BREAKING NEWS

దీపావళి పండుగ గురించి తెలిసుకోవాల్సిన విషయాలు...!

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు. దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.... ఇటువంటి పర్వదినం రోజు కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు దీపావళి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. కొత్త బట్టలు, టపాసులు, స్వీట్లు ఇలా ఎన్నో వాటితో ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. దీపావళి రోజున దీపాల తో ఇల్లంతా కళకళలాడిపోతుంది.
 
నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందం లో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంక లోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చారు అని కూడా అంటారు. ఇలా ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుగుంటారని రామాయణం చెబుతోంది. అలానే శ్రీకృష్ణుడు సత్యభామ సహకారం తో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. 
 
దీపావళి రోజున చీకటిని పారద్రోలుతూ.. వెలుగులు తెచ్చే పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇలా విజయానికి ప్రతీకగా ఈ పండుగను అంతా కలిసి జరుపుకోవడం జరుగుతుంది. పిండి వంటల తో రంగవల్లికల తో ఆశ్వయుజ అమావాస్య రోజున ఈ దీపావళి పండుగని జరుపుకుంటారు. అమావాస్య ముందు వచ్చే ఆ చతుర్దశి నాడు నరక చతుర్దశి గా జరుపుకుంటారు.
 
నరక చతుర్దశి :
 
నరక చతుర్దశి నాడు స్నానం చేస్తే పుణ్య ప్రధానమని హిందువులు విశ్వాసం. తెల్లవారుజామునే లేచి నరకాసురుని బొమ్మ చేస్తారు. ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలంటుకుని నీటిలో ఆముదపు చెట్టు కొమ్మ తో కలియతిప్పి స్నానం చేస్తారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో  ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి అన్న దమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి నూనె తో తలంటి హారతి ఇస్తారు. అప్పుడు ఆడపడుచులకి ఆశీస్సులు, కానుకలు అందజేస్తారు. ఇలా ఈ పద్ధతి ప్రకారం చేస్తారు కనుక కుటుంబమంతా కలవడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త దుస్తులు ధరించి నరకాసురుడి వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇలా నరకచతుర్దశి జరుగుతుంది.
 
దీపావళి అమావాస్య:
 
దీపావళి అమావాస్య గురించి ప్రతి ఒక్కరికి తెలిసినదే. అలానే ప్రతి ఒక్కరు ఈ పండుగను ఇష్టపడే వారే. ఆశ్వయుజ అమవాస్య రోజున దీపావళి పండుగని జరుపుతారని మనకి తెలుసు. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు రెండు ఉన్నాయి.. అవి మహాలయ అమావాస్య, దీపావళి అమావాస్య. భాద్రపద బహుళ అమావాస్య నాడు మహాలయ అమావాస్య వస్తుంది. అదే ఆశ్వీయుజ బహుళ అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకుంటాం.
 
రాత్రి వేళలో ఈ పండుగను మనం చేసుకుంటాము. అయితే మరి ఈ పండుగని ఎలా చేసుకుంటామో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే పూర్తిగా చూసేయండి... మొదట మనం ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండివంటలు తయారు చేసుకోవాలి. సంధ్యా సమయం లో గోగు కర్రలను తీసి కాగడాలు కట్టి వాటిని వెలిగించి గుమ్మంలో నేల మీద కొట్టాలి.దిబ్బు దిబ్బు  దీపావళి మళ్ళీ వచ్చే నాగులచవితి... అని  ఆరోజు పాడతారు. అంతే కాదు గోగు కర్రలను ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు.
 
ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పెద్దల నమ్మకం. ఆ తర్వాత ప్రమిది లో నూనె వేసి, ఒత్తు వేసి దీపాన్ని వెలిగిస్తారు. వీటికి మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడడం ఎంతో మంచిది. లక్ష్మీ దేవికి ఇష్టమైన నువ్వుల నూనె తో దీపాలు వెలిగిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. గుమ్మం వద్ద అలానే  తులసి మొక్క దగ్గర మాత్రం తప్పని సరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయం లోనే లక్ష్మీ దేవికి పూజ చేస్తారు. ధనలక్ష్మి కి ఈ రోజు పూజ చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అంటారు. దీపావళి నాడు కనుక లక్ష్మీ పూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారాలు నమ్మకం. కొత్త బంగారు వెండి ఆభరణాల తో పూజ చేస్తే శుభప్రదం అని అంటారు.
 
ఆ తర్వాత బాణాసంచా కలుస్తారు. దీనికి కారణం ఏమిటంటే..?  పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువు లో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి అని. అలానే అసుర నాశనానికి , ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వ శుభాలు ప్రసాదిస్తుంది.