BREAKING NEWS

బతుకమ్మ పండుగ ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే..!

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగని అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రతి ఏటా వచ్చే ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి  తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. కుటుంబమంతా ఈ పండుగని జరుపుకుని ఆనందిస్తారు. ఈ బతుకమ్మ పండగని సద్దుల పండుగ అని కూడా అంటారు. దసరాకి రెండు రోజుల ముందు ఇది వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు పండుగ సంబరాలతో, కుటుంబ కోలాహలాలతో నిండిపోయి ఉంటుంది. 
 
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ ఇది. అబ్బా...!  రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడి సరదాగా గడుపుతారు. బొడ్డెమ్మ తో మొదలు ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా ప్రతీ దానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మలను బావి లో లేదా నీటి ప్రవాహం లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో....బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..... అని మహిళలు పాటలు పాడి తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. నిజంగా ఈ పాటలు వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. 
 
పాటలో దాగిన మర్మం:
 
తెలంగాణ అస్తిత్వం మన బతుకమ్మ లోనే చూడొచ్చు. ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలో శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. అసలు ఇది ఎలా మొదలైంది....? ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు...? ఈ  విషయానికి వస్తే.... ఈ సాంప్రదాయం గురించి చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నవాబుల కాలం లోనూ భూస్వాముల కాలం లోనూ తెలంగాణ గ్రామీణ సమాజం లో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగి పోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని అక్కడ ఉన్న చుట్టూ మహిళలు విచారించే వారు. అందుకే వారికి ప్రత్యేకంగా పూలను పేర్చి బతకాలమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. చూసారా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అన్న పాటలు వెనక  మర్మం ఉందో.....!
 
పండుగ నాడు పాడే ఈ పాట:
 
బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో.... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... నానోము పండింది ఉయ్యాలో..... నీనోము పండిందా ఉయ్యాలో.... మావారు వచ్చిరి ఉయ్యాలో.... మీవారు వచ్చిరా ఉయ్యాలో..... ఇలా పాడుతూ చుట్టూ తిరుగుతూ పండగ జరుపుకుంటే ఎంత అద్భుతమో కదా...! 
 
ఏయే రోజు ఏయే బతుకమ్మ అంటే..? 
 
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ అని  ఐదో రోజు అట్ల బతుకమ్మ అని  ఆరవరోజు అలిగిన బతుకమ్మ అని  ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ అని 9వ రోజు సద్దుల బతుకమ్మ అని  ఇలా ఇదే క్రమం లో  వీటిని అనుసరిస్తారు. 
 
తొమ్మిది రోజుల నైవేద్యంలో వీటిని సమర్పిస్తారు. అవే.... మొక్కజొన్నలు, జొన్నలు , సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు. ఇక్కడ ఉన్న ఆడపడుచులు అందరూ అత్త వారి ఇళ్ల నుండి  కన్న వారి ఇంటికి చేరుకుని పూల పండుగని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇలా ఈ తొమ్మిది రోజులు కూడా బతుకమ్మలు చేసి ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత తొమ్మిది రోజులు ముగిశాక తమ దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.  పండుగని తరతరాల నుండి ఇదే రీతిలో చేయడం జరుగుతోంది. 
 
బతుకమ్మ పండుగ విశేషాలు :
 
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అంటారు. పూలు బాగా వికసించే కాలంలో...... జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో..... ఈ పండుగ వస్తుంది. భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఇలా ఈ శీతాకాలం సమయం లో రంగు రంగుల పూలతో ఈ పండుగని జరుపుతారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ శుక్రవారం(అక్టోబరు 16) ప్రారంభం అయ్యింది. ఈ నెల 24  వరకు ఈ పండుగ జరుగుతుంది. ఇలా మహిళలు ఈ పండుగని ఎంతో ఘనంగా చేస్తారు.
 
ఆంధ్రప్రదేశ్ లో బతుకమ్మ పండుగ: 
 
 ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ ప్రచారంలో ఈ పండుగ లేక పోయినా గుంటూరు, మాచవరం లో ఇంకా ఈ పండుగను జరుపుతారు. పచ్చగా పెరిగే పైరు.... సంపద విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యం గా ఉంటుంది. పండుగను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఇక్కడ కూడా తెలంగాణలో జరిగే రీతిలోనే బతుకమ్మ పండుగని జరుపుతారు. 
 
బతుకమ్మ సంబరాలు:
 
ఈ బతుకమ్మ పండుగను పిల్లల నుంచి పెద్దల వరకు కలసిమెలసి ఆనందంగా జరుపుకుంటారు. రకరకాల పిండి వంటలు వండుకోవడం, ఒక్కో రోజు ఒక్కో పదార్ధాలతో నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలా అమావాస్య రోజు మొదలు అష్టమి వరకు కొనసాగిస్తారు.