BREAKING NEWS

విష్ణుమాయ.. జగన్మోహిని అవతారం

ఏ ఆలయంలోనైనా దేవదేవతలు ముఖచిత్రంతో నిలువెత్తు రూపంలో కనిపిస్తారు. ఎక్కడా రెండు గుళ్ళు ఒకదానికొకటి ఎదురెదురుగా లేవు. అటువంటి ఈ దేవాలయంలో విశిష్టంగా విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని రూపంలో కొలువై ఉన్నారు. నల్లరాతి శిల్పం కావడంతో దీపాల వెలుగులో ప్రతిరూపం కంటికింపుగా కనిపిస్తుంది. దివ్యమైన రెండు రూపాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ద్విరూప స్వరూపంతో కనపడుతూ ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంతోపాటు, శ్రీ ఉమాకమండలేశ్వర స్వామిని దర్శించుకోవడం గొప్ప అనుభూతునిస్తుంది. అటువంటి ఈ ఆలయాల గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం...
 
ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందిన చోళ చక్రవర్తి రాజా విక్రమదేవుడు కట్టించినట్లు ప్రసిద్ధి. తిరిగి ఈ గుడిని 1936లో పునఃప్రారంభించారు. ర్యాలీలో జగన్మోహిని రూపంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఇది ఏక శిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. స్వామివారు ఐదు అడుగుల పొడవుతో, మూడు అడుగుల వెడల్పుతో ఉంటారు. ఈయన్ని బదిలీల స్వామిగా కూడా పిలుస్తుంటారు.
 
అసలు కథ...

శ్రీ మహాభాగవతి ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మథన సమయంలో అమృతం బయటికి వచ్చినప్పుడు దానికోసం రాక్షసులు, దేవతలు మధ్య తగువులాట జరుగుతుంది. దాంతో అందరూ కలిసి విష్ణువుకు మొర పెట్టుకోగా ఆయన జగన్మోహిని అవతారమెత్తుతాడు. దేవతలను, రాక్షసులను వేరువేరు వరసలో నిల్చోబెట్టి అమృతం మొత్తాన్ని సురులకే పంచుతాడు. నారదులు ఆ విషయం గురుంచి చెబుతూ అందరూ ఆమె సౌందర్యానికి మైమరచిపోయారు అని అంటాడు. అప్పుడు శివుడు విష్ణువు అవతారంలో ఉన్న జగన్మోహినిని చూసి మంత్రముగ్ధుడై ఆమె వెంట పడతాడు. మోహినీ స్వరూపుడైన శ్రీమహావిష్ణువు కొప్పు నుంచి ఒక పువ్వు కింద పడుతుంది. అలా పడిన చోటే ర్యాలీగా పిలుస్తారు.
 
మరో పురాణగాథ ప్రకారం… 

విక్రమదేవుడనే రాజు విష్ణు భక్తుడు. ఎప్పుడు భక్తి శ్రద్ధలతో విష్ణువుకు పూజించేవాడు. ఆ కాలంలో ర్యాలీ ప్రాంతం దట్టమైన అడవితో నిండి ఉండేది. ఓసారి వేటకు వెళ్లిన రాజు అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ నిద్రపోయాడు. కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి స్వయంభూ శిలారూపంలో ఆ ప్రాంతంలో ఉన్నానన్నారు. నువ్వు కర్రతో రథం చేయించి లాకొని వెళుతుంటే ఆ రథం చక్రాల శిల ఊడిపోయి పడిన చోట గనక తవ్విస్తే నా విగ్రహం కనిపిస్తుందని ఆ ప్రదేశంలోనే నాకు గుడి కట్టాలని చెప్పాడట. విక్రమదేవుడు కలలో వచ్చిన విధంగానే చేశాడు. రథ శిల రాలడం వలనే ఈ క్షేత్రానికి ర్యాలీ అని పేరు వచ్చింది. అంతకుముందు రత్నపురం అని కూడా పిలిచేవారు. 
 
పరమేశ్వరుడు...

శ్రీ జగన్మోహిని కేశవస్వామి గుడికి ఎదురుగా పరమేశ్వరుడు ఆలయం ఉంటుంది. దానికిగల కారణం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో పావనం చేశాడట. అందుకే శంకరుడిని 'శ్రీ ఉమాకమండలేశ్వర స్వామి' అని పిలుస్తారు.
 
ఇతర ప్రత్యేకతలు...

●జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువును, శివుడు వెనుక నుంచి వచ్చి చేయి పట్టుకోగా అక్కడే నిలబడిపోతారు. అలా ముందువైపు శ్రీమహావిష్ణువుగా, వెనుకవైపు మోహిని అవతారంలో మనకు కనిపిస్తుంది ఈ సుందర దృశ్యం. ఈ విగ్రహాన్ని ఏకసాల శిలతో తయారు చేశారు. 

●స్వామివారి పాదాల కింద మధ్యలో గంగ జలం ఎల్లప్పుడూ పొంగుతూనే ఉంటుంది. విగ్రహం ముందువైపు విష్ణువు శంఖం, చక్రం, గదతో కొలువై ఉంటాడు. విష్ణువుపైన ఆదిశేషుడు పడగవిప్పి నీడనిస్తున్నట్లుగా కనిపిస్తాడు. 

●విష్ణువుని మోహిని అవతారంలో చూసిన శివుడు మైమరచిపోతాడు. అలా ఏకమైన వారికి పుట్టిన కుమారుడే అయప్పగా భక్తుల పూజలందుకుంటున్నాడు. 

●ఎవరికైనా ఉద్యోగంలో వేరే ప్రాంతాలకు బదిలీ కావాలనే కోరికను మోహినీ అవతారంలో ఉన్న విష్ణువు(శ్రీ జగన్మోహిని కేశవస్వామి)కి చెప్పుకుంటే నెరవేరుతుందని అక్కడి భక్తుల నమ్మకం.

●ఈ ఆలయాల్లో శ్రీదేవి, భూదేవి, నారద మహర్షి, తుంబర, రంభ, ఊర్వశీ, శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు, గంగా, గరుడ విగ్రహాలను అద్భుతంగా చెక్కారు.

●జగన్మోహిని కేశవ కళ్యాణం, శ్రీ రామ సత్యనారాయణ పరిణయం, వేణుగోపాలస్వామి కళ్యాణం, జన్మాష్టమి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు లాంటి పర్వదినాల్ని జరుపుతారు.
 
ప్రయాణ మార్గాలు...

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు(288 కిలోమీటర్లు) చేరి అక్కడి నుంచి ఏలూరు మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 
హైదరాబాద్ నుంచి 437 కిలోమీటర్లు,
వరంగల్ నుంచి 362 కిలోమీటర్లు,
ఖమ్మం నుంచి 274 కిలోమీటర్లు,
విజయవాడ నుంచి 162 కిలోమీటర్లు,
రాజమండ్రి నుంచి 38 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.