BREAKING NEWS

సినిమాకు ఫాల్కే...!

కొన్ని వేలమంది కలల ప్రపంచం సినిమా! ఒకప్పుడు కేవలం పుస్తకాల్లో మాత్రమే బొమ్మలను చూసేవాళ్ళం. అప్పుడే విదేశాల్లో చూసిన సినిమాలకు ముగ్దుడై భారత్ కి కూడా సినిమాను తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అంతాఇంతా కాదు. ఒకానొక దశలో ఆయన తన చూపును కూడా పోగొట్టుకోవాల్సిన సందర్భం.

అయినా భారతదేశంలో మొదటి మూకి చిత్రాన్ని తీసి, తెరపై కదిలే బొమ్మలను ప్రజలకు చూపించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఇండియా సినిమా అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడానికి ప్రధాన కారణమయ్యారు 'దాదాసాహెబ్ ఫాల్కే'. 
అందుకే ఈయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం సినీపరిశ్రమకు కళాకారులు చేసిన సేవలకుగానూ అవార్డులను ఇస్తోంది. ఈ ఏడాది 67వ జాతీయ చలనచిత్ర ప్రదానోత్సవాన్ని పురస్కరించుకుని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పుట్టు పూర్వోత్తరాల గురుంచి ఈరోజు మనం తెలుసుకుందాం:
 
దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు:-

ఫాల్కేను భారతీయ సినిమాకు పితామహుడిగా భావిస్తారు. తొలి భారతీయ సినిమాను నిర్మించిన ఘనత ఈయనది.  
బాల్యం...

ఫాల్కే పుట్టింది 1870 ఏప్రిల్ 30న నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోనున్న త్రయంబక అనే గ్రామంలో. ఈ ప్రాంతం ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. తండ్రి గోవింద్ సదాశివ్ ఫాల్కే ఈయన్ని దాజీ శాస్త్రి అని కూడా పిలుస్తారు. సంస్కృత పండితుడు, హిందూ పూజారిగా కూడా పనిచేశారు. తల్లి ద్వారకాబాయి. 

ఫాల్కేకు చిన్నప్పటి నుంచే సృజనాత్మక కళలంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. తన కలలను నెరవేర్చుకునే లక్ష్యంతోనే 1885లో బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ ఆయన ఫొటోగ్రఫీ, లిథోగ్రఫీ, ఆర్కిటెక్చర్‌, డ్రామాలు వేయడం వంటి ఎన్నో అంశాలను నేర్చుకున్నారు. వీటితోపాటు ఇంద్రజాల విద్యను అభ్యసించారు. 1890లో ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్ నేర్చుకున్నారు.
 
ఉద్యోగంలో...

పెయింటర్‌గా కొద్దికాలం పాటు, తర్వాత సినిమా సెట్లకు డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గానూ పనిచేశారు.
●1908లో తన స్నేహితుడితో కలసి 'ఫాల్కేస్ ఆర్ట్ ప్రింటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ వర్క్స్' అనే పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో బిజినెస్ ముందుకు కొనసాగలేదు.
 
సినీ రంగ ప్రవేశం...

ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ గీసిన హిందూ దేవతల చిత్రాలను చూసి ఎంతో మైమరిచిపోయేవారు హిందూవులు.
1910లో మూకీ చిత్రం 'ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్'ను ఒకరకంగా ఫాల్కే జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలోలానే హిందూ దేవుళ్లను కూడా అలా తెరపై చూడాలనుకున్నారు. ఎలాగైనా సినిమా తీయాలనే నిర్ణయించుకున్నారు.

1912లో సినిమాలకు సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు లండన్ వెళ్లారు. ఆక్కడ విలువైన కెమెరాను కొని, స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడ 'ఫాల్కే ఫిల్మ్స్' సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 1913లో భారత తొలి మూకీ 'రాజా హరిశ్చంద్ర' సినిమాను ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, విడుదల చేశారు. ఈ చిత్రానికిగానూ కథనం, నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్, ఫిల్మ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ డిజైన్ వరకు మొత్తం పూర్తి బాధ్యతలన్ని ఫాల్కేనే చూసుకున్నారు. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో భారత్ సినీ చరిత్రలో గొప్ప గుర్తింపును తెచ్చుకుంది.

●1913లో 'భస్మాసుర మోహిని' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో ఒక మహిళను ప్రధాన పాత్రగా తీసుకున్నారు.

●ఫాల్కే ఫిల్మ్స్ సంస్థను 1918లో 'హిందూస్థాన్ ఫిల్మ్ కంపెనీ'గా  మార్చారు. ఆ సంస్థ నుంచి ఎన్నో సినిమాలను నిర్మించారు.

●1937లో ఈయన నిర్మించిన చివరి చిత్రం 'గంగావతరన్' . ఈ సినిమాను మూకీగా కాకుండా మాటలను జతచేశారు.

●1944 ఫిబ్రవరి 16న నాసిక్ లో  ఫాల్కే మరణించారు.
 
ఈయన నిర్మించిన చిత్రాలు...

◆1913లో రాజాహరిశ్చంద్ర, మోహినీ భస్మాసుర్,
◆1914లో సత్యవన్ సావిత్రి,
◆1917లో లంకా దహన్,  
◆1918లో శ్రీ కృష్ణ జన్మ, 
◆1919లో కాలియా మర్దన్,    
◆1920లో సైరంధ్రి, శకుంతల వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
 
అవార్డును ఎందుకిస్తారంటే...

భారతీయ సినీ రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈయన పేరుమీద అవార్డుని ప్రకటిస్తుంది. అలా ఈ అవార్డును 1969లో మొట్టమొదటిసారిగా ఇచ్చారు. దీనిని రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీతలకు అందజేస్తారు. సినీ పరిశ్రమకు విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు ఈ అవార్డును బహుకరిస్తారు.
 
ఇప్పటివరకు అవార్డు అందుకున్నవారు...

◆1974లో బిఎన్ రెడ్డి - తెలుగులో పదిహేను సినిమాలు తీసిన దర్శకుడు.

◆1980లో పైడి జైరాజ్ - నటుడు, దర్శకుడు.

◆1982లో ఎల్వీ ప్రసాద్ - నటుడు, దర్శకుడు, నిర్మాత.

◆1986లో బి. నాగిరెడ్డి - విజయ వాహిని స్టూడియోను స్థాపించారు. 50కి పైగా సినిమాలు నిర్మించారు.

◆1990లో అక్కినేని నాగేశ్వరరావు - 250కి పైగా చిత్రాలలో నటించారు.

◆2009లో డి.రామానాయుడు - 130 కంటే ఎక్కువ చిత్రాలు, తొమ్మిది భాషల్లో నిర్మించారు.

◆2010లో కె.బాలచందర్ - 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

◆2016లో కె.విశ్వనాథ్ - 53 చిత్రాలకు దర్శకత్వం చేశారు.

◆2021లో 'జెర్సీ' చిత్రానికిగానూ- గౌతమ్ తిన్ననూరి - దర్శకుడు,  నిర్మాత- నాగవంశీ,  ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలి.

◆మహర్షి చిత్రానికిగానూ - వంశీ పైడిపల్లి, నిర్మాత - దిల్ రాజు, ఉత్తమ కొరియోగ్రాఫర్ - రాజు సుందరం.

●ఈ సంవత్సరం 67వ జాతీయ చలన చిత్ర పురస్కార వేడుకలల్లో తమిళ నటుడు రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును తన మార్గదర్శకులు, గురువు కె.బాలచందర్ కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.