BREAKING NEWS

తిరిగి రానిది "కాలం" మార్పు రావాలి

విద్య, వైద్యం... ఈ రెండూ కచ్ఛితంగా అందరికీ అందాల్సిన అవసరాలు... రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది. కానీ ప్రస్తుత సమాజంలో వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ చర్చించాల్సిన విషయం మరొకటి ఉంది. వైద్యం గురించి పక్కన పెడితే ప్రస్తుత మన విద్యా విధానం , విద్యార్థులు, తల్లిదండ్రుల తీరు గురించి కచ్ఛితంగా మాట్లాడుకోవాలి... 

  ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు విద్యార్దుల ఇంట్లో ఒక్కటే మాట వినిపిస్తూ ఉంటుంది... " ఒరేయ్ హెూమ్ వర్క్ చేశావా... ఆ పాఠం వచ్చేసిందా... ఎప్పుడు చూడూ ఆటలే తప్ప చదువు లేదా... మార్కులు రాక పోతే కాళ్లు విరుగుతాయి...” ఇదీ చాలా మంది ఇళ్లల్లో ఎప్పుడూ వినిపించే సుప్రభాతం... మనిషికి చదువు ఉండాలి. నిజమే, కానీ చదువుతో పాటు కాస్త లోక జ్ఞానం కావాలి కదా... ఆటలు, అప్పుడప్పుడు విరామం కూడా అవసరమే కదా. కానీ మారుతున్న ఈ సమాజం ఈ విద్యా విధానంలో కూడా సమూల మార్పులు తీసుకువ చ్చేశాయి.. విరామం అన్న పదమే విద్యార్థులు మరచిపోయేలా చేస్తున్నారు. ఏ పుస్తకం చదవాలి, ఏ పరీక్షకు సిద్దం అవ్వాలి... ఎలా ర్యాంక్ సాధించాలి అనే తపనే తప్ప వేరే ధ్యాసే ఉండడం లేదు ఇప్పటి విద్యార్ధులకు. ఇంకా చెప్పాలంటే ఉండనివ్వడం లేదు. ఊరు మేల్కొక ముందే  స్కూలుకు వెళ్లిపోయే విద్యార్థులు...

ఊరు నిద్రపోయే సమయానికి ఇళ్లు చేరుతున్నారు. ఇన్ని గంటలూ చదువు అనే ఒక్క మాట తప్ప వేరే మాటే తెలియదు ఆ పసి మనసులకు... స్కూల్స్ లో స్పెషల్ క్లాస్ లు, ట్యూషన్లు, అదనపు క్లాస్ లు ... పేరు ఏదైతేనేం విద్యార్థులను చదువు పేరుతో కొండంత భారం వారి మీద మోపడమే కదా... ఆరవ తరగతి చదివే విద్యార్థికి ఐఐటి లతో సంబంధం ఏమిటి??? ఫార్ములా తో లెక్కలు చేయాల్సిన వయస్సులో రీజనింగ్ ,ఆప్టిట్యూడ్ లకు లింక్ ఏమిటో అర్థం కావడం లేదు. కనీసం ఈ వయస్సులో అంత పెద్ద సిలబస్ ఈ చిన్నారుల చిట్టి బుర్రలకు అర్థం అవుతుందో లేదో కూడా తెలియకుండా  మీరు కచ్ఛితంగా చదివి తీరాల్సిందేనని భయపెట్టి , కట్టి, పట్టి చదివిస్తున్నారు. బయట ప్రపంచం తెలియక, చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు పరిచయాలు లేక. సంబంధ బాంధవ్యాలు మరచిపోయి మర మనుషుల్లా తయారవుతున్నారు విద్యార్థులు. పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టేసి పరీక్షల్లో ర్యాంకులు సాధించే యంత్రాలు లాగా మారిపోతున్నారు... 

        ఇంత కష్టపడి చదివి, ఇంజనీరింగ్ లో చేరి నాలుగేళ్లు గడిచిన తర్వాత అసలు వేట ప్రారంభం అవుతుంది. ఏటా లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. కానీ సగం మందికి కూడా సరైన ఉద్యోగాలు ఉండడం లేదు. మరి చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు పడి , బయట ప్రపంచానికి దూరంగా ,  అన్ని సరదాలు సంతోషాలు త్యాగం చేసి చదివిన చదువు ఎందుకు? ఏ విధంగా ఉపయోగపడింది. ఇదే ప్రశ్న ప్రస్తుత తరం తల్లిదండ్రులు ఆలోచిస్తే చిన్నారులను ఈ రేంజ్ లో కష్ట పెట్టకుండా ఉంచుతారేమో... పోని వారు చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారా అంటే అదీ లేదు. మెకానికల్ చదివిన వాడు సాప్ట్ వేర్ ఇంజనీర్ అవుతున్నాడు. సివిల్ చదివిన వాడు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ గా మారుతాడు. తప్పదు మరి. పోటీ ప్రపంచంలో ఎలాగోలా నిలదొక్కుకోవాలి కదా... ఇంట్రస్ట్ లేని ఉద్యోగం చేస్తూ , ఇంట్లో చెప్పలేక, ఉద్యోగం చేయలేక , మనేయలేక ఎంతో మానసిక క్షోభ పడుతున్నారు. ఎవ్వరూ ఇవన్నీ పైకి చెప్పరు, చెప్పుకోలేరు... టెన్త్ అవ్వగానే ఇంటర్ లో MPC జాయిన్ అయిపోవాలి. ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి. ఇంజనీరింగ్ లో చేరిపోవాలి.. ఇది తప్ప వేరే ఆలోచనే రావడం లేదు విద్యార్థులకు, రానివ్వడం లేదు తల్లిదండ్రులు. ఒక్క MPC మాత్రమే  కాకుండా పదుల సంఖ్యలో ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆ ఒక్క కోర్సు మీదే ఎందుకంత మమకారమో అర్థం కాదు ఎవ్వరికీ... 

        చదువుల కోసం తల్లిదండ్రులు పెట్టే ఖర్చుతో ఒక ఇల్లు కొనేసుకోవచ్చు. కార్పొరేట్ స్కూల్స్ లో ఎల్.కే.జి విద్యార్థికి లక్షల్లో ఫీస్ లు వసూలు చేస్తుంటారు. అంత చిన్న పిల్లాడికి ఏం చెప్తారో మరి లక్షలు కుమ్మరించడానికి. కార్పొరేట్ స్కూల్ అయినా ప్రభుత్వ పాఠశాల అయినా ఆ వయస్సు వాళ్ళకి చెప్పేది ఒక్కటే A FOR APPLE, B FOR BALL.....  మా పిల్లాడు ఫలానా కార్పొరేట్ స్కూల్ లో చదువుతున్నాడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వేరే ఉపయోగం లేదు. ప్రతి సంవత్సరం స్కూల్ ఫీస్ లు పెంచుతాం అని ముందే చెప్తారు. అన్ని ఓకే అనుకున్న తరవాతే ఆ స్కూల్ లో జాయిన్ చేస్తారు. కానీ అంతలోనే స్కూల్ ఫీజ్ లు భారీగా పెంచేసారంటు గొడవ చేస్తుంటారు. అన్ని లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్ లో జాయిన్ చేయడం ఎందుకు తర్వాత బాధపడడం ఎందుకు... ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు. విద్యా విధానం , ఉపాధ్యాయులు ఏ కార్పొరేట్ స్కూల్ లో వెతికినా కనిపించవు. పొరుగింటి పుల్ల కూర రుచి సామెత చందంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ గా చెప్పే చదువు కన్నా లక్షలు పోసి కొనుక్కునే కార్పొరేట్ చదువులు ఎక్కువైపోయాయి తల్లిదండ్రులకు. 

            డియర్ పేరంట్స్ ... కాస్త ఆలోచించండి.... ఒక్కసారి పోతే తిరిగి రానిది "కాలం"... అందంగా, ఆనందంగా గడపాల్సిన బాల్యాన్ని చదువుల పేరుతో చిదిమేయద్దు.. ఆడుతూ పాడుతూ చదువు నేర్పించండి. లోక జ్ఞానం ఉంటే బుక్ నాలెడ్జ్ అవలీలగా వచ్చేస్తుంది. అర్థం చేసుకుంటూ ఇష్టపడి చదవాలి తప్ప , మాకెందుకు రా బాబు ఈ చదువులు అనుకుంటూ కష్టపడుతూ చదవకూడదు... కాస్త మారండి. మీ పిల్లలను పిల్లల్లా చూడండి... చదువుకునే రోబో లా కాదు.... 

Photo Gallery