BREAKING NEWS

'టెన్నిస్'కు వీడ్కోలు- ఫెదరర్!

24 ఏళ్ల కెరీర్.. 20 గ్రాండ్‌స్లామ్స్‌…103 ఏటీపీ టూర్‌ టైటిల్స్‌.. రెండు ఒలింపిక్‌ పతకాలు.. ఇలా లెక్కకు మించిన ఘనత, తన ఖాతాలో రాసుకున్న ఫెదరర్‌..
తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో సూపర్‌ సర్వీస్‌, ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో నెట్ లో ప్రత్యర్ధులకు ముచెమటలు పట్టించిన యోధుడు…

41ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు ముగింపు పలికాడు. లావెర్‌ కప్‌ తర్వాత కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన
ఆటగాడిగా గుర్తింపు సాధించిన ఫెదరర్‌ నిర్ణయంపై యావత్‌ క్రీడాలోకం సగర్వంగా 'థాంక్యూ' చెబుతోంది. ఈ సందర్భంగా రోజర్ ఫెదరర్ కెరీర్ గురుంచిన ఆసక్తికరమైన అంశాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి

1998లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టిన ఫెదరర్‌ ఆ తర్వాత ఈ ఆటపై తనదైన ముద్ర వేశాడు. పదునైన సర్వీస్‌లతో పాటు ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌, ఫుట్‌వర్క్‌, ఎటాకింగ్‌ షాట్ లతో ఆటను తారాస్థాయికి తీసుకెళ్లేవాడు. ఇక నెట్‌ గేమ్‌లో అయితే అతడికి తిరుగేలేదు. రికార్డు స్థాయిలో 1526 సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడిన రోజర్‌.. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ నిష్క్రమించకపోవడం అతడి శక్తిసామర్థ్యాలకు నిలువుటద్దంలా నిలిచాయి. 2003లో వింబుల్డన్‌ ద్వారా మొదటి గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకున్నాడు. తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ లేని లోటును 2009లో తీర్చుకుని, కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేశాడు. 2004లో వరల్డ్‌ నెంబర్‌వన్‌గా నిలిచినప్పటి నుంచి 2009వరకు పురుషుల టెన్నిస్‌ను ఏకధాటిగా శాసించాడు.

ఈ కాలంలో ఫెదరర్‌ 14 గ్రాండ్‌స్లామ్‌తో అభిమానుల్ని అబ్బురపరిచాడు. మధ్యలో కొంత ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ, 2017లో అనూహ్యంగా తిరిగి పుంజుకున్నాడు. ఆ ఏడాది రెండు, తర్వాతి ఏడాది మరో మేజర్‌ టైటిల్‌తో గ్రాండ్‌స్లామ్‌ సంఖ్యను 20కి చేర్చాడు. 

2018లో సాధించిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కెరీర్‌లో చివరిది. కాగా ఆ ఏడాది 36 ఏళ్ల వయస్సులోనూ వరల్డ్‌ నెంబర్‌వన్‌గా నిలిచి, రికార్డు సృష్టించాడు. 
సింగిల్స్‌లో అతడి రికార్డు(1251-275) 80 శాతం ఉండగా.. 103 టైటిళ్లను గెలుచుకున్నాడు. అలాగే 223 డబుల్స్‌ మ్యాచ్‌ల్లో 8 టైటిళ్లు సాధించాడు.  ఫెదరర్‌ భార్య మిర్కా కూడా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయరే కాగా.. ఈ జోడీకి రెండుసార్లు కవల పిల్లలు జన్మించారు.
 
కోచ్.. పీటర్కు అంకితం… 

ఇతను రోజర్‌ ఫెదరర్‌ చిన్ననాటి కోచ్‌. అయితే కోచ్‌ కంటే కూడా ఫెదరర్ కు కార్టర్‌ ఎంతో దగ్గరివాడు. రోజర్‌కు తొమ్మిదేళ్ల వయస్సులో అతడి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పీటర్‌ 18 సంవత్సరాలు అతడితోనే ఉండి, తనను మేటి ఆటగాడిగా తీర్చిదిద్దాడు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన కార్టర్‌ 2002లో సౌతాఫ్రికాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

ఆ ఘటన ఫెదరర్ ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆ షాక్‌ నుంచి అతడు చాలాకాలంవరకు బయటపడలేదు. దాంతో తాను స్వయంగా స్థాపించిన ఫెదరర్ ఫౌండేషన్‌ ద్వారా దక్షిణాఫ్రికాలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. కాస్త పరిశీలనగా చూస్తే.. ప్రతి టోర్నీ టైటిల్‌ గెలిచాక రోజర్ కంట్లో నీరు ఒలుకుతుంది. అవి కార్టర్‌కు నివాళిగానే అని అంతా భావించి, గౌరవిస్తారు. ఇదిలావుంటే 2005 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి ఫెదరర్‌ తన ప్లేయర్‌ బాక్సులోని సీట్లను కార్టర్‌ తల్లిదండ్రులైన బాబ్‌, డయానా కార్టర్‌ లకు కేటాయిస్తుండడం విశేషం!
 
ఫెదరర్లేఖ..

‘ఇన్ని సంవత్సరాలుగా టెన్నిస్‌ నాకు ఎన్నో విలువైన బహుమతులను ప్రసాదించింది. కానీ వాటన్నింటికన్నా.. నా ఈ క్రీడా ప్రయాణంలో కలిసిన స్నేహితులు, నా ప్రత్యర్థులు, మరీముఖ్యంగా టెన్నిస్‌ ఆటకు ప్రాణం పోసిన అభిమానులే నాకు స్ఫూర్తి. అలాంటి వారందరితో ఈరోజు నేను ఓ విషయం పంచుకోవాలని అనుకుంటున్నా.. మీకు తెలుసు గత 3 సంవత్సరాలుగా గాయాలు, ఆపరేషన్ల రూపంలో నేను శారీరకంగా సవాళ్లు ఎదుర్కొంటున్నా. అయితే వాటిని అధిగమించి పూర్తి ఫిట్‌నెస్‌తో టెన్నిస్‌లోకి అడుగుపెట్టాలని తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నా. కానీ అదే సమయంలో నా శారీరక సామర్థ్యం, దాని పరిమితులు కూడా నాకు తెలుస్తున్నాయి.

నా వయస్సు 41 ఏళ్లు. 24 ఏళ్ల నా ఈ ప్రస్థానంలో 1500ల మ్యాచ్‌లు ఆడా. టెన్నిస్‌ ఆటగాడిగా నా కల కన్నా ఎక్కువే సాధించా. ఇక నా కెరీర్‌కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్న విషయం గుర్తించా. వచ్చేవారం లండన్‌లో జరిగే లెవర్‌ కప్‌ నా కెరీర్‌లోనే చివరిది. కానీ భవిష్యత్‌లో టెన్నిస్‌ ఆడతా. అయితే అవి గ్రాండ్‌స్లామ్‌లు, ఏటీపీ టూర్‌ ఈవెంట్లు మాత్రంకావు. ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతులలో నేను ఒకడినని భావిస్తున్నా. నా భార్య మిర్కా, నలుగురు పిల్లలకు.. అందరికీమించి నా అభిమానులకు రుణపడి ఉంటాను.

అభిమానులుగా మీరిచ్చిన ప్రోత్సాహం, ప్రేరణే నాలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపి, దాదాపు రెండున్నర దశాబ్దాలు నన్ను ఆటలో ఇంతవరకు నడిపించాయి. టెన్నిస్ పై నాకు ప్రేమ కలిగినప్పుడు సొంతూరు బాసెల్‌లో నేను బాల్‌ బాయ్‌ని. అప్పట్లో ఆటగాళ్లను చూడడమే ఓ అద్భుతంగా ఉండేది నాకు. వారిని చూస్తూ టెన్నిస్ లోకి అడుగుపెట్టి అహోరాత్రులు తీవ్రంగా శ్రమించి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగా. చివరగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. టెన్నిస్‌ ఆటకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ ఫెదరర్‌ తన లేఖను ముగించాడు. 
 
ఫెదరర్‌ 20 గ్రాండ్స్లామ్టైటిల్స్జాబితా

ఆస్ట్రేలియా ఓపెన్‌: 6 వరుసగా (2004, 2006, 2007, 2010, 2017, 2018),

ఫ్రెంచ్‌ ఓపెన్‌: 1 (2009),

వింబుల్డన్‌: 8 వరుసగా(2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017),
యూఎస్‌ ఓపెన్‌: 5 వరుసగా (2004, 2005, 2006, 2007, 2008).

ప్రైజ్మనీ- 13,05,94,339(యూఎస్‌ డాలర్లు)

కెరీర్టైటిళ్లు.. 103 (ఓపెన్‌ ఎరాలో రెండో అత్యధిక విజయాలు)
టూర్లెవెల్విజయాలు.. 1251

అత్యుత్తమ ర్యాంకింగ్‌.. 1 (ఫిబ్రవరి 2, 2004)
బిజీంగ్‌(2008) స్వర్ణం, లండన్‌(2012) రజతం,

డేవిస్కప్‌.. 2014, హాప్మన్కప్‌.. 2001, 2018, 2019లు.