BREAKING NEWS

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుకోగా, గత కొన్నాళ్లుగా మూడు రాజధానులు ఉండాలని ఏపీ ప్రభుత్వం బిల్లును ప్రతిపాదించిన సంగతి అందరికీ తెలుసిందే కానీ.. ఇప్పుడు ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న వార్త ఏపీలో సంచలనం రేగింది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తీసుకోబోతున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం…
 
2 జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయాయి.  చంద్రబాబు హయాంలో….
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు నాయుడు పాలనను సాగించారు. తమకంటూ ప్రత్యేకంగా కొత్త రాజధాని ఉండాలనుకున్నారు. దానికోసం సెప్టెంబర్ 4వ తేదీన విజయవాడ, గుంటూరు మధ్య సభ ఏర్పాటు చేయాలని అప్పట్లో అసెంబ్లీలో ప్రకటించారు.

ఆ ఏడాది అక్టోబర్‌‌లో తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ల్యాండ్‌ ఫూలింగ్‌ విధానంలో భూమిని సేకరించాలనుకున్నారు. 2015, జనవరి 2న గ్లోబలైజేషన్ కోసం గుంటూరు జిల్లాలోని నేలపాడు గ్రామంలో అధికారికంగా మొదలుపెట్టారు. అదే ఏడాది ఏప్రిల్‌‌లో ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిగా 'అమరావతి' పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జూన్‌ 6న తుళ్లూరు మండలంలోని మందడం గ్రామంలో రాజధాని నిర్మాణానికి ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. అందుకుగానూ 29 గ్రామాల నుంచి 33వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత దాదాపు 30వేల ఎకరాలను కూడగట్టారు. 
 
శంకుస్థాపన...

●2015 అక్టోబరు 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

●2016 అక్టోబర్ 28న ఏపీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కొరకు వెంకయ్యనాయుడు భూమి పూజ చేశారు.

●అదే సంవత్సరం, జనవరిలో సచివాలయ భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 

●2017 మార్చి 2న ఏపీ శాసనసభ కొత్త బిల్డింగ్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 
 
జగన్ హయాంలో...

2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుపొందడంతో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 
డిసెంబర్ 17న, ఈయన అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో ప్రకటించారు. అందులో భాగంగా విశాఖలో ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ లో జ్యూడిషియల్ క్యాపిటల్ గా, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్ లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు. దాంతో అప్పటి రాజధాని అమరావతి కోసం భూమిని కేటాయించిన 29 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాల్లో నిరాహారదీక్షలను నిర్వహించారు. రైతులందరూ కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

●2020 జనవరి 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గురుంచి, అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వేసిన బిల్లు ఆమోదం పొందింది. 

●జనవరి 22న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు.

●2020 జూన్‌ 16న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో అంగీకరించారు. 

●2020 జులై 31న ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు.
 
అసెంబ్లీలో

ఇప్పటివరకు రాజధాని వివాదాలపై 93 పిటిషన్లు ఉన్నాయి. 2020, నవంబర్‌ 4న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హైకోర్టులో సీపీఎం పార్టీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 2021 మార్చి 26న పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఉన్న పిటిషన్ల విచారణ మే 3కి వాయిదా పడింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఆ సమయంలోనే అక్టోబర్‌ 14న ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్‌ 15న ఏపీ రాజధాని వికేంద్రీకరణ కేసులపై హైకోర్టులో విచారణలు ప్రారంభమయ్యాయి.

తిరిగి సోమవారం 22న అసెంబ్లీలో మొదలైన చర్చలో నాలుగు గంటలపాటు కొనసాగింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాలనా వికేంద్రీకరణ, ఏపీసీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ బిల్లును ప్రవేశపెట్టారు. అందులో మూడు రాజధానుల అవసరాల గురుంచి ప్రజలకు తెలిసేలా, అందుకు అనుగుణంగా బిల్లులో మార్పులుచేర్పులు చేసి ఇవ్వడానికి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. దానిని మండలి ఆమోదం పొందడంతో గవర్నర్ కి పంపనున్నారు. అంతేకాదు ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లులన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్నారు. 
 
కోర్టులో...

రాజధాని విషయంలో ఎన్నో వివాదాలు జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ జోక్యం చేసుకొని రెండు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. 

●మధ్యాహ్నం మొదలైన విచారణలో భాగంగా బిల్లుతో పాటు, ఇప్పుడు మళ్లీ తీసుకురావడానికి గల కారణాలను మెమో రూపంలో కోర్టుకు అందజేయడానికి మరికొంత సమయం కావాలని కోరారు. 

●రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ మాట్లాడుతూ.. మొదటగా బిల్లులో ఏముందో పరిశీలించాకే స్పందించాలని చెప్పారు. 

●శుక్రవారంలోపు అఫిడవిట్ తో పాటు మెమో, బిల్లు ప్రవేశపెట్టడానికి కారణాలను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది.

●సోమవారం జరగాల్సిన విచారణలో సీఎం జగన్ రద్దు చేసిన బిల్లును ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏజీ శ్రీరామ్ ధర్మాసనం ముందు ఉంచబోతున్నారు. ఇరువర్గాల విచారణ తర్వాత తీర్పు ఏం వస్తుందో అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.