BREAKING NEWS

తెలంగాణా ఎన్నికల ముఖ చిత్రం - నువ్వా - నేనా

తెలంగాణా ఎన్నికల ముఖ చిత్రం మారనుందా... కొత్త ఫ్రంట్ ఎంట్రీతో కారు ఏ రూట్ లో వెళ్తుంది.. సైకిల్ ను పట్టుకున్న హస్తం కి ఒరిగేదేమిటి... హిందూ దేశం అంటూ నినదిస్తున్న కమలం వికసిస్తుందా... తెలంగాణ లో అధికారం ఎవరిది? ప్రతిపక్షం ఎవరిది ??

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ..అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ, ఆలోచన, ఆందోళన... ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. ఈ సారి అధికారంలోకి వచ్చిన వారు అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా?? లేదా ఫాం హౌస్ లకి మాత్రమే పరిమితం అవుతారా... ఇదే టెన్షన్ నెలకొంది అందరిలోనూ. కొత్త రాష్ట్రం వచ్చిందన్న నూతన ఉత్తేజంతో ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధకులైన కేసీఆర్ & పార్టీకి రెండో ఆలోచన లేకుండా అఖండ విజయాన్ని అందించారు. ఎన్నో ఆశలు, మరెన్నో హామీలను ఇచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలి అన్న ఆకాంక్ష తో అయినా ఎన్నో ఏళ్ల నుంచి వెనకబడ్డారు అనుకున్న ప్రజలకు చేయూత ఇవ్వడానికి అయినా , అత్యధిక మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రంగా ప్రస్థానం మొదలు పెట్టిన ప్రయోజనం తో అయినా ఎన్నో పథకాలు ప్రకటించారు, ప్రారంభించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కోటి ఎకరాలకు సాగునీరు, షీ క్యాబ్, కళ్యాణ లక్ష్మీ, హరిత హారం లాంటి ఎన్నో పథకాలు అమలులోకి వచ్చాయి...

వీటన్నింటి అమలు తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా ??? లేదా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, కుటుంబ పాలన లోనూ అంతర్గత విభేదాలు, చిన్నపాటి వర్షానికే రోడ్లు, అపార్ట్మెంట్లు అన్నీ మునిగిపోయే ఉదంతాలు.. గతుకుల రోడ్లు, ప్రారంభించిన పథకాల్లో కూడా *"సగం సగం పనులే అన్నీను"* వంటి విమర్శలను ప్రజలు పట్టించుకుంటున్నారా?? కొన్నాళ్ల ముందు వరకు ఈ విమర్శలు లేకుండా కేసీఆర్ పట్ల కృతజ్ఞతతో, కెటిఆర్ వాక్చాతుర్యం , హుషారైన పరిపాలనకు ప్రజలు ఆకర్షితులు అవ్వడం వలన ఈ సారి కూడా తెరాస విజయం తేలికే అనుకున్నారు...

 కానీ 

తెలంగాణా ను ప్రసాదించిన ప్రయోజనాన్ని ఉపయోగించుకోలేని కాంగ్రెస్, తెలంగాణా ఉద్యమంలో ఉజ్వల పాత్ర  పోషించిన విద్యార్థులను నడిపించిన కోదండరామ్ కొత్త పార్టీ,  హైదరాబాదు ను అఖండంగా అభివృద్థి చేసి, ఆదాయాన్ని, ఎంప్లాయమెంట్ ను పెంచిన పార్టీ గా బలమైన కేడర్ ఉన్నా నాలుగేళ్లుగా నిస్తేజంగా ఉన్న తెలంగాణా తెదేపా , కమ్యూనిస్టులు విడిగా ప్రభావం చూపకపోయినా చంద్ర బాబు చొరవ తో ఆ నాలుగు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రజా ఫ్రంట్ ఒక్కసారిగా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించడంతో ఎన్నికలఅంచనాలన్నీ తల క్రిందులయ్యాయి.

విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఏమిటి అన్న అనుమానాలు ? ... కేవలం ఈ తెలంగాణా ఎన్నికల వరకే ఈ పొత్తు ఉంటుందా.. లేదా ఆంధ్ర ఎన్నికల్లో కూడా ఇదే వరస కొనసాగుతుందా అనే సందేహం?  అసలు ఈ పొత్తు నైతికమా,  అనైతికమా అనే మీమాంస లో ఉన్న ప్రజలకి చంద్ర బాబు చెప్పిన కారణం "దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసమే అనివార్య రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తో కూడిన కూటమి".  

ఎన్నో ఏళ్ల నుంచి బద్ధ శత్రుత్వం గల దేశాలు కూడా కూర్చుని మాట్లాడి సామరస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాయి. దేశాలు మధ్య విబేధాలు ఎన్ని ఉన్నా ద్వైపాక్షిక వాణిజ్య విషయాల్లో మాత్రం అవగాహనతో పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏ ఒక్క దేశం అహం దెబ్బ తిన్నట్టూ కాదు... తరాల శత్రుత్వాన్ని మరచిపోయి కలిసిపోవడం కళంకం కూడా కాదు. కేవలం దేశ ప్రజల శ్రేయస్సు మాత్రమే ప్రధానం... అదే విదేశాంగ విధానం.... సరిగ్గా ఈ విధంగానే ఉంది చంద్రబాబు  సమాధానం.

మరి ఈ లాజిక్ ని జనం ఆమోదిస్తారా??  ఆ నాలుగు పార్టీలకు తెలంగాణలో విడి విడిగా ఉన్న బలాలన్నీ కలిసి ఒక మెగా బలం అయ్యి తెరాస సెంటిమెంటు సూత్రాన్ని బ్రద్దలు కొడుతుందా? ఏమో...... 

రిలీజ్ నాడు ధియేటర్ల ముందు అందరూ 100,200 డేస్ అని చెప్పినట్లు ,అన్ని పార్టీల మీటింగ్ లకి జనం వస్తున్నారు... కానీ ప్రజల ఆంతర్యం ఏమిటో మాత్రం ఎవ్వరికీ తెలియదు.. ఎప్పుడూ అధికార పార్టీని విమర్శించే కమ్యునిస్ట్ పార్టీలకు రాజయోగం పడుతుందా?... తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన కోదండ రామ్ పరిస్థితి ఏమిటి?  గద్దర్ భావుకతను ఏమైనా విలువ ఉంటుందా?... కమలం కనీసం ఒక్క చోటైనా వికసించే అవకాశం ఉందా?? KCR ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలతో ప్రజలు కూడా ఏకీభవిస్తారా !!!లేక ....అసెంబ్లీకి రాకుండానే చక్కటి పాలన అందించాడని భావిస్తారా ?

మహా కూటమి ఐకమత్యాన్ని విశ్వసిస్తారా?? కూటమిలో కుమ్ములాటలుంటాయి... మన కెందుకులే అనుకుంటారా?? 

ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం... ఎన్నికల ఫలితాలకు ఎలక్షన్ కమిషన్ డిసెంబర్ 11 వరకు సమయం ఇచ్చింది . కానీ ప్రజలెప్పుడో నిర్ణయించుకున్నారు ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో.... వారి హృదయాల్లో బలంగా...