BREAKING NEWS

'ఆంధ్రా కాశ్మీర్': పాపికొండలు

 పచ్చని చెట్లు, 
చుట్టూ కొండలు, 
గలగల పారే సెలయేళ్లు
ఆహ్లాదంతో పాటు,
షూటింగ్ స్పాట్ గా చెప్పుకోదగ్గ ప్రాంతం...
పాపికొండల సొంతం,
'ఉప్పొంగేలే గోదావరి ఊగింది చేలో వరి…' అని పాడుతూ బోటు ప్రయాణం చేస్తూ పర్యాటకులు కొత్త అనుభూతులను పొందుతున్నారు. 'ఆంధ్రా కాశ్మీర్'గా పేరుగాంచిన ఈ పాపికొండల విశేషాల గురుంచి మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
 
పాపికొండలు...

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఈ పాపికొండలు ఉన్నాయి. మొదట్లో దీనికి 'పాపిడి' కొండలు అని వాడుకలోకి వచ్చింది. దానికి కారణం స్త్రీల జుట్టులోని పాపిడి మధ్యలో దువ్వెన మాదిరిగా ఈ కొండలు కనపడతాయి. అయితే కాలక్రమేణా ఇప్పుడు ఈ ప్రాంతాన్ని 'పాపికొండలు' అని పిలుస్తున్నారు.

 "గలగల పారే గోదావరికి అక్కడి కొండలు పాపిడంత దారిని ఇచ్చాయి. కాబట్టే వీటిని పాపికొండలంటారు" అని అక్కడికి వచ్చే పర్యాటకులకు స్థానికంగా నివసించే గిరిజనులు గొప్పగా చెబుతుంటారు.
 
అడవి అందాలు...

పాపికొండల అడవుల్లో సింహాలు, చిరుతపులులు, అడవి దున్నలు, గొర్రెలు, జింకలు, దుప్పలు, నక్కలు, కొండ చిలువలు, తోడేళ్లు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ల పందులు, పలు రకాల పక్షులు, విష కీటకాలు, వేల రకాల ఔషధ గుణాలను కలిగిన మొక్కలు, చెట్లు కలిగి ఉన్నాయి.
 
శ్రీరాముని ఆలయ ప్రత్యేకత...

పాపికొండల కోసం వెళ్తుండగా, శ్రీరామగిరి గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో శ్రీరాముని ఆలయం ఉంది. ఎతైన కొండలు, గుట్టల మధ్య దాదాపు 170 మెట్లతో సుమారు 500 ఏళ్ల నాటి మాతంగి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ సీతారామ సమేత లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలు భక్తులకు కన్నులవిందుగా దర్శనమిస్తాయి.
 
ప్రత్యేకతలు...

●పాపికొండల ప్రాంతం 2008లో 'జాతీయ పార్కు'గా గుర్తింపు పొందింది. ఎండాకాలంలో కూడా ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది. కాబట్టే పాపికొండలను "ఆంధ్ర కాశ్మీర్" గా పిలుస్తారు. 

●యాత్రకు వెళ్లినవారు బోటు ప్రయాణం చేశాక రాత్రి సేద తీరడానికి కొల్లూరులో వెదురు గుడిసెలు ఆహ్వానం చెబుతాయి.

●పట్టిసం అనే గ్రామం ఒక చిన్న ద్వీపంలా ఉంటుంది. ఈ ప్రాంతం వీరభద్ర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. పెరంతల్లపి అనేది వెదురు గుడిసెలు, బొమ్మలు, ఇతర సావనీర్ వంటి హస్తకళా వస్తువులకు కేంద్రంగా ఉంది. 

●రాజమహేంద్రవరం నుంచి పాపికొండల వరకు బోటులో వెళ్లొచ్చు. ఈ ప్రయాణం పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం దీపం నుంచి మొదలుపెట్టి పోలవరం, గొందురూ, పోచమ్మ గుడి, సిరిభాక, కొల్లూరు, పేరెంటాలపల్లి మీదుగా వెళ్తుంది. 

●1927వ సంవత్సరంలో స్వామీజీ బాలానంద సరస్వతి ఏర్పాటు చేసిన రామకృష్ణ ముని వాటిక (ఆశ్రమం)ని ఇక్కడ చూడవచ్చు. 

●స్వయంభూ లింగాకార శ్రీ వీరేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

●18వ శతాబ్దంలో ఒక మునీశ్వరుడు రాజమహేంద్రవరం నుంచి లాంచీలో భద్రాచలానికి వస్తుండగా చీకటి పడడంతో  పేరెంటలపల్లిలో బస చేశారు. ఆ రాత్రి ఆయనకు దేవుడు కలలో కనిపించి 'ఇక్కడ గుడి కట్టమని కోరడం'తో శివలింగాన్ని తీసుకొచ్చి గుడి కట్టారు. 

●భద్రాచలం దగ్గర మునివాటం అనే ప్రదేశంలో గలగల పారే జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా కనిపిస్తుంది.
 
సినిమా షూటింగ్స్...

పాపికొండల అందాలను చూడటానికే కాదు, వాటిని వెండితెరలో బంధించడానికి చిత్రవర్గాలు ఆసక్తి చూపుతాయి. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాల చిత్రీకరణ జరిగింది. పూడిపల్లి గ్రామంలో త్రిశూలం, బంగారు బుల్లోడు సినిమాలు షూటింగ్స్ అయ్యాయి.
 
ప్రయాణ మార్గాలు...

ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణలోని భద్రాచలం నుంచి 60 కిలోమీటర్లు,  హైదరాబాద్ నుంచి సుమారు 410 కిలోమీటర్లు,రాజమండ్రి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ పాపికొండలు ఉన్నాయి.

●పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి పోలవరం, గొందూరులో ఉన్న పోచమ్మ గండి, సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.

●తూర్పుగోదావరి నుంచి పాపికొండలకు చేరుకోవడానికి 35 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాలి.

●దాదాపు 21 నెలల తర్వాత ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ తిరిగి బోటు ప్రయాణాన్ని ప్రారంభించారు. పడవలో జీపిఎస్, లైఫ్ జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్‌తో పాటు అన్ని రకాల భద్రతా చర్యలను పాటించాలని నియమం పెట్టారు. ప్రస్తుతానికి పాపికొండలకు ఆరు పడవలదాకా అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని బోట్లను నడిపిస్తామన్నారు. 

●గండి పోచమ్మ తల్లి గుడి దగ్గర నుంచి బోట్లు బయలుదేరనున్నాయి.

●మళ్లీ ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా బోటు షికార్ల పర్యవేక్షణకు తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని అన్నారు. 

●పాపికొండలు టూర్ కోసం పర్యాటక శాఖ పలు ప్యాకేజీలు అమలు చేస్తోంది. ఇందులో ఒకరోజు, రెండు రోజులకు ప్రత్యేకమైన ప్యాకేజీలున్నాయి. 

●యాత్ర టికెట్టు ధర పెద్దలకు రూ.1250, పిల్లలకు రూ.1050గా నిర్ణయించారు. ఈ టికెట్‌ ధరలోనే అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అన్నింటిని అందిస్తున్నారు.

●పర్యాటకుల భద్రతే ప్రాధాన్యతగా బోట్ల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నారు. మరీ మీరు చూసేయండే!

Photo Gallery