BREAKING NEWS

ప్రయాణాన్ని మధుర జ్ఞాపకాలుగా మార్చేసే బాపట్ల.. తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే..!

అందమైన ప్రకృతి.. సముద్ర తీరం.. చల్లటి గాలి.. మన కుటుంబం.. చాలేమో..! ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి రోజు గడిపి తీరాల్సిందే..! సహజంగా మనకి బీచ్ అంటే విశాఖపట్నం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ విశాఖపట్నం లో  మాత్రమే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా అందమైన సముద్ర తీరాలు ఉన్నాయి.

మన ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాల తో పాటు నదీ తీరాలు కూడా ఉన్నాయి. ఈ మాట పక్కన పెడితే దక్షిణ కోస్తాలో సూర్యలంక బీచ్ గురించి మనం చెప్పుకునే తీరాలి. అదేంటి అన్ని పక్కన పెట్టి సూర్యలంక బీచ్ కోసం ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా..?  ఎవరికీ తెలియని ఎన్నో గొప్ప ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. అంతే కాదు ఈ బీచ్.. ఇక్కడ వాతావరణం..

ప్రకృతి.. నిజంగా పర్యాటకులను ఎంత గానో ఆకట్టుకుంటుంది. అందులోనూ గుంటూరు జిల్లాలో ఉన్న ఒకే ఒక బీచ్ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బీచ్ గురించి, ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు గురించి తెలుసుకుని వెంటనే మీరు కూడా వీటిని చూసేయండి. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది.
 
సూర్యలంక బీచ్ ని ఇప్పటికే అభివృద్ధి చేయడం జరిగింది. దీనిని అచ్చం వైజాగ్ బీచ్ లాగ మార్చాలని పర్యాటక శాఖ అనుకుంది. అయితే ఇప్పటికే ఇక్కడ ఏపీటీడీసీ వారు కాలేజీని, రిసార్ట్ ని నెలకొల్పారు. అంతేకాదు ఈ బీచ్ వద్ద స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న ఈ బీచ్ గురించి అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి.
 
సూర్యలంక బీచ్ ఎక్కడ ఉంది..?
 
చక్కటి ప్రకృతి తో, చల్లని గాలులతో ప్రతి ఒక్కరిని ముగ్దుల్ని చేసే ఈ బీచ్ బాపట్ల సమీపం లో తొమ్మిది కిలో మీటర్ల దూరం లో ఉంది. ఈ ప్రాంతం సముద్ర తీరం లో ఉంది. ఈ పల్లె ఒక ఓడరేవు మరియు ఇక్కడ చేపల ఎగుమతి జోరుగా సాగుతోంది. అయితే దీని కోసం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..?  ఇండోనేషియా లోని సుమత్రా, జావా ద్వీపాలకు నేరుగా ఇక్కడి నుంచి సరుకు రవాణా చేసే వారట.
  
సూర్యలంక బీచ్ ని ఎలా చేరుకోవాలి..?
 
సూర్యలంక చేరుకోవడానికి బాపట్ల అనువైనది. బాపట్ల ఒక సారి చేరుకుంటే అక్కడి నుంచి ప్రైవేట్ జీపు లో, ప్రభుత్వ బస్సు లో  కూడా మనం వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. బాపట్ల లో రైల్వే స్టేషన్, బస్టాండ్ కూడా ఉంది. అలానే విజయవాడ, గుంటూరు, నరసరావుపేట మరియు చుట్టు పక్కల ప్రాంతాల ఇక్కడ నుంచి బస్సులు వస్తాయి. బాపట్ల అమరావతి నుంచి 90 కిలో మీటర్ల దూరంలో ఉంది. నరసరావుపేట నుంచి 72 కిలో మీటర్ల దూరం లో ఇది ఉంది. విజయవాడ నుంచి ఇది కేవలం 70 కిలో మీటర్లు దూరంలో ఉంది. ఇక  గుంటూరు నుంచి అయితే ఇది నలభై మూడు కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. 
  
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు, దేవాలయాలు :
 
ఈ ప్రాంతం చుట్టు పక్కల మనం ఎన్నో ప్రాంతాలను చూడవచ్చు. మరి ఆ ప్రాంతాల గురించి క్లుప్తంగా ఇప్పుడే చూసేయండి.. సముద్ర తీరం బాపట్ల కు సమీపం లోని సూర్యలంక వద్ద ఉన్న ఈ బీచ్ లో సముద్ర స్నానాలు చేస్తారు. అలానే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి  విహార కేంద్రంగా ఇది ఉంది. కప్పల వారి పాలెం, పిన్ని బోయిన వారి పాలెం సమీపంలో నల్లమడ వాగు, తూర్పు తుంగభద్ర, గుండంతిప్ప స్ట్రెయిట్‌ కట్‌, రొంపేరు రైట్‌ ఆర్మ్‌ డ్రెయిన్లు ఈ సముద్రం లో కలుస్తాయి. ఇక్కడ భారత వాయుసేన వారి కేంద్రం కూడా ఉంది.
 
 శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం:
 
స్థానిక ఎస్ ఎస్ పి అగ్రహారం లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వీటిని నిర్వహిస్తారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు.
  
శ్రీ సుందర వల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయం:
 
వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగంగా స్వామి వారి కల్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అంతే కాదు ఇక్కడ మాడ వీధులలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం జరుపుతారు. అది కూడా చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. అలానే వైశాఖ పౌర్ణమి నాడు స్వామి వారి రథోత్సవం దేవాలయం నుండి పాత పొన్నూరు వరకు కన్నుల పండుగగా సాగుతుంది. 
 
బాపట్ల లో చూడదగ్గ మరికొన్ని ప్రాంతాలు :
 
బాపట్ల లో క్రీస్తుశకం పదో శతాబ్దం లో నిర్మించిన భావన్నారాయణ స్వామి సోదరుని ఆలయం, టౌన్ హాల్, శాస్త్రలింగేశ్వర స్వామి ఆలయం కూడా చూడదగ్గ ప్రదేశాలు.
 
చూసారా ఎన్ని మంచి ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయో..! మరి కుటుంబ సమేతంగా బాపట్ల చేరుకుని ఆ ప్రయాణాన్ని మధుర జ్ఞాపకాలుగా మార్చుకోండి..