BREAKING NEWS

అ'సామాన్యులకు' పద్మశ్రీ...!

పండ్లు అమ్మిన సొమ్ముతో ఏకంగా పాఠశాల కట్టించాడు. చదువుకోకపోయినా ఎంతోమంది పిల్లలకు చదువు గొప్పతనం తెలిసేలా చేశాడు. అలా అని అతనో ధనికుడు కాదు, నిరుపేద వ్యక్తి. 
చిన్నవయసులోనే తండ్రిని, భర్తను పోగొట్టుకుంది. ఆ బాధ నుంచి బయటపడటానికి అడవి బాట పట్టింది. చెట్ల మధ్యలో తిరుగుతూ వాటిని బిడ్డల్లా సాకింది. అలా అని ఓ నాలుగు మొక్కలను కాదు, వేల సంఖ్యలో చెట్లను పెంచి, అడవినే సృష్టించేసింది. 
పర్యావరణానికి ఎంతోమేలు చేసినందుకుగానూ తులసీ గౌడకి, చదువుకు దూరమైన పిల్లల విద్య కోసం పాటుపడిన హరికేల హజబ్బాకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇస్తున్న పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా
ప్రశంసించింది. మరి వారి కృషికి కారణాలేంటో తెలుసుకుందాం:
 
పద్మ అవార్డు చరిత్ర... 

భారత ప్రభుత్వం 1954లో రెండు పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్‌లను ప్రకటించింది. తర్వాత వాటిని పహేలా వర్గ్, దుస్రా వర్గ్, తిస్రా వర్గ్ అనే మూడు తరగతులుగా విభజించారు. జనవరి 8, 1955న రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల్లో తిరిగి ఈ అవార్డులకు  పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీగా పేరు మార్చారు.
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందిస్తారు. అందులో పద్మ అవార్డులు ఒకటి. ఇవి మూడు రకాలు- పద్మవిభూషణ్(అసాధారణమైన, విశిష్ట సేవలకు), పద్మభూషణ్(అత్యున్నత స్థాయికి చెందిన విశిష్ట సేవ), పద్మశ్రీ(విశిష్ట సేవ). 
ఈ అవార్డులను ప్రధానమంత్రి బహుకరిస్తారు. 
ప్రతి ఏడాది దాదాపు 120 మందికి ఇవ్వడం జరుగుతుంది.

●1954లో పద్మ అవార్డులను స్థాపించారు. ఆ తర్వాత 1978, 1979, 1993 నుంచి1997 సంవత్సరాల్లో తప్ప ప్రతి ఏటా జరుగుతుంది.

●జాతి, వృత్తి, స్థానం, లింగభేదం లేని వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. 
 
ఏఏ విభాగాల్లో ఇస్తారంటే...

●కళలు(సంగీతం, పెయింటింగ్, శిల్పం, ఫొటోగ్రఫీ, సినిమా, థియేటర్ మొదలైనవి)
●సామాజిక సేవ
●ప్రజా వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారు
●సైన్స్ & ఇంజనీరింగ్ ల్లో విశేష కృషి చేసినవారు
●వాణిజ్యం, పరిశ్రమ వ్యాపారాలలో
●మెడిసిన్ కు సంబంధించిన వాటిల్లో
●సాహిత్యం, విద్యను ప్రోత్సహించడం.
●సివిల్ సర్వీస్ 
●క్రీడలు
●భారతీయ సంస్కృతి ప్రచారం, మానవ హక్కుల పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ/ పరిరక్షణ మొదలైనవి.
ఈ అవార్డు సాధారణంగా మరణానంతరం ఇవ్వరు. కానీ అర్హత ఉన్న సందర్భాల్లో, చనిపోయినప్పటికీ,  ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.

●ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో పురస్కారాలను అందిస్తారు. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి సంతకంతో కూడిన సనద్(సర్టిఫికేట్)తో పాటు పతకాన్ని అందజేస్తారు.

● ప్రదానోత్సవం జరిగే రోజున గెజిట్ ఆఫ్ ఇండియాలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రచురిస్తారు.
 
ఎవరు నిర్ణయిస్తారు..?

అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను తదుపరి ఎంపిక కోసం ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి అందజేస్తారు. దానికి కేబినెట్ సెక్రెటరీ నేతృత్వం వహిస్తుంది. హోం కార్యదర్శి, రాష్ట్రపతి కార్యదర్శులు నలుగురు లేదంటే ఆరుగురు సభ్యులతో కలిసి చర్చిస్తారు. ఆపై కమిటీ సిఫార్సుల ఆమోదాన్ని ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు.
 
ఎవరీ హరేకల హజబ్బా, ఏం చేశారు...?!

హరేకల హజబ్బా (65 ఏళ్లు) దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు తాలుకా న్యూపడపు గ్రామంలో నివసిస్తున్నారు. ఈయన హమ్‌పన్‌కట్టా మార్కెట్‌లో 1977 నుంచి బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవించేవారు. ఓసారి ఒక విదేశీ జంట హజబ్బా దగ్గరికి వచ్చి ఇంగ్లీషులో పండ్ల ధర ఎంత? అని అడిగారు. ఈయనకు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. దాంతో కన్నడలో జవాబు చెప్పాడు. ఆ జంటకు హజబ్బా చెప్పిన సమాధానం అర్థం కాక విసుగు పుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అది అవమానంగా భావించి చాలా కుమిలిపోయాడు. తాను చదువుకొని ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని అనుకున్నాడు. దాన్నుంచి వచ్చిన ఆలోచనే అందరూ చదువుకోవాలి. అందుకుగానూ తన వంతు సాయంగా పండ్లు అమ్మగా వచ్చిన దాంట్లో కొంత సొమ్మును దాచి, ఏకంగా ఎంతోమంది పేద విద్యార్థులను చదువుకునేలా చేసింది. 2000 సంవత్సరంలో మదర్సాలో ఒక ప్రాథమిక పాఠశాలను కట్టడానికి ఎకరం స్థలాన్ని కొన్నాడు. మిగతా సొమ్మును దాతలు ఇచ్చిన విరాళాలతో, ప్రభుత్వ అధికారుల సాయంతో న్యూపడపు గ్రామంలో పాఠశాలను నిర్మించారు. అందుకే ఈయన్ని 'సెయింట్ ఆఫ్ లెటర్స్'గా పిలుస్తారు.
 
అవార్డు అంటే నమ్మలేదు..

హజబ్బా సేవలను మెచ్చి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో పురస్కారాలు అందించింది. విద్యా రంగానికి ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో 'పద్మశ్రీ అవార్డు'ను ప్రకటించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ నెల 9న ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని హాజబ్బకు చెప్పగా...‘‘ఎవరో నాకు ఫోన్‌ చేసి హిందీలో మాట్లాడారు. నాకేం అర్థం కాలేదు. తర్వాత రేషన్‌ షాపు ముందు క్యూలో నిల్చున్న సమయంలో నా దగ్గరికి దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది వచ్చారు. నాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇవ్వనున్నట్లుగా తెలిపారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు నమ్మబుద్ధి కాలేదు. పురస్కారాన్ని తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశారు.

●హజబ్బాను దిల్లీకి తీసుకురావడానికి ఆ రాష్ట్ర ఎంపీ దగ్గరుండి మరీ అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు కావాల్సిన ఖర్చులన్ని ప్రభుత్వమే భరించింది. 

●రాష్ట్రపతి చేతుల మీదుగా హజబ్బా పద్మశ్రీ పురస్కారాన్ని మంగళవారం అందుకున్నారు.

●ఢిల్లీలోని కన్నడ విద్యాసంస్థ అధ్యక్షురాలు వసంత శెట్టిబెల్లారే హజబ్బాను శాలువాతో సత్కరించారు. 

●2004లో ఒక కన్నడ పత్రిక ఇతనికి 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని ఇచ్చింది. అది చూశాక ఢిల్లీలోని CNN-IBN 'రియల్ హీరో అవార్డు'ను ప్రదానం చేసింది. వాటితోపాటు వచ్చిన సొమ్మును కూడా పాఠశాల కోసమే ఖర్చు చేశాడు.
 
ఎవరీ తులసి గౌడ...

కర్ణాటకలోని అంకోలాలోని హొన్నాలి గ్రామంలో హలక్కీ అనే గిరిజన కుటుంబంలో తులసీ గౌడ(72 ఏళ్లు) జన్మించారు. ఈమె పుట్టిన రెండేళ్లకు తండ్రి మరణించాడు. దాంతో ఆర్థికంగా వెనుకబడిన తన కుటుంబం కోసం కూలిపనులకు వెళ్ళింది. తనకు 12ఏళ్లు ఉన్నపుడే గోవింద గౌడతో వివాహం జరిగింది. కానీ పెళ్లైన రెండు సంవత్సరాల్లోనే భర్త మరణించాడు. ఆ బాధతో ఆమె కుంగిపోయింది. దాన్నుంచి బయటపడటానికి అడవుల వెంట నడిచింది. అలా చెట్లపైన ప్రేమను పెంచుకుంది. ఎప్పుడు అడవిలోనే ఉండేది. అది చూసిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఆమెకు తాత్కాలికంగా పని కల్పించారు. కొన్నాళ్లకు దానిని పర్మినెంట్  చేశారు. అలా 14 ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. కానీ ఈమె మాత్రం ఇప్పటివరకు దాదాపు 40వేల మొక్కలను నాటి ఒక అడవినే సృష్టించేసింది. 
 
అవార్డుకు కారణం...    
            
తులసి గౌడ పర్యావరణానికి చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఈమె సేవలను గుర్తించి 'పద్మ శ్రీ' అవార్డును ఈ ఏడాది అందజేసింది. అంతేకాదు ప్రతి మొక్కలోని ఔషధ గుణాల గురుంచి చెబుతూ, వాటిని ఎలా నాటాలి, ఎంత మొత్తంలో నీళ్లు పోయాలనే విషయాలను సునాయాసంగా చెప్పేస్తుంది. అందుకే పర్యావరణ శాస్త్రవేత్తలు ఈమెకు 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్' గా పిలుస్తున్నారు.
వీరిని స్ఫూర్తిగా తీసుకుని, మరికొంతమంది పద్మశ్రీ లు అందుకోవాలని ఆశిద్దాం.