BREAKING NEWS

గిరిజనుల 'భగవాన్'.... బిర్సా ముండా

బిర్సా చదువుకుంటూనే బ్రిటిషు పాలన గురుంచి తెలుసుకున్నాడు. గిరిజనులు తమ మూలాలను తెలుసుకొని ఒక్కటిగా కలిసుండాలని చెప్పాడు. దాంతో ఆయన్ని 'భగవాన్' గా పిలిచేవారు. ఇతని కారణంగానే  ఆదివాసుల భూమి హక్కుల కోసం చట్టాలు వచ్చాయి. సాంఘిక, సాంస్కృతిక విప్లవాలు గిరిజనుల జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. తాను ముందుండి ఎంతోమందిని నడిపించాడు. బ్రిటిషర్లకు తన పేరు చెబితేనే వణుకు పుట్టేలా చేశాడు. జైలు పాలైనా పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. చివరకు విషప్రయోగంతో చిన్నవయసులోనే (25 సంవత్సరాలు) వీర మరణం పొందాడు. ఈయన్ని ఎంతోమంది ప్రజలు దేవుడిగా పూజిస్తారు. బిర్సా ముండా త్యాగాలను స్మరించుకుంటూ… ఆయన గురుంచి తెలుసుకుందాం:
 
బాల్యం...

బిర్సా ముండా నవంబర్ 15, 1875లో ఇప్పటి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ, అప్పట్లో ఖుంతీ జిల్లా ఉలీహట్ గ్రామంలో జన్మించారు. తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు. అన్న కొమ్టా, అక్క దస్కిర్, చంపా, తమ్ముడు పస్నా ముండాలు.

సాల్గా గ్రామంలో ప్రాథమిక విద్య చదివారు. తర్వాత బూర్జు మిషన్ స్కూల్ లో చేరాడు. అక్కడే క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. అక్కడి నుంచి ఛైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నాడు. ఆ సమయంలోనే బ్రిటిషు పాలకుల అరాచకాల గురించి తెలుసుకున్నాడు.
 
ఉద్యమ మార్పు...

సంతాల్ ఉద్యమం, చువార్ ఉద్యమం, కోల్ విప్లవం ప్రభావం ఈయన మీద ఉన్నాయి. దానికి కారణం తమ జాతి పైన సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరంగా అణిచివేస్తున్న దుస్థితిని చూసి ఈయన విప్లవకారుడు కావాలనుకున్నారు. అందుకుగానూ ముండా జాతివారి పాలన కోసం అందరినీ ఏకం చేయాలని నిశ్చయించుకున్నారు.

అలా 'బిర్సాయిత్ మతాన్ని' స్థాపించారు. ఇందులో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, అందరూ కలిసుండాలని, ఆధ్యాత్మికతతో మెలగాలని ప్రతిపాదనలు పెట్టుకున్నారు. 
‘తెల్లవాళ్లు వెనక్కి పోవాలి’ అన్న నినాదం ఇచ్చి, మన సాంప్రదాయ ప్రజాస్వామ్య స్థాపన జరగాలని పిలుపునిచ్చారు. ‘మహారాణి పాలన పోతుంది– మన రాజ్యం వస్తుంది’ అని ఆయన అంటుండేవారు.

●బిర్సా "సిర్మరే ఫిరూన్ రాజా జై" అంటూ ప్రస్తావించారు. అంటే ఆదివాసులకు తరతరాలుగా వస్తున్న భూమిపై వారే అధికారాన్ని పొందడం అనే అర్థం వస్తుంది.

●1 అక్టోబర్ 1894న బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా, అద్దె మాఫీ కోసం బిర్సా ఏకంగా సమరమే చేశారు. అలా 1895లో అరెస్టు చేసి హజారీబాగ్ సెంట్రల్ జైలులో రెండు సంవత్సరాలపాటు శిక్షను విధించారు.  

●బయటకు వచ్చాక 1897 నుంచి 1900 వరకు ముండా ప్రజలకు, బ్రిటిష్ సిపాయిలకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. ఆ ఏడాది ఆగస్టులో బిర్సా, తనతో ఉన్న 400మంది సైనికులతో కలిసి మంఖూన్టీ పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. దాంతో రగిలిపోయిన బ్రిటిషర్లు ఆ ప్రాంతీయ వనవాసీల నాయకులను తీసుకెళ్లి నిర్బంధించారు.

●1900 జనవరి 8న బిర్సా ముండా దొంబరి కొండపై బ్రిటీషులకు, క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా ఉల్గులన్(సంపూర్ణ విప్లవం) ను ప్రకటించారు. దాంతో బ్రిటిషు వాళ్ళు ఆ కొండపై దాడి చేయడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారు. మిగతావారిని పట్టుకొని చిత్రహింసలకు గురిచేశారు. బిర్సా ముండా తప్పించుకున్నారు. బ్రిటిషు వాళ్లు వీళ్లని పట్టుకునేందుకు ప్రకటనలను ఇచ్చింది. చివరగా ఫిబ్రవరి 3న ఇతనితోపాటు మరో 842 మందిని అరెస్టు చేశారు. అక్కడికి తీసుకెళ్లి ఈయన్ని బాగా చిత్రహింసలు పెట్టారు. జైలులో ఉన్నపుడే బిర్సాకు విషప్రయోగం చేయడంతో మెల్లిమెల్లిగా  అనారోగ్యపాలై జూన్ 9, 1900న (25 ఏళ్ల వయసులోనే) మరణించాడు. 
 
ఈయన స్మృతిగా

●బిర్సా ముండా గుర్తుగా రాంచీలో విమానాశ్రయానికి, సెంట్రల్ జైలుకు ఈయన పేరునే పెట్టారు. 

●గిరిజనుల స్వాత్రంత్య సమరయోధుల స్మారక శాలలను నిర్మించడానికి 2016 ఆగస్టు 15న ప్రధాని అధికారికంగా ప్రకటించారు. అందుకుగానూ మొదటగా రాంచీలో బిర్సా ముండా మ్యూజియాన్ని  గత వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

●గిరిజనుల త్యాగాలను, స్వాత్రంత్య పోరాటంలో వారి పాత్రలను గౌరవిస్తూ 
ఏటా నవంబర్ 15న జనజాతీయ గౌరవ దినంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 

●ఈయనతోపాటు మిగితా గిరిజనులను స్మరించుకుంటూ 15 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలనుకున్నారు.

●భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో బిర్సా చిత్రపటాన్ని పెట్టారు.

●1988లో భారత ప్రభుత్వం ఈయన చిత్రంతో ఉన్న ఒక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. 

●ఝార్ఖండ్ ప్రభుత్వం నవంబర్ 15న బిర్సా ముండా జయంతిని ఘనంగా జరుపుకుంటుంది. 
 
ఇతరాంశాలు...

●1894లో ఛోటా నాగపూర్ ప్రాంతంలో అనావృష్టి కారణంగా భయంకరమైన కరవు ఏర్పడి, అంటువ్యాధులు వ్యాపించాయి. ఆ సమయంలో బిర్సా ముండా అందరికీ సేవ చేశారు.

●ఈయనను మాములుగా భగవాన్ అని పిలుస్తారు, ప్రజలకు సేవలందించినందుకుగానూ ధర్తీ బాబాగా గౌరవిస్తున్నారు.

●రాంచీలోని డిస్టిలరీ బ్రిడ్జి దగ్గర బిర్సా ముండా సమాధిని నిర్మించారు. 

●బీహార్ గవర్నర్ అనంత శయనం అయ్యంగార్ బిర్సా విగ్రహాన్ని నెలకొల్పి 1966 నుంచి ఆ స్మారకం దగ్గర అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

●ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని గిరిజన ప్రాంతాలలోని ప్రజలు ఈయన్ని దేవుడిలా పూజిస్తారు.