BREAKING NEWS

జై.. 'మహిషాసురమర్దిని'!

లోకాలను పాలించే తల్లి జగన్మాత చేసిన రాక్షససంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగే దసరా. విజయదశమి కేవలం విందు వినోదాలు, పూజాపునస్కారాలకే పరిమితం అయ్యేది కాదు. అసలు విజయదశమి రోజున ఏ పని తలపెట్టిన విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు. సరస్వతీ, లక్ష్మీదేవి, దుర్గమాత, కాళిక, లలితాంబ, మహిషాసురమర్దిని... ఇలా ఏ పేరుతో పిలిచినా, ఎలా తలచినా జగన్మాత మనల్ని అనుగ్రహిస్తుందని విశ్వసిస్తాం. ఈ సందర్భంగా విజయదశమి విశేషాల గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే వేడుకే విజయ దశమి(దసరా). సమస్త విజయాలకు సంకేతం ఈ పర్వదినం. ఆశ్వయుజ పాడ్యమి రోజున ప్రారంభమయ్యే శరన్నవరాత్రులు దశమినాటితో ముగుస్తాయి. అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తాం. దసరా అనేది 'దశహరా' అనే పదం నుంచి వచ్చింది. దశహరా అంటే, దశవిధపాపహరం అని అర్థం. ఈరోజున పట్నం వాసులంతా తమ సొంతూళ్లకు చేరుకొని, బంధుమిత్రులతో కలిసి వేడుకగా జరుపుకుంటారు. 
 
దసరా

దసరా రోజున ప్రతి ఒక్కరూ మహిషామర్దిని కథ చెప్పుకుంటారు. మహిషాసురుడు అనే పేరు గల భయంకరమైన రాక్షసుడు ఇంద్రుడి పదవి కోసం దేవతలతో యుద్ధం చేసి, వాళ్లను ఓడిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోకాన్ని కాకుండా ప్రపంచాన్ని అంతటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడి బారి నుంచి లోకాన్ని కాపాడాలని ఇంద్రుడు త్రిమూర్తులతో వాపోతాడు.

అప్పుడా త్రిమూర్తులకు వచ్చిన కోపం ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తే ఒక స్త్రీగా జన్మిస్తుంది. త్రిమూర్తులలో.. శివుని శక్తి ముఖంగా, విష్ణువు శక్తి భుజాలు, చేతులుగా, బ్రహ్మ శక్తి పాదాలుగా.. ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తిగా అవతరిస్తుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని.. ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ఇచ్చి మహిషాసురమర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో భీకరంగా పోరాడి మహిషాసురుడ్ని మట్టుబెడుతుంది ఆ తల్లి. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగా ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమినాడున దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఉగ్రరూపాన్నే ‘మహిషాసురమర్దిని’ రూపంగా భావిస్తారు. 
 
శమీ పూజ.. 

విజయదశమినాడు పూజలందుకునే శమీ(జమ్మి) చెట్టుకి సంబంధించి పురాణకాలం నుంచి ఒక గాథ వాడుకలో ఉంది. పూర్వం ప్రజాపతి అగ్నిని సృష్టించాడు. అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతినే కాల్చేయబోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజాపతి అగ్నిని శాంతింపజేసిందుకు పచ్చని చెట్టును సృష్టిస్తాడు. దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పివేశాడు.  అగ్నిని శమింపచేసేందుకు ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం.

అయితే విజయదశమిరోజు సాయంత్రం ఈ జమ్మి చెట్టును చేరుకుని ప్రదక్షిణలు చేసి, జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి, ఆశ్వీరాదం పొందడం మన తెలుగువారి ఆచారం. మిత్రుల ఆలింగనాలు, పరస్పర శుభాకాంక్షల మధ్య దసరా సాయంత్రం ముగుస్తుంది. అప్పట్లో ఈరోజున ఆయుధాలకు ప్రత్యేకించి పూజలు జరిపేవారు. కానీ ఇప్పుడు ఆయుధాలకు బదులు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన వస్తువుల్ని, యంత్రాల్ని పూజిస్తున్నారు. వాహన పూజలు సైతం జరుపుతుంటారు. కొత్త వ్యాపారాలు, కొత్త పనులు విజయదశమి రోజున ప్రారంభిస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. 
 
పాలపిట్ట దర్శనం.. 

దసరా రోజున పాలపిట్టను చూడటం మన దగ్గర ఆచారంగా వస్తుంది. పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందన్న నమ్మకం అనాదిగా ఉంది. నీలం, పసుపు రంగుల కలబోతగా, ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఇతిహాసిక కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయల్దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మిచెట్టును పూజించి, దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకున్న తరుణంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చింది అనే కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరయుగంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని హిందువులు విశ్వసిస్తారు. 
 
రావణ దహనం..  

ఈరోజున రాముడు రావణున్ని వధించిన రోజున కాబట్టి ఆశ్వయుజ దశమేనని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు రాముడు యుద్ధంలో రావణున్ని వధించి విజయం సాధిస్తాడు. దీనికి గుర్తుగా మనదగ్గర కూడా రావణదహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో దసరా రోజున రావణదహనం చేస్తారు.
ఈరోజున రామాలయాలు రామనామంతో మారుమోగిపోతాయి. ఎందుకంటే రామాయణం నేపథ్యంలో కూడా దసరా గురించి ఒక పురాణ కథ ఉంది..

అదేంటంటే, శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపింది దశమిరోజునే. రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు. ఇలా చూసినా చెడుపై మంచి గెలవడమే ఉంది. కాబట్టి దసరా రోజున రామున్ని తల్చుకోవడం జరుగుతుంది. పెద్ద మైదానాల్లో పది తలల రావణుడి బొమ్మను తయారు చేసి, దాన్ని బాణాసంచాతో కాలుస్తారు. దసరా తర్వాత అటుఇటుగా 21 రోజులకు దీపావళి పండుగ వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది కూడా అప్పుడే అందుకే ఈ కథ ప్రాచుర్యంలో ఉంది.
 
దేవీ అనుగ్రహం అన్నింటిలో

◆ నవరాత్రి ఉత్సవాలు.. శరత్కాలంలో వస్తాయి. అందుకే ఇవి శరన్నవరాత్రులుగా పిలువబడతాయి. అంతేకాక అమ్మకు శారద అనే పేరు ఉంది. శారద అంటే, జ్ఞానప్రదాయిని. ఈ కాలంలో ప్రకృతిలో అంతర్భాగమైన నదుల్లోని మాలిన్యాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఆపై నీరు సేవించడానికి అనువుగా మారతాయి. అలాగే, ఆ తల్లి శక్తి ఉపాసన ప్రభావం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగిపోయి, జ్ఞానం వికసిస్తుంది. శరన్నవరాత్రుల అసలైన పరమార్థం ఇదే.

◆ విద్య వల్ల మనిషికి పరిపూర్ణత లభిస్తుంది. మంచి, చెడుల విచక్షణ జ్ఞానాన్ని బోధిస్తుంది. లోకంలోని అన్ని విద్యలూ సరస్వతీ దేవి రూపాలే! అజ్ఞానం వల్ల అలుముకున్న చీకట్లను నిత్యమైన జ్ఞాన ప్రకాశం వల్ల తొలగింపజేస్తుంది.

◆ శత్రువులంటే బయటికి కనిపించేవారే కాదు, మనలోనే ఉంటూ మనకు దుర్బుద్ధిని కలిగించి, మన కర్తవ్యాన్ని, లక్ష్యాన్ని దారి మళ్లించే అఘాత శత్రువులు సైతం ఉంటాయి. ఇవే అంతర్శత్రువులు. జగదాంబ తల్లిని ఆరాధించడం వల్ల బాహ్య శత్రువులతో పాటు అంతర్‌ శత్రువులతో పోరాడే ధైర్యం లభిస్తుంది. 

◆ నవరాత్రులంటే తొమ్మిది ప్రాణులని అర్థం. ఈ తొమ్మిది ప్రాణాల్లో ఆ దేవి కొలువుంటూ, వాటిని నిత్యం కాపాడుతుంది. ఆ ప్రాణదేవతే పదో ప్రాణం. ఆమె పరాదేవత. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనేవి తొమ్మిది ప్రాణాలు. ముఖ్య ప్రాణదేవత అయిన పదో ప్రాణదేవతే పరాదేవి. మిగిలిన తొమ్మిది ప్రాణాలు ప్రాణదేవత అవతారాలుగా భావిస్తాం. ఈ తల్లిని ఉపాసన చేయడం వల్ల మనలో దాగివున్న ప్రాణశక్తి చైతన్యత్వం చెందుతుంది.

విజయదశమి అంటే విద్య, ధైర్య, జ్ఞానం, శక్తి… ఇలా పలు విజయాలను అనుగ్రహించేలా చేస్తుంది ఆ తల్లి!