BREAKING NEWS

'అప్పు'డే వెళ్లిపోయావా?!

అప్పు… 
ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసి కన్నడ పవర్ స్టార్ గా నిలిచి చివరికి మృత్యు ఒడిలోకి చేరారు. ఆయన హఠాన్మరణం తీరని లోటుని మిగిలించింది.

నిన్న సొంతూరు చామరాజనగర్ జిల్లాలోని గాజనూరుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పారు. అంతకుముందే జిమ్ లో వ్యాయామం చేస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు పునీత్(46 సంవత్సరాలు). ఆయన అక్టోబర్ 29న ఉదయం తన ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన సంబంధిత వ్యక్తులు హుటాహుటిన దగ్గర్లోని రమణశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విక్రమ్ హాస్పిటల్ కి తరలించారు.

అక్కడి వైద్యులు పరీక్షలు చేసి, ఐసీయూలో ఉంచారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌ మరణించినట్లు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై అధికారికంగా ప్రకటించారు. ఈయన చనిపోయిన తర్వాత కర్ణాటకలో ఉన్న థియేటర్ లు అన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు. తమ అభిమాన హీరో మరణ వార్త విన్న తర్వాత విక్రమ్ హాస్పిటల్ చుట్టూ ప్రేక్షకుల రోదనలతో, జన సంచారంతో రోడ్డంతా కిక్కిరిసిపోయింది. చనిపోయి కూడా తన కళ్లను మరొకరికి దానం చేసి, సజీవంగా బతికే ఉన్న పునీత్ సినీ, సేవా జీవితం గురుంచి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
బాల్యం...

పునీత్ రాజ్‌కుమార్‌ తమిళనాడులోని చెన్నైలో 1975 మార్చి 17న జన్మించారు. తండ్రి కంఠీరవ రాజ్‌కుమార్‌. తల్లి పార్వతమ్మ. అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, శివ రాజ్‌కుమార్‌, అక్కలు పూర్ణిమ, లక్ష్మీ. కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశారు. ఆపై 1999లో స్నేహితుడి ద్వారా పరిచయమైన బెంగుళూరుకు చెందిన అశ్వినిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వదింతా.
 
సినీరంగ ప్రవేశం...

పునీత్ అసలు పేరు లోహిత్. 1976లో తన తండ్రి నటించిన 'ప్రేమద కానికే' అనే చిత్రంలో పుట్టిన ఆరునెలలకే వెండి తెరకు పరిచయమయ్యాడు. 1997లో 'సన్నాది అప్పన్నా' సినిమాలో పునీత్ గా పేరు మార్చుకున్నాడు. 1982లో 'భాగ్యవంత' అనే సినిమాలో తొలిసారిగా పాట పాడారు. 'చాలిసువ మొదగాలు', 'ఎరడు నక్షత్రగళు' లాంటి చిత్రాల్లో నటించి కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ బాల నటుడిగా రెండు అవార్డులను అందుకున్నాడు.

1985 'బెట్టద హువు' సినిమాకుగాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. చివరగా 1989లో 'పరశురామ' చిత్రంలో బాల నటుడిగా నటించారు. 2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'అప్పు' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం విడుదలయ్యి మంచి విజయం సాధించింది. దాంతో ప్రేక్షకుల గుండెల్లో అప్పుగా ముద్రపడ్డారు. అప్పటినుంచి తెలుగులో వచ్చిన 'ఆంధ్రావాలా', 'రెడీ', 'దూకుడు', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'ఒక్కడు'. తమిళంలో వచ్చిన 'నాడోడి గళ్', 'పోరాళి','పూజై' వంటి చిత్రాలన్నీ కన్నడ భాషల్లో రీమేక్ లు చేసి, ఎన్నో విజయాలను అందుకున్నారు.

2006లో వచ్చిన 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడ భాషల్లో దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ అజయ్ పేరుతో విడుదల చేశారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాదు అప్పు నుంచి పవర్ స్టార్ గా అభిమానులు పునీత్ కు బిరుదు ఇచ్చారు.
2017లో విడులయిన 'రాజకుమార' చిత్రం కన్నడలో అత్యంత భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.
 
గాయకుడిగా...

◆ అప్పు చిత్రంలో 'తాలిబన్ అల్లా అల్లా..' అనే పాటను పాడారు. ఆ తర్వాత 'వంశీ, జాకీ' వంటి సినిమాల్లో గాయకుడిగా మారారు.

◆ తన సోదరుడు శివ రాజ్‌కుమార్‌ నటించిన 'లవకుశ, మయిలారీ' చిత్రాల్లో పాటలను పాడి, వినిపించారు.
 
నిర్మాతగా...

●2019లో కన్నడలో 'కవలుదారి' చిత్రయానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ ఏడాది ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

● ఆ తర్వాత మాయాబజార్, లా, ఫ్రెంచ్ బిర్యానీ వంటి చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం 'ఫ్యామిలీ ప్యాక్', 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'ఓ2' సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
 
హోస్ట్ గా...

●2012లో 'కౌన్ బనేగా కరోడ్ పతి' కన్నడలో 'కన్నడ కోట్యాధిపతి' లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

●'ఫ్యామిలీ పవర్'లో కన్నడ షోలో హోస్ట్ గా చేశారు.

●2010లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు కి చెందిన క్రికెట్ టీంకు 'బ్రాండ్ అంబాసిడర్'గా కూడా పునీత్ వ్యవహరించారు.
 
సేవలో...

●ఇప్పటివరకు 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలకు సాయం అందిస్తూ వచ్చారు.

●'శక్తిధామ' అనే సంస్థ ఆధ్వర్యంలో 1800 మంది విద్యార్థులకు చదువును చెప్పిస్తున్నారు.

●వరదలు వచ్చినపుడు తన వంతుగా 5 లక్షల రూపాయలను, కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల విరాళాన్ని పునీత్ అందజేశారు. ఇలా ఎన్నో సేవలు చేస్తూ ఆయన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
 
ఇతరాంశాలు...

◆పునీత్‌ రాజ్‌కుమార్‌ బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు. 

◆ఇప్పటివరకు దాదాపు 30 చిత్రాలల్లో హీరోగా చేశారు.

◆2021లో వచ్చిన 'యువరత్న' చివరి చిత్రం.

◆తాజాగా 'జేమ్స్', 'ద్విత్వా' సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

◆పునీత్ నటించిన 'చక్రవూహ్య' అనే సినిమాలో ఎన్టీఆర్ ఒక పాటను పాడారు. 

●నేపథ్యగాయకుడిగా వందకుపైగా సినిమాల్లో పాడారు. అలా వచ్చిన డబ్బును సేవా సంస్థలకు కేటాయించారు.
 
ప్రముఖుల సంతాపం...

◆టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు పునీత్ మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

◆కంఠీరవ స్టేడియానికి పునీత్ భౌతిక దేహాన్ని తరలించి అభిమానుల సందర్శనకు ఉంచారు.

◆ఈరోజు సాయంత్రం తండ్రి సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నట్లు వెల్లడించారు.

◆కన్నడలో ఎన్నో ప్రొడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

◆అంతేకాదు ఈయన మరణాంతరం తన కుటుంబసభ్యుల అంగీకారంతో, నారాయణ నేత్రాలయానికి పునీత్  కళ్లను దానం చేశారు.
 
◆ప్రధానమంత్రి నరేంద్ర మోదీ-
ప్రతిభావంతుడైన నటుడిని మన నుంచి దూరం చేసింది. ఇది వెళ్లే వయసు కాదు. రాబోయే తరాలకు ఆయన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకుంటాయి.

◆కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై-
'యూత్ ఐకాన్ పునీత్' అని, కన్నడిగుళ అభిమాన నటుడు అప్పు మరణం కన్నడ సినిమా ఇండస్ట్రీకి, రాష్ట్రానికి తీరని లోటు కలిగించింది. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ బాధను తట్టుకునే శక్తిని అభిమానులకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.