BREAKING NEWS

చెడుపై మంచి గెలిచే.. 'వామనవతారం'!

 దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా ధర్మాన్ని పరిరక్షించేందుకు పలు రూపాల్లో అవతారమెత్తాడు ఆ శ్రీ మహావిష్ణువు. వామన అవతారమూర్తిగా లోకానికి చెడు మీద మంచి గెలుస్తుందన్న విషయాన్ని తెలియజేయడానికి, వామనుడిగా జన్మించాడు. ఈ నెల 7న 'వామన జయంతి' సందర్భంగా, ఆ అవతారం వెనుక వృతాంతం గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
 
శ్రీ మహావిష్ణువు మొదటిసారిగా మానవుని రూపంలో అవతరించింది… నువ్వు నీ సతానం దీర్ఘాయుష్షుతో ఆనందంగా జీవిస్తారని, ప్రహ్లాదునికి విష్ణువు వరం ఇస్తాడు. ఆ ప్రహ్లాదుని మనువడే బలి చక్రవర్తి. బలి చక్రవర్తి తెలివైనవాడు. ఈయన ఎప్పుడు దేవతల పైన యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే అలా వెళ్లి, ఎవరు గెలిచినట్లు దాఖలాలు లేవు అంతేకాదు అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు సైతం తన వద్ద లేదని అతనికి తెలుసు. బాహుబలిలో శివగామికి నమ్మిన బంటు కట్టప్ప ఎలానో, కశ్యపముని భార్యకు శుక్రాచార్యుడు అలాగా. ఆయనే రాక్షసులకు గురువు. బలి చక్రవర్తికి కూడా ఆయనే గురువు. తనతో దేవతలను జయించాలంటే ఒక మార్గం ఉందని చెప్తాడు…

అదే విశ్వజిత్తుయాగం. ఆ యాగం చేసినవారికి ముల్లోకాలలో ఎదురే ఉండదు అని చెప్పి తన చేత యాగం చేయించాడు. ఆ యాగం అగ్ని నుంచి 4 గుర్రాలతో కూడిన ఒక బంగారు రథం ఒకటి బయటకు వచ్చింది. ఆ రథం మీద ఏ యుద్ధానికి వెళ్లిన విజయమే అంతిమం. అప్పుడు దేవతలపైన యుద్ధం చేయడానికి తన సైన్యంగా పిలువబడే రాక్షసులను తీసుకొని ఇంద్రలోకానికి వెళ్లాడు. దీన్నిబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శత్రువుకి ఎప్పుడు మనం ఎదురుగా వెళ్లి తలపడకూడదు. ఎందుకంటే అలా వెళ్తే మనకు విజయం రాదు. దానికంటే సమయం, బలం వచ్చేదాకా ఓపికగా ఉండటం ఉత్తమం. తీరా యుద్ధం చేయడానికి ఇంద్రలోకానికి వెళ్తే, అక్కడ ఇంద్రుడు లేడు, దేవతలు లేరు, అసలు అక్కడ ఎవ్వరు లేరు.

ఆ ప్రదేశమంతా ఖాళీగా ఉంది. ఎందుకంటే బలి చక్రవర్తి విశ్వజిత్తు యాగం చేసి, ఇంద్రలోకానికి యుద్ధం చేయడానికి వస్తున్నాడని తెలుసుకొని, వేరే లోకానికి వెళ్ళిపోతారు. అలా దేవలోకం బలిచక్రవర్తి వశమైంది. భూలోకంలో, దేవ లోకంలో బలి చక్రవర్తికి ఎవరు ఎదురు నిలవలేదు. దేవలోకాన్ని కూడా ధర్మంగానే సాధించుకున్నాడు. ఎవరి బలాన్ని బట్టి వారు విజేయులు అయ్యారు. అయితే రాక్షసులందరూ ధీదితి పిల్లలు కాగా దేవతలందరూ అధితి పిల్లలు. అధితి పిల్లలందరూ ఎన్నో సుఖాల వలన దేవలోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్లి దాకున్నారు. కానీ అక్కడ వారు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు.

పిల్లలు కష్టపడుతున్నారంటే ఏ తల్లి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే విష్ణుపాయవ్రతం అనే వ్రతం చేసి, విష్ణువు దర్శనం దక్కించుకుంది. నువ్వు నా కడుపున పుట్టి, దీనంతటికి కారణమైన ఆ బలి చక్రవర్తిని సంహరించాలని విష్ణువుని వరం కోరింది ఆ తల్లి. అందుకు విష్ణువు అమ్మా.. అధితి నువ్వు అడిగినట్లు నీ కడుపున పుడతాను, దేవతలకు దేవలోకం సొంతం అయ్యేలా చేస్తాను. కానీ బలిచక్రవర్తి నా బహుభక్తుడైన ప్రహ్లదుని మనుమడు, పైగా ధర్మవంతుడు. కావున ఈ విషయంలో ఏది యోగ్యమైనదో అదే చేస్తాను అని చెప్పాడు. కానీ ఏంచేస్తాడనేది స్పష్టత ఇవ్వలేదు. కనీసం దేవలోకాన్ని తిరిగి తీసుకొచ్చి, తన పిల్లలకు విముక్తి కల్పిస్తాడని భావించి, సరేనని ఒప్పుకుంది.

అలా ఇచ్చిన మాట ప్రకారం, పుట్టడంతోనే 7 సంవత్సరాల బాలుడిగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో జన్మించాడు. ఆయన ఒక బ్రహ్మణుడిలా భిక్షాటనకు బయలుదేరాడు. ఇంతలో బలిచక్రవర్తి యాగఫలాన్ని బ్రహ్మణులందరికి పంచుతున్నాడు. ఇంతలో వామనవంతు వచ్చింది అప్పుడు నువ్వు నాకు యాగఫలం ఇస్తున్నావు కదా, అందుకు నేను కోరింది ఇస్తావా అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి నీకు ఏమి కావాలో అడుగు.. ధనం, బంగారం, మణులు, మాణిక్యాలు, రాజ్యాలు.. ఇలా ఏది కావాలన్న అడుగు ఇస్తానన్నాడు. నాకు ఇవేమీ వద్దు 3 అడుగుల నేల చాలు అంటాడు. అందుకు బలి చక్రవర్తి 3 అడుగులెం కర్మ.. ఎన్ని వేల యోజనాలైన ఇస్తానన్నాడు.

నాకు వద్దు కేవలం 3 అడుగులు మాత్రమే కావాలి అని అన్నాడు. సరేనని 3 అడుగుల నేల ఇవ్వడానికి బలిచక్రవర్తి ఒప్పుకున్నాడు. వీరి గురువు వెంటనే గ్రహించి, బలి చక్రవర్తితో, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావ్, నాకు ఎందుకో ఇతనిని చూస్తే విష్ణువు రూపమని  అనిపిస్తుందని పలుకగా, ఆ మాటలేం పట్టించుకోకుండా, సంతోషంగా.. మనసులో అంత గొప్ప మహావిష్ణువు ఎవరి దగ్గర భిక్షాటన చెయ్యలేదు. కానీ నన్ను వెత్తుకుంటూ వచ్చి, నన్నే భిక్షం అడుగుతున్నాడు, ఇంతకన్నా అదృష్టం ఇంకేమి ఉంటుంది అనుకున్నాడు. చరిత్రలో విష్ణువుకి దానమిచ్చినవాడిగా నా పేరు నిలిచిపోతుంది అంటూనే.. జామదర్పణం చేసి, వామనుడి కాళ్ళు కడిగాడు.

వామనుడు కాళ్ళు కడగడానికి ఒక పాత్రలో నుంచి నీరు పోస్తుండగా నీరు వచ్చే దారిలో శుక్రమహర్షి ఒక చిన్న ఆకారంగా మారి నిలుచుంటాడు.అప్పుడు విష్ణువు ఏదో అడ్డు పడింది అని ఒక పుల్ల తీసుకొని ఆ పాత్రలో పొడిచాడు. అప్పుడు శుక్రమహర్షి కంట్లో గుచ్చుకొని, ఒక కన్ను పోతుంది. సరే నన్ను 3 అడుగులు తీసుకోమన్నావు నా పాదాలతో తీసుకుంటానని చెప్పి, విశ్వమంతా పెద్దగా అయ్యాడు వామనుడు. వెంటనే ఒక కాలు భూలోకం మీద ఒక కాలు దేవ లోకం మీద వేశాడు. బలిచక్రవర్తితో, ఇప్పుడు భూలోకం, దేవలోకం నా సొంతమయ్యాయి. మరీ మూడో కాలు ఎక్కడ వేయమంటావని అడిగాడు. వెంటనే శుక్రమహర్షి అడ్డు వచ్చి నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకో అని అన్నాడు. ఆ మాటకి బలిచక్రవర్తి వినలేదు.

బదులుగా నేను మాట ఇచ్చాను, కాబట్టి మూడో కాలు నా తలమీద పెట్టు అన్నాడు. దానికి మహావిష్ణువు మామూలు రూపానికి వచ్చి, నేను నిన్ను పరీక్షించాలనుకున్నాను. ఇచ్చిన మాటకు ధర్మంగా కట్టుబడి ఉన్నావు. అందులోనూ నువ్వు నా భక్తుడైన ప్రహ్లాదుని మనవడివి.. నేను నిన్ను చావనివ్వనని అంటాడు. ఇక నువ్వు సూతల లోకానికి వెళ్ళు అక్కడే మీ పిల్లపాపాలతో సంతోషంగా జీవించు, నీకు నా సుదర్శనచక్రం తోడుంటుంది. అది నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. వచ్చే మన్మంతర కాలంలో నేను నిన్ను మళ్ళీ దేవలోకానికి అధిపతిని చేస్తాను. నువ్వు తనువు చాలించిన తరువాత, నిన్ను వైకుంఠానికి తీసుకువెళ్లి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానని వెళ్ళిపోతాడు.

ఈ కథను బట్టి ఇక్కడ మనం రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 
1. మనం ఒక్కసారి మాట ఇస్తే ధనం, ప్రాణం, మానం, పోయిన సరే ఆ మాటని తప్పకూడదు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది.

2. నువ్వు దేవుడ్ని ఏమి కోరుకోకు, ధర్మానికి కట్టుబడి ఉంటే, నీకు అన్ని తానే ఇస్తాడు. అలాకాకుండా నువ్వు అడిగితే, ఏదైతే అడిగావో అదే ఇస్తాడు. నువ్వు అడగకపోతే నీకు కావాల్సినవి అన్ని ఇస్తాడు.

దేవతలు మంచికి చిహ్నం, రాక్షసులు చెడుకు చిహ్నం. మంచి ముందుగా ఓడిపోయి, చెడు గెలవొచ్చు. కానీ చివరగా మంచి చెడును ఓడించి గెలుస్తుందన్న విషయం వామనవతారంలో మనకు గోచరిస్తుంది.