BREAKING NEWS

'విజయ'దశమి..!

నిత్య జీవితంలో ఎల్లప్పుడూ విజయాలే కలగాలని ఆకాక్షించే మానవుడికి 'విజయదశమి' చీకటిలో వేగుచుక్కలా దారి చూపుతుందని నమ్ముతారు. దసరాగా పిలుచుకునే ఈ పర్వదినానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. బతుకమ్మ పండుగతో మొదలుకొని జమ్మి చెట్టు, పాలపిట్ట దర్శనం, రావణుడి దహనం వరకు ఈ శుభదినం దశ(కంఠ)హార గా పరిణమించిందని కొందరి భావన. ఇవేకాక దుర్గాదేవి అష్టావతారాలు, మరిన్ని విశేషాల గురుంచి ఈరోజున మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
కథ:-

ఒకప్పుడు శుంభుడు, నిశుంభుడు అనే రాక్షస సోదరులుండేవారు. దేవతలకు చెందాల్సిన యజ్ఞానికి అవసరమయ్యే అన్నింటినీ తీసుకుంటూ, దేవతలందరినీ బాధపెడుతూ ఉండేవారు. అప్పుడు దేవతలు హిమవత్పర్వతానికి వెళ్లి అక్కడి అమ్మవారిని ప్రార్థించారు. ఆ అమ్మవారు పార్వతీదేవిగా అవతరించి దుష్టుల నుంచి రక్షించడానికి అభయమిస్తున్నట్లు నమ్ముతారు.

హిమవత్పర్వత ప్రాంతంలో అంబికగా అవతారమెత్తిన పార్వతిదేవిని రాక్షస సోదరుల అనుచరులైన చండ, ముండులు చూశారు. ఆమె సౌందర్యాన్ని చూసి తమ యజమానులకు చెప్తారు. అందుకు రాజులు ఆమెను తీసుకురమ్మని వెంట దూతను కూడా పంపిస్తారు. అప్పుడు దుర్గాదేవి వస్తాను కానీ నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను. 'నన్ను ఎవరు యుద్ధంలో జయిస్తారో, నా దర్పాన్ని ఎవరు పొగొడతారో, లోకంలో నాకు ఎవరు సమవుజ్జి అవుతారో వారే నా భర్త, ఆ సోదరులల్లో ఎవరు నన్ను జయిస్తే వాళ్లతోనే పాణిగ్రహణం అవుతుంద'ని చెప్పి ఆ దూతను పంపిస్తుంది. 

అది విన్న శుంభుడు కోపంతో ధూమ్రలోచనుడుని పంపించే ఆమెపై యుద్ధం చేసి ఓడించమని చెప్తాడు. కానీ అమ్మవారు హుంకారంతో అతన్ని చంపేస్తుంది. అది విన్న శుంభుడు మహోగ్రుడై చండ, ముండులను అమ్మవారిపైకి పంపించగా, ఆమెలోంచి కాళికదేవి బయటకు వచ్చి చండుడున్ని పడగొట్టి, ముండుడి తలను నరికి అమ్మవారి దగ్గరికి వస్తుంది. అందుకు సంతోషించి చండముండుల తలలను నరికినందుకు నువ్వు 'చాముండి' గా ప్రసిద్ధికెక్కుతావని వరమిచ్చింది.

వీరి మరణం తర్వాత రాక్షస సోదరులు రకరకాల రాక్షస జాతులు, సైన్యంతో కలిసి దేవతలపై యుద్ధం మొదలుపెట్టారు. ఆ పోరులో రక్తబీజుడు అనే రాక్షసుడ్ని ఐంద్రీ దేవత వజ్రాయుధంతో కొట్టగా, రక్తం బొట్లు కారి వాటి నుంచి మళ్లీ వేల సంఖ్యలో రక్తబీజుడు అవతారాలు పుట్టుకొస్తున్నాయి. దానికి పరిష్కారంగా అమ్మవారు కాళీమాతను పిలిచి బొట్టు పడేలోగా రక్తాన్ని తాగేసేయి అని చెబుతుంది. తర్వాత రక్తబీజుడు హీనుణ్ణి చేసి సంహరిస్తుంది.

యుద్ధపోరులో అమ్మవారు చండికాదేవి నిశుంభుణ్ణి నెలకేసి కొట్టింది. తమ్ముడు రౌద్రంగా ఆమె మీదికి రాగా శుంభుడిని అమ్మవారు శూలంతో కొట్టగానే మూర్ఛతో కింద పడతాడు. అప్పుడు శుంభుడు తమ్ముడి మరణంతో, బాధతో 'దేవి నీకేదో బలముందని గర్వపడకు. ఇతరుల బలాన్ని పొంది నాతో యుద్ధం చేశావు' అని నిందించాడు. అందుకు అమ్మవారు నవ్వుతూ వీళ్లంతా విభూతులు, నా శక్తులు. తిరిగి నాలోనికి ప్రవేశిస్తారు అని చెప్పింది. దేవతలందరూ ఆమెలోకి వచ్చి ప్రథమంగా అంబికాదేవి ఒక్కత్తే ప్రకాశిస్తుంది.

ఆ తరువాత వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శుంభుణ్ణి ఒక్క చేత్తో ఎత్తి పట్టుకొని గిరగిరా తిప్పి నెలకేసి కొట్టింది. ఆమె శూలంతో వక్షస్థలంలో పొడవడంతో అతను విగతజీవుడయ్యాడు. దాంతో  జగన్మాత తన అవతార కార్యాన్ని పూర్తి చేసింది. 
బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు త్రిమూర్తులనే పేరు. వీరి భార్యలకు త్రిశక్తులని పేరు. ఈ త్రిశక్తి దేవతల సమష్టి పండుగే ఈ మన విజయదశమి.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో దేవీ నవరాత్రులు మొదలయ్యి, 15న విజయదశమితో పూర్తవుతుంది.

●అమ్మవారిని మొదటిరోజు స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా, రెండవరోజు బాలాత్రిపుర సుందరీ దేవిగా, మూడవ రోజు గాయత్రీ దేవిగా, నాల్గవ రోజు, అన్నపూర్ణాదేవిగా, ఐదో రోజున, ఆరో రోజున లలితా త్రిపుర సుందరీగా, ఏడో రోజున మహా సరస్వతిదేవిగా, ఎనిమిదో రోజున దుర్గా దేవిగా, తొమ్మిదో రోజున మహిషాసుర మర్దినిగా పూజించి, దశమినాడు రాజరాజేశ్వరిగా అలంకరించి, అర్చిస్తారు.

●దాక్షాయణి యోగ అగ్నిలో దగ్ధమైనప్పుడు సతీవియోగం భరించలేక ఈశ్వరుడు ఆమెను భుజం మీద పెట్టుకొని వెళుతుంటే శ్రీవిష్ణువు ఆమె శరీరాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా నరికెయ్యగా, శరీరభాగలన్నీ విడిగా పడ్డాయి. అలా పడిన చోట్లనే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆమె ఇతర చిన్న చిన్న భాగాలతోపాటు, ఆభరణాలు పడి పంచాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఇంకా నూట ఎనిమిది శక్తి కేంద్రాలున్నాయి.

●రాముడు రావణుని పది తలలు నరికిన కొద్దీ మళ్లీ తలలు పుట్టుకొస్తుండడం చూశాడు. ఇలా కాదని నిద్రలో ఉన్న దుర్గాదేవిని రాముడు పూజించగా ఆ తల్లి విజయం వరిస్తుందని చెబుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు నుంచి యుద్ధం మొదలు పెట్టగా పదో రోజున శ్రీరాముడు రావణున్ని సంహరించి విజయం పొంది, జమ్మి చెట్టుకు పూజ చేసి, పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నాడు. అలా రాముని విజయానికి కారకురాలైన దుర్గాదేవిని పదిరోజులు పాటు పూజించే కార్యక్రమాన్ని దసరా ఉత్సవంగా జరుపుకుంటున్నాం. రావణ, కుంభకర్ణులను బొమ్మలుగా చేసి ఊరంతా ఉరేగించి, మైదానంలో అశేష జనాల ముందు ఆ బొమ్మల్ని కాల్చి వేడుక చేసుకుంటాము. దానినే 'రామలీల'గా పిలుస్తారు.
 
తొమ్మిది రోజుల బతుకమ్మ...

●మొదటిరోజున అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో మొదటి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. తెలంగాణలో పెత్రామాస అని అంటారు. ఈరోజున నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.

●రెండో రోజున 'అటుకుల బతుకమ్మ'గా పిలుస్తారు. పుట్నాల పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేస్తారు.

●మూడో రోజున 'ముద్దపప్పు బతుకమ్మ'గా పిలుస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదం చేసి గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు.

●నాలుగో రోజున 'నానబియ్యం బతుకమ్మ'గా పిలుస్తారు.
బంగారు బతుకమ్మకు నైవేద్యంగా నానబెట్టిన బియ్యంను పెడతారు.

●అయిదో రోజున 'అట్ల బతుకమ్మ'గా పిలుస్తారు. బియ్యంపిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

●ఆరో రోజున 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు. ఈ రోజున నైవేద్యం ఉండదు.

●ఏడో రోజున 'వేపకాయల బతుకమ్మ'గా పిలుస్తారు. ఆ రోజు బియ్యంపిండిని బాగా వేయించి వేప పండ్లలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

●ఎనిమిదో రోజున 'వెన్నముద్దల బతుకమ్మ'గా పిలుస్తారు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి కలిపి ప్రసాదంగా పెడతారు.

●తొమ్మిదో రోజున 'సద్దుల బతుకమ్మ'గా పిలుస్తారు. ఆష్టయుజ అష్టమినాడు అదేరోజున దుర్గాష్టమిగా జరుపుకుంటున్నాం. పెరుగన్నం, నువ్వులన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, లెమన్ రైస్ లాంటి ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదిస్తారు. ఇది ఆడపిల్లల పండుగ, రంగురంగుల పూలను పేర్చి, బంగారు బతుకినివమ్మ అంటూ పాడి, ఆడతారు.
 
విజయ దశమి రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తామంటే:-

●త్రేతాయుగంలో శ్రీరాముడు శమీ పూజ చేసి లంకకు వెళ్లి విజయం సాధించాడని రామాయణ గాధ చెబుతుంది. 

●మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి బయలుదేరే ముందు ఉత్తర గోగ్రహణం సందర్భంగా వాళ్ల ఆయుధాలను, ధనుర్భాణాలను ఒక మూటలో కట్టి వాటిని శమీ చెట్టుపై ఉంచి, మళ్లీ వచ్చేవరకు జాగ్రతగా చూసుకోమని చెప్పి నమస్కరించి వెళ్లారట. వచ్చాక జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆయుధాలను తీసుకొని యుద్ధంలో పాల్గొని కౌరవులను ఓడించారని మహాభారత కథ చెబుతుంది.

●శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునన్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం అనే శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ చెట్టు ఆకులను తెంపి పెద్దవారికి ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
 
పాలపిట్ట దర్శనం కోసం ఎందుకు ఎదురుచూస్తారంటే

పురాణ గాథల్లో పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకొని తిరిగి రాజ్యానికి వెళ్తున్నపుడు వారికి పాలపిట్ట కనిపించిందట. అప్పటి నుంచి వారి కష్టాలు పోయి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి పోగొట్టుకున్న రాజ్యాన్ని సొంతం చేసుకున్నారట. అలా పాండవులకు కలిగిన శుభాలు పాలపిట్టను చూస్తే అందరికీ కలుగుతాయని నమ్మకం. జమ్మి చెట్టు పూజ అయ్యాక పాలపిట్టను దర్శనం చేసుకుంటారు.

●తొమ్మిదిరాత్రులు, పది రోజుల పాటు చెడుపై మంచికి విజయంగా భావించి వేడుకగా చేసుకునే విజయదశమి సందర్భంగా ప్రదర్శించే ఆట, పాటల్ని మానవాళి సాంస్కృతిక వారసత్వ విశేషంగా 2005లో యునెస్కో గుర్తింపును ఇచ్చింది.

●మనదేశ సరిహద్దుల్లో ఉన్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లలోనే కాక ఆసియా దేశాల్లో కూడా విజయదశమిని జరుపుకుంటారు. ట్రినిడాడ్, టొబాగో, సురినాం, ఫ్రెంచి గయానా, మారిషస్, కంబోడియా, థాయిలాండ్, లావోస్, నెదర్లాండ్, ఫిజీ, మయన్మార్ లాంటి దేశాలల్లో భారత సంతతికి చెందిన వాళ్లతో పాటు స్థానికులు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అంతేకాదు ముస్లిం దేశమైన ఇండోనేషియా లో కూడా దసరా వేడుక చేసుకుంటారు.
 
రావణుని బొమ్మ ముందు ముగ్గులు:-

కొన్ని జైన సమాజాలకు ఆయన తొలి జైనతీర్థంకరుడైన ఆదినాధుని అనుచరుడిగా రావణుడు ఉండేవాడట. జైనుల నమ్మకం ప్రకారం, హిమాలయాల్లోని ఆదినాధుని ఆలయాన్ని రావణుడు భార్యతో కలిసి క్రమం తప్పకుండా సందర్శించేవాడు. దసరా రోజు ఆచారం ప్రకారం రావణుని బొమ్మ దహనం చేస్తే, కొందరు జైనులు మాత్రం తమ ఇళ్లముందు రావణుని బొమ్మను ఉంచి, దాని ముందు ముగ్గులు వేస్తారు.