BREAKING NEWS

'దీపాల'పండుగ

దీపావళి అంటే అందరూ కలిసి దీపాలు వెలిగించి, టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకోవడమే కాదు. దాని వెనుక ఓ కథ ఉంది. ఒక రాక్షసుని కారణంగా ఎంతోమంది మునులు, దేవతలు క్షోభకు గురయ్యారు. ఆ సమయంలో నందగోపాలుడి రూపంలో అందరికి సాంత్వన లభించింది. నరకుని మరణాన్ని ప్రజలు సంతోషంతో వేడుక చేసుకున్నారు. అదే అమావాస్యనాడు నరక చతుర్దశిగా ప్రతి ఏటా చీకటిని దీపాల వెలుగులతో పారదోలే ఆనవాయితీగా వచ్చింది. భారతదేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మిఠాయిలు పంచుకుంటూ పండుగను జరుపుకుంటున్నాం. మరి ఆ దీపావళి పండుగ వెనుక కథ, విశిష్టత, ఇతర ప్రత్యేకతల గురుంచి మనం తెలుసుకుందాం:
 
ధన త్రయోదశి/ ధన్ తేరాస్:

దీపావళికి ముందు వచ్చే రోజునే 'ధన్ తేరాస్'/ 'ధన త్రయోదశి'/ 'ఛోటీ దివాలీ' అని పిలుస్తాం. ఈరోజున ప్రత్యేకంగా బంగారం, వెండి, వస్త్రాల్లాంటి ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అదేరోజు సాయంత్రం దీపాలు వెలిగించి, లక్ష్మీ దేవికి స్వాగతం పలుకుతారు. ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.

ధనత్రయోదశి కథ...

పూర్వం హేమరాజు అనే ప్రభువుకు కొడుకు పుట్టాడు. అతనికి పదహరేళ్ల వయసు రాగానే చనిపోతాడనే విషయాన్ని జ్యోతిష్యులు చెబుతారు. అందుకు పరిష్కారంగా సుమంగళి యోగం ఉన్న ఒక రాకుమారితో వివాహం జరిపిస్తారు. కుమారుడికి ప్రాణగండం ఉన్నట్లు కోడలికి చెబుతారు. అది తెలిసి పెళ్లైన మూడోరోజు తన భర్తను మృత్యువు నుంచి కాపాడుకోవడానికంటూ ఆమె లక్ష్మి దేవిని పూజించి, జాగారం చేసింది. ఆపై ఒక పెట్టెలో బంగారం, ఇతర వజ్రభారణలను వేసి, దానిని గుమ్మం ముందు ఉంచింది.

దాని చుట్టూ దీపాలు వెలిగించి దేవుణ్ణి ప్రార్థిస్తూ తన భర్త నిద్రపోకుండా చూసుకుంది. ఆ తర్వాతి రోజునే యమ ధర్మరాజు పాము రూపంలో ఆ ఇంటికి వస్తాడు. కానీ అక్కడ ఉన్న దీపాల వెలుగులో చూపు మసకబారిపోవడంతో లోపలికి వెళ్లలేక తిరిగి వెనక్కి వెళ్లిపోతాడు. తెలివిగా వ్యవహరించి రాకుమారి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఇది సరిగ్గా దీపావళికి ముందు త్రయోదశి నాడు జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి 'ధన త్రయోదశి'గా మనం నేటికి జరుపుకుంటున్నాం.

◆ధన త్రయోదశి అనే కాక 'ధన్వంతరి త్రయోదశి', 'త్రివిక్రమ త్రయోదశి', 'కుబేర త్రయోదశి', 'ఐశ్వర్య త్రయోదశి' ఇలా అనేక పేర్లున్నాయి. 

◆ ఈరోజున లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో పూజించాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి, వారికి బహుమతులు ఇవ్వాలి. 
 
నరకచతుర్దశి / దీపావళి...

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడు మరణించాక, తర్వాత రోజు ఆనందంతో చేసుకున్నా సంబరాలే దీపావళి పండుగ. 
వరహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత విష్ణుమూర్తికి, భూదేవికి నరకుడు పుడతాడు. అతనిలో అసుర లక్షణాలున్నాయని విష్ణుమూర్తి చెప్తాడు. తన బిడ్డను రక్షించుకోవడానికి భర్తను వేడుకోగా, తల్లి వల్లే మరణిస్తాడని బదులిస్తాడు. 'ఏ తల్లి తన బిడ్డను చంపుకోదు' అని తనకు తాను అనుకుంటుంది. రాజధాని అయిన ప్రాగ్జ్యోతిషపురాన్ని నరకుడు పాలిస్తాడు.

అతను స్త్రీలను గౌరవించేవాడు, మర్యాదస్తుడు. అలాంటిది బాణాసురుని స్నేహంతో పూర్తిగా మారిపోతాడు. దేవతలను బాధపెడుతూ, మునులను వేధించేవాడు. వేలమంది పరాయిస్త్రీలపై పైశాచికత్వాన్ని చూపిస్తూ లోకకంటకుడిగా తయారవుతాడు. అంతటితో ఆగక చివరకు ఇంద్రుని అధికార ముద్రను సైతం అపహరిస్తాడు. ఇందుకు ఇంద్రుడు ఆపదరక్షకుడైన నందగోపాలునితో అంతా మొరపెట్టుకున్నాడు. దాంతో శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరుతాడు.

నరకాసురుని విషపు బాణాన్ని నిలువరించడానికి సత్యభామ కోపంతో భయంకరమైన తన బాణాలను విసిరింది. ఇదే అదనుగా శ్రీకృష్ణుడు నరకుడిపై సుదర్శనాన్ని ప్రయోగించి అతని తలను నరికేయగా మరణం పొందుతాడు. అలా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. ఈ సంఘటన తర్వాత, తన పుత్రుని పేరుని ఎప్పటికి గుర్తిండిపోయేలా ఉండాలని సత్యభామ(తల్లి) కోరగా, అందుకు శ్రీకృష్ణుడు ఆ రోజునే 'నరక చతుర్దశి'గా వరం ప్రసాదించాడు. నరకాసురుని మరణాన్ని ప్రజలు సంబరంగా జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని వెలివేస్తూ, దీపాలతో తోరణాలను కట్టి, బాణసంచా కాల్చుతూ వేడుకలను చేసుకున్నారు. 
 
మరికొన్ని

◆రామాయణంలో తండ్రి ఆజ్ఞ మేరకు రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి అడవికి వెళ్లారు. రావణుడు మారువేషంలో సీతను ఎత్తుకుపోయాడు. రావణునితో యుద్ధం చేసి గెలిచిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు వెళ్తాడు. ఆ రోజు అమావాస్య కావడంతో ప్రజలు దీపాలను వెలిగించి, చీకటిని పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.

◆అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఇరువైపులా పాలసముద్రాన్ని చిలుకుతుండగా అమవాస్యనాడు(ఈరోజు) లక్ష్మీదేవి ఉద్భవించింది. ఇందుచేతనే సకల అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళినాడు సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు.
 
దీపావళి రోజు చేయాల్సినవి, అలాగే బాణసంచా కాల్చడం వెనుక గల కారణం...

దీపావళి రోజు సాయంత్రం నువ్వులనూనె లేదంటే ఆవునేతిని మట్టి ప్రమిదెలలో నింపి, దీపాలను వెలిగించాలి. తోరణాలతో ఇల్లంతా అలంకరించాలి. అందరికీ మిఠాయిలు పంచాలి. పిల్లలు, పెద్దలు కలిసి టపాసులు కాలుస్తూ అమావాస్య చీకట్లను తరిమికొట్టాలి. లక్ష్మీదేవి తప్పనిసరిగా పూజించాలి. తెలంగాణలో ఈ పండుగను 'దివ్వెల పండుగ' అని అంటారు.
తెలుగు రాష్ట్రాల్లో మూడు నుంచి ఐదు రోజులపాటు బొమ్మల కొలువు పెడతారు.

◆దీపావళి రోజున రాత్రి బాణసంచా కాల్చడం వల్ల వెలువడే పొగ, వాసనతో ఈ కాలంలో వచ్చే దోమలు, క్రిములు నశిస్తాయి.
 
కార్తీక శుద్ధ పాడ్యమి...

దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతుంది. దీనికి మరొక పేరు బలి పాడ్యమి అని అంటారు. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేయగా తిరిగి మళ్ళీ భూమ్మీదికి తిరిగివచ్చిన రోజుగా భావిస్తారు. అందుకే ఆ రోజున బలిచక్రవర్తిని పూజిస్తారు. మహారాష్ట్ర వాసులు నవ్ దివన్ గా, గుజరాతీ వాళ్ళు ఉగాదిగా వేడుకలు చేసుకుంటారు. 
 
కార్తీక శుక్ల విదియ తిథి...

కార్తీక శుక్ల విదియ తిధి రోజున 'భగినీ హస్త భోజనం'గా వేడుక చేసుకుంటారు. సూర్యుని బిడ్డలైనా యమునా నది, యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమున తన అన్నను భోజనానికి పిలవగా ఇంటికి వచ్చి తన చెల్లెల్లి చేత్తో వడ్డించిన ఆహారాన్ని తిని, సంతృప్తి చెందాడు. అందుకు తన చెల్లెలిని వరం కోరుకోమని అడగ్గా, కార్తీక శుక్ల విదియ నాడు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంటను తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, మృత్యుదోషం లేకుండా ఉండేటట్లు చేయమని అంటుంది. అందుకు యమధర్మరాజు ఏ చెల్లెళ్లు అయితే ఈరోజున అన్నకు వడ్డిస్తుందో ఆమె పుణ్యవతిగా, దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతుంది అని చెప్తాడు. అందుకే దీనికి యమ ద్వితీయ అనే పేరు వచ్చింది. దీన్ని భాయ్ దూజ్ అని, భాత్రు ద్వితీయ అని, భాయ్ టీక అని పలు పేర్లతో, పలు ప్రాంతాల్లో జరుపుకుంటారు.
 
మరికొన్ని విషయాలు...

◆మరాఠీలో 'యక్షరాత్రి' గా దీపావళిని జరుపుకుంటారు.

◆గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో రైతులు 'పశుపూజారి'గా, 'ధన్ తేరాస్' పేరుతో కొత్త సంవత్సరంగా చేసుకుంటారు.

◆ఉత్తర ప్రదేశ్ లో 'భారత్ మిలన్' పేరిట దీపావళి జరుపుకుంటారు.

●రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళి రోజు భూతబలి ఇస్తారు. అంటే కుక్కలకు, కాకులకు ఆహారాన్ని పెట్టి కుంకుమ, పసుపుతో పూజిస్తారు.

●మధురలో 'అన్నకూట్' గా పశువులకు, పక్షులకు ఆహారాన్ని పెడతారు. 

●పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో 'జగద్ధాత్రి'గా పిలుస్తూ, అమ్మవారికి కాళీ పూజలు జరుపుతారు.

●కేరళలో బలిచక్రవర్తిని ఓడించన రోజుగా భావించి దీపావళి పండుగను జరుపుకుంటారు.

●బుందేల్ ఖండ్ లో కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున రావణదహనం చేస్తారు.

●ఈ రోజు జైనుల మహావీరుని నిర్వాణదినంగా భావించి దీపాలు వెలిగిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. 

●మొగల్ చక్రవర్తి అక్బర్ ఈ దీపావళి పండుగను ఘనంగా జరిపించినట్లు అబుల్ ఫజల్ రాసిన 'అక్బర్ నామా' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

●సిక్కులు అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని దీపాలతో అలంకరించి ప్రార్థిస్తారు. కారణం వారి మతగురువైన గురు హారగోవింద్ సాహిబ్ మొగల్ చక్రవర్తుల చెర నుంచి విడుదలైన రోజు కావడంతో ఉత్సహంగా వేడుకలను జరుపుకుంటారు.
 
మొత్తానికి దీపావళి అంటే, చెవులు చిల్లులు పడే టపాసుల మోత కాదు. 
వెలుగుల పండుగ, 
చెడుపై మంచి గెలిచే దివ్యమైన పండుగ.