BREAKING NEWS

ఉండవల్లి గుహలు గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే...!

స్థంబాల  మీద ఎంతో అందమైన లతలు...... గుహ అంతర్భాగాల లో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు..... అబ్బా చూస్తేనే జన్మతరిస్తుంది. మరి అటువంటి ప్రదేశానికి వెళితే ఎంతో రిలీఫ్ గా, రిఫ్రెష్ గా ఉంటుంది కదా.....!
 
ఉండవల్లి ప్రాంతం:
 
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంకి చెందిన గ్రామం ఇది. ఈ గ్రామం విజయవాడ నగరానికి ఒక ప్రధాన శివారు ప్రాంతం. అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాలలో ఉండవల్లి ఒకటి. ఈ గ్రామానికి ఉత్తరాన కృష్ణా నది, తూర్పున తాడేపల్లి పట్టణం, దక్షిణాన ఎర్రబాలెం గ్రామం, పశ్చిమాన పెనుమాక, వేంకటపాలెం గ్రామాలు హద్దులుగా ఉన్నాయి. ఇక్కడ బహు ప్రాచీన గుహాలయాలు ఉన్నాయి. ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగం నుండి లోపలికి దారి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటి మధ్యలో స్తంభాలు..... వాటిపై చెక్కిన అందమైన లతలు...... గుహ అంతర్భాగాల లో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు ఇలా మొదలైన వాటితో ఈ ప్రదేశం అంతా కూడా విశాలంగా ఉంటుంది.
 
ఇక్కడ నాలుగు అంతస్తుల ఆలయాలు ఉన్నాయి. ఇవే ఇక్కడ ప్రధాన అక్షర్షణ. ఇటువంటు ప్రదేశం కోసం ఏమని చెప్పాలి... ఎంతని చెప్పాలి.... అలానే ఇక్కడ  త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణువు శివుడు, గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం. అబ్బా ఈ ప్రదేశాన్ని వివరిస్తూ పోతే ఎన్నో చెప్పాలి. ఇక్కడ శిల్పాలే ప్రకృతి వీక్షకుల్ని కనువిందు చేస్తాయి. పొడవైన పద్మనాభ స్వామి వారి ప్రతిమ బాగా ఆకట్టుకుంటుంది. చూసారా ఈ గుహాలయాలు ఎంత అందంగా ఉన్నాయో...!  మరి ఇంకెందుకు ఆలస్యం ఈ గుహాలయాల గురించి పూర్తిగా ఇప్పుడే చూసేయండి.
 
ఉండవల్లి గుహాలయాల అందాలు:
 
అసలు ఉండవల్లి పేరు చెబితే తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేవి గుహాలయాలు. సరదాగా కుటుంబసమేతంగా ఇక్కడికి వెళ్తే ఎంతో ఆనందంగా గడపవచ్చు. ఇక్కడ విశేషమేమిటంటే ఒకే పర్వతాన్ని గుహలుగా చేయడమే. దానిలో దేవతా ప్రతిమలతో పాటు దాదాపు 20 అడుగుల ఏకశిలా అనంత పద్మనాభ స్వామి ఉండడం. బ్రహ్మ చుట్టూ దేవతామూర్తులు శిల్పాలతో ఉండడాన్ని చూస్తే  అద్భుతం అంటారు. అయితే దీనిలో మొదటి అంతస్తులో నరసింహస్వామి విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు చెక్కి ఉంటాయి. దీనితో పాటు గోడల మీద కూడా కొన్ని శిల్పాలు ఉంటాయి.  
 
అదే రెండవ అంతస్తు విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ 25 పొడవు 6 వెడల్పు గలిగి ఒకే శిలలో చెక్కిన అనంతపద్మనాభస్వామి శయనించి ఉంటారు. ఆయన నాభి లో తామరపుష్పం అందులో బ్రహ్మ పాదాలవద్ద మధుకైటభులనే రాక్షసులు దాని పక్కన  విష్ణు వాహనమైన గరుక్మంతుడు తపస్సు చేస్తున్న ఋషులు ఇలా అనేక విగ్రహాలని అక్కడ మనం చూడవచ్చు. కానీ అతుకులు లేకుండా ఒకే రాతితో చేయడం విశేషమే అనాలి. కొండలు రాతితో ఇలా ఈ విగ్రహాలు చేయడం అంటే సులువేం కాదు. ఇక మూడవ అంతస్తు విషయం లోకి వచ్చేసరికి పూర్తిగా నిర్మింపబడిన త్రికూటాలయం ఉంది. ఇక్కడ ఏ విగ్రహాలు ఉండవు. 
 
ఉండవల్లి గుహాలయాలు చరిత్ర:
 
ఈ గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవి. అప్పటి నుంచి క్రమంగా ఇవి  ప్రసిద్ధి చెందుతూ వచ్చాయి. బౌద్ధ హైందవ శిల్ప కళా రీతులు సమ్మేళనం ఈ గుహాలయాలు. బౌద్ధ భిక్షువుల నివాసం కోసం దీనిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతకాలం క్రితం పరవస్తు శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేసినప్పుడు కొన్ని బౌద్ధ మత శిల్పాలు బయటపడ్డాయి. దానితో ఒకప్పుడు ఈ కొండ పై భాగాన  బౌద్ధరామాలు వెలిశాయి అని అంటారు.
 
 
ఉలితో చెక్కిన ఈ సౌందర్యాలని ఎలా చేరుకోవాలి..? 
 
ఉండవల్లి గుహలకు గుంటూరు విజయవాడ నగరం నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం గుంటూరుకు 30 కిలో మీటర్ల దూరంలో ఉంది. అదే విజయవాడ కు 6 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నాయి. గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి వెళ్లి అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవెల్లి చేరుకోవచ్చు. అదే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి కూడలి చేరుకుంటే అక్కడినుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే. కాబట్టి సులువుగా ఇక్కడికి చేరుకోవచ్చు.
  
ఉండవల్లి గుహల రహస్య మార్గాలు :
 
ఈ ఉండవల్లి గుహల నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయి అని అంటారు. పూర్వం రాజులు శత్రువులు నుండి తమ సైన్యాలను ఇదే మార్గంలో తరలించే వారట. అయితే ఇప్పుడు మాత్రం ఆ సొరంగమార్గం మూతపడి ఉంది.
  
 గుహాలయాలని సందర్శించడానికి సరైన వేళలు:
 
ఈ గుహాలయాల కనుక మీరు సందర్శించాలంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.  15 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశం కలదు.
 
చూశారా ఈ గుహాలయాలు ఎంత గొప్పగా ఉన్నాయో...! ఇటువంటి ఘన  చరిత్ర కలిగి ఉన్న ప్రదేశాలను చూడడం మంచి అనుభూతిని ఇస్తుంది. అలానే ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు కనుక మీరు కూడా ఈ గుహాలయాలని   కుటుంబ సమేతంగా చూసేసి ఆనందించేయండి మరి.