BREAKING NEWS

సర్వ శుభాలను కలిగించి ఆకాశగంగ తీర్థం

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. నిత్యం భక్తుల రద్దీ తో తిరుమల పుణ్యక్షేత్రం కళకళలాడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పుణ్య క్షేత్రంగా పేరు పొందిన ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసినదే. తిరుమల లో ప్రతి శిలా- చింతామణి, ప్రతి చెట్టు ప్రతి తీగ- మహర్షులు, ప్రతి తీర్థం దేవగంగా స్వరూపాలని వెంకటాచల మహత్యం లో చెప్పబడింది.

మహా ప్రసిద్ధి చెందిన తిరుమల పుణ్యక్షేత్రం లో పలు తీర్థాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని తీర్థాలు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థాల లో ఆకాశగంగ ఒకటి. అలానే శ్రీ స్వామి పుష్కరిణి, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, పాపవినాశనం తీర్థం, పాండవ తీర్థం కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆకాశ గంగ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
 
ఆకాశగంగ అందాలు: 
 
తిరుమల లో పవిత్ర దర్శనీయ స్థలాల లో  ఆకాశగంగ ఒకటి. పాపవినాశనం మాదిరి గానే ఆకాశగంగ  కూడా అద్భుత సెలయేరు. ఈ ప్రదేశం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది స్వామి పుష్కరిణి తీర్థం లో ఉంది. వెంకటేశ్వరుని ఆలయానికి దక్షిణాన 5 కిలో మీటర్ల దూరంలో ఆకాశగంగ ఉంది.  ఒక వైపు ఉద్యాన వనం అలానే ఆస్థాన మండపం అలరిస్తూ ఉంటుంది. మరో పక్క భువి నుండి దివికి ఎగిసిపడుతున్న ఆకాశగంగ  మనసు దోచుకుంటుంది. ఎటు చూసినా సౌందర్యంతో ఈ ఆకాశగంగ నిండి ఉంటుంది. ఇక వర్షా కాలంలో దీని అందం వివరించడం సాధ్యం కాదు. ఎటు చూసినా పచ్చని చెట్లు పూల మొక్కలు సొగసైన సెలయేళ్ళు .. అబ్బా..! ఎంతో అద్భుతంగా ఉంటుంది.
 
ఆకాశగంగ నీటితో స్వామి వారికి అభిషేకం: 
 
స్వామి వారికి అభిషేకం చేయడానికి ఈ నీటిని ఉపయోగిస్తారు. భక్తులు తమకు తెలిసీ, తెలియక చేసిన పాపాలను కడిగేసుకునేందుకు ఆకాశ గంగ లో స్నానం చేస్తారు. స్నానం చేసే అవకాశం లేని వారు కనీసం తల పైన నీటిని చల్లుకుంటారు. వెంకటేశ్వర నామాన్ని స్మరించుకుంటూ ఈ నీటిని చిలకరించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.  అంతేకాదు ఈ ఆకాశగంగ తలస్నానం చేస్తే సర్వ శుభాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే తిరుపతి వెళ్లే భక్తులు ఆకాశగంగని తప్పక దర్శించుకుంటారు. ఈ ప్రదేశానికి కేవలం మన రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా దేశం నలు మూలల నుండి, ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తారు.
 
ఆకాశగంగ విశేషాలు: 
 
ఒక పుష్కరం పాటు అంజనా దేవి తపస్సు చేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని ప్రతీతి. ఇది ఇలా ఉండగా ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రల తో ఇక్కడ నుండి తిరుమల నంబి వంశస్థులు నీళ్ళని తీసికెళ్ళడం సంప్రదాయం. 
 
హిమాచలం లో ప్రవహించిన గంగా మూడు పాయల అయింది. ఇలా ప్రవహిస్తూ సాక్షాత్కరించిన ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి తో వివాహం జరిపించే సందర్భం లో గంగను భువికి రప్పించడం వల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలానే సర్వ పాపాలు పోయి వంద పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు.
 
ఆకాశగంగ పురాణగాధ :
 
తిరుమల నంబి పాపనాశం నుంచి తెచ్చిన జలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగేది. వయోవృద్ధులైన తిరుమలనంబి చాలా దూరం నుండి అలా కుండలో నీరు తెచ్చి అభిషేకం  చేస్తుంటే వెంకటేశ్వరస్వామి కలతచెంది ఒక బాలుడి రూపంలో వచ్చి.. తాతా అని పిలిచి దాహంగా ఉంది జలం ఇవ్వమని కోరతాడు. తిరుమల నంబి వెంటనే అభిషేకం కోసం తీసుకెళ్తున్నాను అని చెబుతాడు. కానీ ఆ బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు తాగుతాడు. దానికి నంది ఇలా అంటాడు... స్వామి వారి అభిషేకానికి తీసుకెళ్తున్న జలం ఎలా తాగుతావు..? ఎంత పని చేసావు అని బాలుడుని అంటాడు.
 
దానికి ఆ బాలుడు తాత ఇక్కడ ఆకాశగంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళ్తావు అని అప్పటివరకు లేని దానిని చూపిస్తాడు. ఈ రోజు నుండి ఈ ఆకాశగంగ జలంతో అభిషేకం చేయమని చెప్పి ఆ బాలుడు అదృశ్యం అవుతాడు. ఈరోజు నేను కడుపు నిండా నీళ్లు తాగాను నాకు చల్లగా ఉంది ఈరోజు నాకు అభిషేకం వద్దు అని వెంకటేశ్వర స్వామి అర్చకులతో చెప్పేసి  అదృశ్యమవుతాడు. అభిషేకం కోసం తెచ్చే నీరు బాలుడు తాగేశాడు అని నంబి అర్చకులకు చెప్పగా.. స్వామివారి బాలుని రూపంలో వచ్చి కుండలో నీరు తాగి అభిషేకాన్ని ఆకాశగంగ జలంతో చేయమని అర్చకులు అనడంతో తిరుమలనంబి చాలా సంతోషిస్తాడు.