BREAKING NEWS

కర్ణాటక సంగీత మాధురి... 'ఎంఎస్' జయంతి!

ప్రపంచ వ్యాప్తంగా కచేరీలు చేశారమే. భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న' పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌ అయిన 'రామన్ మెగసెసే' పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి.
కర్ణాటక సంగీత ఝరిలో శ్రోతలను ఓలలాడించింది. ఆమె సుబ్బలక్ష్మిగా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. ప్రముక కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈ నెల 16న ఆమె జయంతి సందర్భంగా ఆ అమరగాయని జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఈరోజు మనం తెలుసుకుందాం.
 
జననం

1916 సెప్టెంబర్16న, మధురై లోని దేవదాసి సంగీత కుటుంబంలో జన్మించిన సుబ్బలక్ష్మి అసలు పేరు కునుజమ్మ. అమ్మమ్మ అయిన అక్కమ్మ వయోలిన్ వాయిద్యకారిణి. తల్లి షణ్ముఖ వడివేలు వీణ వాయిద్యకారిణి. తరచూ ఇంట్లో జరిగే సంగీత కచేరీలు, వాటికి చెందిన చర్చలే ఆమెను కళా రంగంలోకి తీసుకువచ్చాయి. ఆరో తరగతిలో చదవలేదని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో బడికి వెళ్లడం మానుకొని, సంగీతాన్ని సర్వస్వంగా ఎంచుకుంది.

మూసిరి సుబ్రమణ్యం అయ్యర్, సమ్మగుడి శ్రీనివాస అయ్యర్ వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొందింది. తన 12వ ఏట తల్లితో కలిసి వేదిక ఎక్కి పాడినప్పుడు, కర్ణాటక సంగీతంలో ఒక కొత్త తారక వెలసినట్లైంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికపై1932లో ఒకనాడు ప్రఖ్యాత అరియ్యకుడి రామానుజ అయ్యర్ కచేరి చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల ఆయన హాజరు కాలేని పక్షంలో సభ నిర్వహులకు ఒక లేఖ రాస్తూ, నా స్థానంలో ఈ ఎంఎస్ పాడుతుందని పంపారు. అప్పటికి 16 సంవత్సరాల వయసున్న ఎంఎస్ ని చూసి సభలోని వారంతా నిరుత్సాహపడ్డారు. ఈ అమ్మాయి ఏం పాడుతుందో అని అనుకున్నారు. కానీ ఎంఎస్ వేదికను ఎక్కి కచేరి సిద్ధం చేసి, తన స్వరంతో తాళం, పల్లవి రవలించేలా పాడింది.

అతిచిన్న వయస్సులో మ్యూజిక్ అకాడమీ వేదికపై పాడే అవకాశం రావడం, అందులోనూ పాడి అందరి ప్రశంసలు అందుకున్నవారు అరుదు ఎంఎస్ లాగా. 1970లో ఒక సంగీత విమర్శుకుడు ఎంఎస్ సుబ్బలక్ష్మిని మీరు ఇప్పటివరకు ఎన్ని కచేరీలు చేసి ఉంటారని అడిగితే, అందుకు ఆమె చిరునవ్వుతో.. మనం దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్లుంటామో మనకు గుర్తుంటుందా ఇది కూడా అంతేనని జవాబు ఇచ్చిందట.

ఏడు దశాబ్దాల కాలంలో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ వంటి 10 భాషలలో సుబ్బలక్ష్మి చేసిన కచేరీల సంఖ్య 2వేల పైనే ఉంటుంది.

వాటిలో స్వలాభం కోసం చేసినవి 25 శాతం కూడా ఉండవు. మిగతా కచేరీలన్ని ప్రజా సంక్షేమనికిగానూ సేకరించే నిధుల కోసం చేసినవే. ఇలా సేకరించిన సొమ్ము కోట్ల రూపాయలలోనే ఉంటుందని అంచనా. అంతేకాకుండా సొంతంగా సమకూర్చుకున్న సొమ్ము కూడా అందరికి దానధర్మం కింద విరాళాలుగా ఇచ్చేవారామె. ఇంకా భర్త నడిపించే కల్కి పత్రిక నిర్వహణ సైతం దానధర్మం, విరాళాలకు వినియోగించారు ఆమె.

భర్త త్యాగరాజన్ సదాశివమ్. ఆయన ఎంఎస్ కు స్నేహితుడు, మార్గదర్శకుడు, ఒక ఫీలాసఫర్ కూడా. సదాశివన్ ఆనంద వికటం పత్రిక విలేకరిగా పని చేసేవారు. 1934లో మ్యూజిక్ అకాడమీలో వేదికపై ఎంఎస్ సృష్టించిన సంచలనం ఆయనను ప్రభావితం చేసింది. అతను జర్నలిస్ట్ కావడంతో తనకున్న పరిచయాలతో గాంధీ, నెహ్రు, రాజాజీలకు పరిచయం చేశారు. అప్పటి స్నేహం కాస్త 1940 జులై 10 నాటికి వివాహనికి దారి తీసింది.

సదాశివమ్ అప్పటికే వివాహితుడు. వీరిద్దరి జంటను నాటి ప్రముఖులు సావిత్రితో పోల్చారు. గురువుగా తోడుండి నడిపించిన సదాశివమ్ 1997లో మరణించారు. భర్త మృతి ఆమెను ఒంటరిని చేసింది. వారికి సంతానం లేదు. సదాశివమ్ మొదటి భార్య సంతానాన్ని ఆమె పెంచారు. ఆయన చనిపోయాక ఆమె పాడేందుకు తంబురానైన తాకలేదు. ఆమె పాడాలని, ఆమె పాడితే చూడాలని దేశవ్యాప్తంగా అందరూ వేచిచూశారు. కానీ ఆమె పాడకుండానే 2004 డిసెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. 

ఈమె 5 సినిమాల్లో నటించారు. ఆమె నటించిన సినిమాలలో చాలామందికి మీరా సినిమా మాత్రమే తెలుసు. ఆమె తొలి చిత్రం 'సేవాసదం' 1938లో వచ్చింది. తమిళ సినిమాని తొలినాట పెంచి పోషించిన కె. సుబ్రమణ్యం, ప్రేమ్ చంద్ కథ ఆధారంగా ఆనంద వికటంలో వచ్చిన ధారావాహిక ఆధారంగా సదాశివమ్ తీశారు. ఈ సినిమాలో ఈమె రెండు పాటలు పాడారు. 1940లో 'శకుంతల' సినీ చరిత్రలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. 

మీరా తమిళ వర్షన్ 1944లో వస్తే, హిందీ వర్షన్1947లో వచ్చింది.  

ఈ రెండు చిత్రాలను ఎంఎస్ కోసం సదాశివమ్ స్వయంగా నిర్మించారు. ఆమెకు మృదంగం సంబంధమైన లెక్కలు అన్ని తెలుసు. 

1940లో పద్మభూషణ్, 1956లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, 1967లో రవీంద్ర భారతి విశ్వ విద్యాలయం వారిచే గౌరవ డాక్టరేటు తో పాటు,1968లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి బిరుదుని పొందిన తొలి సంగీత విద్వాంసమణి అయ్యారు.

1970లో శ్రీ వెంకటేశ్వర డాక్టరేటు, 1974లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, సంగీత సార్వభౌమి, టీటీడీ సప్తగిరి సంగీత విధ్వామణి బిరుదు, 1980లో అంతర్జాతీయ సంగీత సంఘంలో గౌరవ సభ్యత్వం, శాంతినికేతన్ దేశాకోత్తమ అవార్డు, 1988లో కాళిదాసు సమ్మన్, 2004లో ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారాలు ఎంఎస్ ను వరించాయి.

భారత అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను1998లో ఆమె అందుకున్నారు.