BREAKING NEWS

కశ్మీర్ లో ఉగ్రదాడులు

భారత్ లో ఒకప్పటి పర్యటక ప్రదేశంగా పేరుగాంచిన ఈ ప్రాంతం, నేడు ఉగ్రదాడులతో అక్కడి ప్రజల ప్రాణాలు తీస్తోంది.
కశ్మీర్ లోయలో ఉండే సాధారణ ప్రజలపై ఉగ్రవాదులు వరుస దాడులు చేస్తూ వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. ఆ పరిణామాలకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం:
 
కశ్మీర్ లో 1990లో అల్పసంఖ్యాకవర్గాలే లక్ష్యంగా ఉగ్రమూకలు అత్యాచారాలు, హత్యలు వంటి దాడులకు పాల్పడ్డారు. దాంతో వేలాది పండితులు, ప్రజలు ప్రాణభయంతో ఆ లోయ విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈ పండితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 

1998 జనవరిలో వంధమా పట్టణంలో 26 మంది కశ్మీరీ పండితులను, అలాగే 2000, మార్చిలో అనంత్ నాగ్ లోని 35 మంది సిక్కులను ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు. ఈ దాడుల అనంతరం కొన్ని పండిత వర్గాలవారు వలస వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడానికి ప్రభుత్వం భారీగా సాయుధ బలగాల సిబ్బందిని మోహరించి పటిష్ట భద్రతను, భరోసాను కలిపించింది.

అంతేకాదు ప్రధానమంత్రి ఉపాధి ప్రత్యేక ప్యాకేజి కింద ఉద్యోగాలను ఇప్పించింది. అంతటితో పరిస్థితి కుదుటపడి ఇంకొంతమంది పండిత కుటుంబాలు ఇక్కడ నివాసముంటారనుకున్నారు. కానీ అంత మారిపోయింది. ఎంతలా అంటే 400 కశ్మీరీ పండిత కుటుంబాలు ఉండే షేక్ పోర ప్రాంతంలో ఇప్పుడు ఒక్కరూ కూడా కానరాకుండా పోయారు. ప్రాణభయంతో పండితులు, ఇతర అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు ఉద్యోగాలు వదిలి జమ్మూ, ఢిల్లీ ప్రాంతాలకు వలస పోతున్నారు. 

వారం కిందట శ్రీనగర్ లో ఓ ఫార్మసీ యజమాని అయిన మఖన్ లాల్ బింద్రూని, వీరేంద్ర పాశ్వాన్ అనే బిహారి వ్యక్తిని, బందిపొరాలో ఉంటున్న మొహమ్మద్ షఫీలోన్ ని ఉగ్రవాదులు ఒకేరోజు చంపేశారు.

●మొహమ్మద్ షఫీదార్ కి భద్రత బలగాలతో సంబంధాలు ఉన్నాయని, మజిద్ అహ్మద్ గోజ్రీని మదీనా కాంప్లెక్స్ దగ్గర కాల్చి చంపేశారు.

●గత వారంలో శ్రీనగర్ లోని ఈద్గా ప్రాంతంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయురాలు సుపిందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ లను ముష్కరులు దగ్గరి నుంచి కాల్చి చంపారు. ఆన్లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు ఎవరు లేకపోవడంతో వారికి పెను ముప్పు తప్పింది. 

●కుల్గామ్ లోని వాన్ పోహ్ ప్రాంతంలో శనివారం బీహార్, ఉత్తరప్రదేశ్ లకు చెందిన వీధి వ్యాపారి, అదే వీధిలోని వడ్రంగిని ముష్కరులు బలి తీసుకున్నారు. మొన్న బీహార్ కు చెందిన మరో ఇద్దరి వలస కూలీలను చంపేశారు. మరొకరిని గాయపర్చారు. వీళ్లు ఉంటున్న గదిలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్చి చంపారు. ఇలా ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు ముష్కరుల చేతిలో హతమయ్యాయి. ఇందులో ఐదుగురు వేరే రాష్ట్రాలకు చెందినవారు కాగా, మిగిలినవారు అదే రాష్ట్రానికి చెందినవారు. అలా ఈ ఏడాదిలో మొత్తం 30 మంది సామాన్య ప్రజలనే మట్టుబెట్టారు.

●కూలీల మరణం తరువాత వలస కూలీలు బెంబేలెత్తిపోయి కొందరు వారి స్వస్థలాలకు పయణమయ్యారు. మిగతావారిని లోయ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇంకొందరిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకోవైపు 'ఇక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని మళ్ళీ తిరిగి వెళ్ళేది లేదని' స్పష్టంగా చెప్పారు. చావు కంటే ఆకలి భయమే ఎక్కువగా ఉందని వలస కూలీల్లో ఒకరైన ఉత్తరప్రదేశ్ కి చెందిన వడ్రంగి తెలిపారు. 

●ఇదిలా ఉండగా ఈ ముష్కరుల వెనుక ఉగ్రవాద సంస్థ ఐఎస్ కేపీ (ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ఫ్రావిన్స్) ఉన్నట్లుగా తెలియడమేకాక ఈ రకమైన దాడులు మరిన్ని జరుగుతాయని కూడా హెచ్చరించింది. 

●కాశ్మీర్ లో జరుగుతున్న హత్యల గురుంచి, దేశ భద్రతపైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నారు. 

●ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో ముష్కర దాడులు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు ఏమి మారలేదని స్థానికులు అంటున్నారు. ఇప్పుడున్న మారణకాండపై ప్రభుత్వం తొందరగా స్పందించాలి. ఎందుకంటే మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా, తాలిబన్ల సహకారంతో ఉగ్రవాదులతో కలిసి కశ్మీర్ పైన దాడులు చేయడానికి పాక్ కుట్రలు పన్నుతోంది. 

●కశ్మీర్ లో జరిగే దాడులను తామే చేస్తున్నామని 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్) ఉగ్ర సంస్థ చెబుతుంది. ఈ ఉగ్ర ఘాతుకాలను 'హైబ్రిడ్ టెర్రరిజం' గా పిలుస్తున్నారు. పెద్ద పెద్ద ఆయుధాలతో గుంపులుగా దాడి చేయకుండా, చిన్న తుపాకులతో వాళ్ళు అనుకున్న వ్యక్తిపైనే గురి పెట్టి మరి చంపుతున్నారు. 

●డ్రోన్లు, హెలికాఫ్టర్లతో రంగంలోకి దిగిన భారత పారా మిలిటరీ బృందం అటవీ ప్రాంతం మొత్తం ముష్కరుల కోసం వెతుకుతోంది. 

●పూంచ్ జిల్లాలోని అడవుల్లో భద్రత దళాలు, ఉగ్రవాదులకు మధ్య దాదాపు 8 రోజుల నుంచి కాల్పులు, ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ కమిషనర్ ఆఫీసర్లు, వీరితో సహా 9 మంది సైనికులు మృతి చెందారు. 

●ఇప్పటివరకు వేర్వేరు ఎన్ కౌంటర్లో 13 మంది ముష్కరులు హతమయ్యారు.

●భారత్ కశ్మీర్ లో మౌలిక వసతులు కోసం దుబాయ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది చూడాల్సి ఉంది.

Photo Gallery