BREAKING NEWS

దసరా పండుగ ప్రత్యేకత, విశిష్టత మరియు చరిత్ర

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో దసరా పండుగ ఒకటి.  ఈ పండుగని నవరాత్రులు జరపడం ఆనవాయితీ. నవరాత్రి  పదం లో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. అంటే ఈ పండుగని మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుపుతారు. నవ అహోరాత్రులు అనే ధార్మిక గ్రంధాలు నవరాత్రి పదాన్ని ఎలా చెబుతున్నారంటే....తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులుగా. ఇలా  నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానం కలిగి ఉంది. ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు, తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది.  దీపం వెలిగించడం దేవి అర్చన, లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణ ఈ నవరాత్రుల్లో చేస్తే భక్తులు కోరికలు నెరవేరుతాయని అంటారు. రోగ పీడలతో బాధపడేవారు జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.
 
ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఆఖరి రోజున పార్వేట ఉంటుంది. ఆంధ్రలో దీనిని నవరాత్రులు అని కొలుస్తారు, అదే తెలంగాణలో బతుకమ్మ  సంబరాలు జరుపుతారు. తెలంగాణలో పల్లెల్లో స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. ఇది ఇలా ఉండగా దసరా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..... ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి తొమ్మిది రోజులు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాల దసరా అని పిలుస్తాము అన్నది తెలిసిందే.  
 
దసరా పండుగ చరిత్ర:
 
పూర్వ కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే అర్ధం దున్నపోతు. దున్నపోతు ఆకారంలో అతను ఉండటం వల్ల అలా పిలిచేవారు.  ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండడంతో.... తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొన్నాడు. ఇలా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావటం వల్ల ఒక వరాన్ని పొందుతాడు. అదే ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా ఉండడం. ఇలా పొందినప్పటి నుంచి  దేవతలను ప్రజలను హింసించ సాగాడు. అంతటినీ గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. వారు సృష్టించిన ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గా దేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడినుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా సింహాన్ని వాహనంగా పొందింది. 9 రోజులు  దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం జరిపి అతన్ని సంహరించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవీనవరాత్రులుగా 10 వ రోజును విజయానికి చిహ్నంగా విజయ దశమి జరుపుకుంటాము మనం. 
 
ఇది కాకుండా మరో రెండు కారణాలు కింద కూడా జరుపుతారు. అవేమిటంటే.... రామాయణ గాఢ ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజుగా పరిగణిస్తారు. లేదా  మహా భారతంలో పాండవులు తమ వనవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి చెట్టు పై నుండి తీసుకున్న రోజుగా కూడా పరిగణిస్తారు. 
  
తొమ్మిది రోజులు పూజలు, ప్రసాదాలు:
 
1 . బాలాత్రిపుర సుందరి  - పొంగలి
2. గాయత్రీ దేవి - పులిహోర
3. అన్నపూర్ణా దేవి - కొబ్బరన్నం
4. కాత్యాయనీ దేవి - అల్లం గారెలు
5. లలితా దేవి - దద్దోజనం
6. శ్రీలక్ష్మీ దేవి - రవ్వ కేసరి
7. మహా సరస్వతీ దేవి - కదంబం
8. మహిషాసురమర్దిని - బెల్లం అన్నం
9. రాజరాజేశ్వరీ దేవి - పరమాన్నం
 
ఇలా ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో అవతారం తయారు చేసి ధూపదీప నైవేద్యాలని దేవి కి సమర్పిస్తారు. ఎవరి సంప్రదాయాలు ప్రకారం, పద్దతి  ప్రకారం వారు పూజలు చేసి అమ్మ వారిని కొలుస్తారు. అలానే ఈ తొమ్మిది రోజులు కూడా బొమ్మల కొలువు పెడతారు. అంటే బొమ్మలన్నింటిని అందంగా ఉంచి అందరినీ పిలిచి సరదాగా చూపిస్తారు. 
 
విజయదశమి నాడు ఏం చెయ్యాలి? 
 
పదవ రోజు అనగా విజయ దశమి నాడు  ఉదయాన్నే లేచి తలా స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకు, పూలతో తోరణాలను కట్టి అలంకరిస్తారు. అలానే పిండి వంటలు వండుకుని బందు మిత్రులతో కలిసి పంచుకుంటారు. అలానే సాయంకాలం అమ్మవారికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు. ఇలా ఆరోజు ఎంతో ఆనందంగా కుటుంబంతా కలిసి ఈ విజయ దశమి జరుపుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల వాళ్ళు అయితే రావణాసురుని వద కి గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, టపాకాయలు కాల్చడం చేస్తారు. 
 
విజయదశమి ప్రత్యేకత:
 
సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు. కనుక ఆ రోజు  కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదంటారు. అలానే ఆ రోజు  జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే  శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో,  నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది అని నమ్మకం.