BREAKING NEWS

దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించాలంటే ఈ పద్ధతులని అనుసరించండి...!

దీపావళి పండుగ అంటేనే అలంకరణ. దీపావళి నాడు ఎవరిల్లు చూసినా పచ్చని తోరణాలు, రంగు రంగుల దీపాలు, రంగవల్లికలు.... ఇలా  ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ఇంటిని అలంకరిస్తారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రజలందరినీ పట్టి పీడిస్తున్న సమయం. అలాంటి సమయం లో కూడా నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిసాయి. ఇదిలా ఉండగా దీపావళి పండుగ కూడా ఇప్పుడు రాబోతోంది. దీపావళి పండుగ ని ఎలా జరుపుకోవాలి...?  ఘనంగా జరుపుకోవాలంటే  ఏం చేయాలి...?  అందంగా అలంకరించుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి....?  మరి తెలుసుకోవాలనుకుంటున్నారా....?  ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా చూసేయండి.
 
 కరోనా వైరస్ వల్ల ప్రభుత్వం అనేక రూల్స్ ని తీసుకు వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే మతాబులని బ్యాన్ చేశారు. మరికొన్ని చోట్ల కొంత సమయ పాలన పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ లో  కూడా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అందంగా సంతోషంగా ఈ పండుగ ఎలా జరుపుకోవాలి...?  అది కూడా పొల్యూషన్ ఫ్రీ గా ఎలా జరుపుకోవాలి..?  ఈ విషయం లోకి వస్తే.. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి అని మనకు తెలుసు. దీపావళి కి ఇల్లుని శుభ్ర పరచుకుని ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు కోసం షాపింగ్ చేస్తారు. అలానే  కొత్త బట్టలు వేసుకోవడం రకరకాల స్వీట్లు ని చేసి పంచుకోవడం జరుగుతుంది.
 
ఈసారి నవంబర్ 14న బాలల దినోత్సవం కూడా రావడం జరిగింది. దీపావళికి అందంగా ఇల్లు ఉంచుకోవాలంటే డెకరేషన్ ఖచ్చితంగా చేయాలి. చాలా మంది తమ ఇళ్ళల్లో దీపాలతో పాటు విద్యుత్ అలంకరణల తో నింపేస్తారు. ఇలా ఎవరికి నచ్చిన రీతి లో వాళ్లు డెకరేషన్ చేస్తారు అయితే ఇంటికి డెకరేషన్ ఎలా చేయాలి....?  ఆ మార్గాలు ఇవే....
 
లాంతరు దీపాలు:
 
మామూలుగా ఇంట్లో దీపాలు కంటే లాంతరు దీపాలు బాగా అందంగా కనిపిస్తాయి. వీటిని కనుక తగిలిస్తే ఇల్లు మరింత బాగా వెలిగి పోతుంది కాబట్టి మీరు లాంతరు దీపాల్ని ట్రై చేయండి. పండుగ సమయం లో ఇది అందంగా కనిపిస్తుంది. వీటిలో అనేక రకాల డిజైన్లు కూడా మీకు ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన విధంగా మంచి డిజైన్ ని  మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గార్డెన్ లేదా రూఫ్  హౌస్ పార్టీని నిర్వహించాలంటే లాంతరు దీపాలు పర్ఫెక్ట్. కనుక వాటిని కొని పెట్టేస్తే శ్రమ ఉండదు అలానే ఎంతో అందంగా కూడా ఉంటుంది. కాబట్టి వీటితో నింపేయండి మీ ఇంటిని.
  
రంగు ముగ్గులు :
 
సాధారణంగా ముగ్గులు అందంగా ఉంటాయి. సంక్రాతి కి, న్యూ ఇయర్ కి కూడా ముగ్గులు వేస్తాము. కాబట్టి దీపావళి నాడు కూడా అందమైన ముగ్గు వేసేసి దాని పై దీపాలు వెలిగించి పెడితే మరింత అందంగా ఉంటుంది. దీపావళి సందర్భంగా చాలా మంది ఇళ్లల్లో ఇలా ముగ్గులని పెడుతూ ఉంటారు. సాయంకాలం సంధ్య వేళ లో మంచి ముగ్గులు వేసి వాటి చుట్టూ దీపాలను పెట్టండి నిజంగా ఇది అదిరిపోయేలా ఉంటుంది. అంతే కాదు ఇలా చేస్తే ఖర్చు కూడా తక్కువే అవుతుంది. మీకు నచ్చిన డిజైన్ మీరు వేసి వాటి మీద దీపాలతో అలంకరిస్తే.. ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇది మాత్రం పక్కా.
  
 టోరన్స్ :
 
దీపావళి సందర్భంగా ప్రసిద్ధి అలంకరణ వస్తువులు టోరన్స్ ఒకటి.  వీటినే బాంధన్వర్స్ అని 
కూడా అంటారు. వీటిని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచితే ఎంత బావుంతుందో. వీటి నుంచి వచ్చే వెలుగు చూడ ముచ్చటగా ఉంటుంది. ఇవి మనకి  అనేక రంగుల్లో  దొరుకుతాయి. చేతితో చేసే ఈ ఎంబ్రాయిడింగ్ నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు నచ్చిన డిజైన్లు సెలెక్ట్ చేసుకుని ఇంటికి తగిలిస్తే హైలెట్ గా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీరు పెట్టేయొచ్చు. 
 
మట్టి ప్రమిదలు :
 
సాధారణంగా నేటి కాలం లో చాలా మంది ప్రమిదలని వెలిగించడం మానేసి ఎలక్ట్రికల్ దీపాలు కొవ్వొత్తులు వంటివి వాడుతున్నారు. కానీ మట్టి ప్రమిదలు వెలిగిస్తే అలంకరణ బాగుంటుంది. మట్టి ప్రమిద లో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగిస్తే పుణ్యం కూడా.. చేతి తో తయారు చేసిన ఈ దీపాలు అందంగా ఉంటాయి. అంతే కాదు లక్ష్మీ దేవికి ఇవి అంటే చాలా ఇష్టం. కనుక మీరు ఈ దీపాలను వెలిగించి అలంకరిస్తే.. దీని వల్ల ఇంట్లో కి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుందని నమ్మకం.
 
ఇలా ఇంత అందంగా డెకరేషన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇలా ఈ ఐడియాస్ ని మీరు ఫాలో అయ్యి.. ఈ దీపావళి మరింత ఆనందంగా అందంగా కుటుంబ సమేతంగా జరుపుకోండి.