుకున్నారు. తన చివరి చిత్రమైన రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌ కూడా ప్రభాస్‌‌‌‌‌‌‌‌తోనే కలిసి నటించారు. 
ఆయన భార్య శ్యామలా దేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు.
 
అవి నెరవేరలేదు

అన్ని విధాలుగానూ సక్సెస్ అయిన కృష్ణంరాజుకి కొన్ని తీరని కోరికలు మిగిలిపోయాయి. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ పెళ్లి. ఆయన ప్రతి ఇంటర్వ్యూ లోనూ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించేవారు. అలాగే ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని ప్రభాస్‌‌‌‌‌‌‌‌తో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో కుదరలేదు. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ కోసం ‘ఒక్క అడుగు’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో మరో స్ర్కిప్ట్‌‌‌‌‌‌‌‌ను కూడా సిద్ధం చేశారు. ఇది కూడా కార్యరూపందాల్చలేదు. కృష్ణంరాజుకు ‘విశాల నేత్రాలు’ నవలంటే చాలా ఇష్టం. దాన్ని సినిమాగా తీయాలనుకున్నా వర్కవుట్ అవ్వలేదు. స్టూడియో నిర్మించాలనే ఆయన కోరిక కూడా నెరవేరలేదు. ఇక కేంద్రమంత్రిగా చేసిన కృష్ణంరాజుకు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సేవలందించాలని ఉండేది. పలు సందర్భాల్లో ఆయనకు గవర్నర్ పదవి వచ్చేసిందంటూ వార్తలు సైతం వచ్చాయి. కానీ అది జరగలేదు.
 
ప్రజాసేవలోనూ

కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజాజీవితాన్ని ప్రారంభించారు కృష్ణంరాజు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు అందులో చేరారు. 1998 ఎన్నికల్లో కాకినాడ లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది, పార్లమెంటులోకి అడుగుపెట్టారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్‌ సభ స్థానం నుంచి గెలుపొంది వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో నర్సాపురం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. భాజపాను వీడి 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. అనతి కాలంలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చారు.
 
సినీ ప్రముఖుల సంతాపం

కృష్ణంరాజు మరణం వెండితెరకు తీరనిలోటు అంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేష్‌ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, విజయ్ దేవరకొండ సహా పలువురు హీరోలు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 
◆ ఈరోజు మధ్యాహ్నం మొయినాబాద్‌ దగ్గరలోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.