విశాఖపట్నం... వైజాగ్... సాగరతీరం... ఇప్పుడు స్మార్ట్ సిటీ... ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా మన సిటీ అందమే వేరు. ఎవ్వరైనా సరే విశాఖలోనే సెటిల్ అయిపోవాలి అని అనుకునే అద్భుతమైన "సిటీ ఆఫ్ డెస్టినీ" మన విశాఖ... అయితే సిటీ అంతా ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది.. కానీ కనీసం టూత్ బ్రష్ కూడా తెలియని, ఇండియన్ ఫుడ్ తినాలి అంటే కష్టపడాల్సి వచ్చేది అని , ఇప్పుడు రిచ్ లోకేషన్స్ గా ఉన్న ప్రాంతాలు అప్పట్లో అడవులు అని ఎంతమందికి తెలుసు... ఎంటి షాక్ అవుతున్నారా... అయితే ఫుల్ మేటర్ లోకి వెళ్లిపోదాం పదండి....
జట్కా ఒక్కటే
ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే బైక్ లేదా కారులో రయ్యిమంటూ దూసుకుపోతాం. లేదా హాపీగా బస్, లేదా ఆటో ఎక్కి వెళ్ళిపోతాం.. కానీ ఇంత రవాణా సౌకర్యం అంతగా లేని ఆ కాలంలో జట్కాలు మాత్రమే ఆధారం.. ఎక్కడికి వెళ్ళాలి అన్నా జట్కాను పిలావాల్సిందే. ఇప్పటి ఆటో వాళ్ళలాగే పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించేసేవాడు... కట్ చేస్తే కాస్త ఎత్తుగా ఉండే దగ్గరకి వచ్చేసరికి ఇప్పటి కుర్రాళ్ళు బైక్ ఫ్రంట్ వీల్ పైకి లేపినట్టు గుర్రం బండి పైకి లేచేది. అప్పట్లో బస్సుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నవే 3 బస్సులు. అది కూడా టైమింగ్ ప్రకారం వచ్చి వెళ్ళిపోయేవే... ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బస్సులు కనిపించేవి...
పెద్ద అడవులు
ఉషోదయ జంక్షన్, జగదాంబ జంక్షన్, ఎమ్.వి.పి కాలని, లాసన్స్ బే కాలనీ...... ఇవన్నీ వైజాగ్ లో పెద్ద పోష్ లొకేషన్ లు... అయితే ఒకప్పుడు అసలు మనుషులు వెళ్లలేని ఒక పెద్ద అడవుల్లా ఉండేవి అని ఇప్పటి జనరేషన్ కి తెలియదు. అసలు అలా ఊహించలేం కూడా... కానీ ఇది నిజమే అంటున్నారు ఆ అడవిని చూసిన ఆ తరం యువత... టూత్ బ్రష్ లు కూడా పెద్దగా తెలియని ఆ కాలంలో పందుం పుల్లలతో నే పళ్లు తోముకునేవారు. ఎక్కడో యూరోపియన్లు మాత్రమే బ్రష్‌లు వాడేవారు. ఆ పుల్లల కోసం ఉషోదయ అడవికి వచ్చేవారంట అప్పట్లో.. అక్కడికి వచ్చి వేప చెట్లు నరికి పుల్లలు కట్టకట్టి తీసు కునేవాళ్లు. రేగు వళ్లు తాటి ముంజులు , సీతాఫలాలు ఇలా చాలా రకాల పళ్లు ఎన్ని కావాలంటే అన్నీ అక్కడే ఉండేవి... ఎంతైనా పెద్ద అడవి కదా....
ఫారిన్ బీచ్ లు...
అప్పట్లో బీచ్ చాలా అందంగా ఉండేది అంటారు ఆ కాలం నాటి వారు... ఇప్పుడు ఉన్న బీచ్ కి అప్పటి బీచ్ కి అసలు సంబంధమే లేదనేది పాత తరం నాటి వారి మాట.... ఇప్పుడు యూనివర్శిటీ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం ఎదురుగా బీచ్ ఉండేది. అక్కడ రెండు ఫుట్ బాల్ ఫీల్డ్స్ పక్క పక్కన పెడితే ఎంత ప్లేస్ ఉంటుందో అంత ఉండేదిట. అక్కడ పొలిటికల్ మీటింగులు జరుగుతూ ఉండేవి.. దాదాపు 80 వేల మంది అక్కడ కూర్చుని వినేవారు. సముద్రానికి దూరంగా కాబట్టి అలల శబ్దం కూడా వినిపించేది కాదుట. ఇప్పుడైతే మనకి ఫారిన్ కల్చర్ ఒక వింతగా అనిపిస్తోంది.. కానీ స్వాతంత్ర్యానికి ముందే విశాఖ ఆర్కే బీచ్ లో మొత్తం ఫారిన్ కల్చర్ ఉండేదని ఆ కాలం నాటి వాళ్ళు చెబుతుంటారు... బీచ్ లోకి వెళ్లి రంగురంగుల గవ్వలు ఏరుకునేవారు అప్పట్లో... కానీ ఇప్పుడు ఆ గవ్వలు లేవు....సముద్రం కూడా చాలా ముందుకు వచ్చేసింది...
ఒకే ఒక్కడు
ఇప్పటి రోజుల్లో ఓ మంత్రి వచ్చారంటే బోలెడంతా సెక్యూరిటీ హడావిడి. కానీ అప్పట్లో దేశ నాయకులు వచ్చినా కానిస్టేబుల్ మాత్రమే సెక్యూరిటీ అంటే నమ్మగలరా.... కానీ ఇది నిజం... మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ప్రధాని లాంటి నాయకులు పాల్గొనే కార్యక్రమాలు చాలా సింపుల్‌గా ఉండేవి. 1948లో విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లో నిర్మించిన తొలి నౌక 'జలఉష' సముద్ర ప్రవేశ ప్రోగ్రామ్‌కు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విశాఖపట్నం వచ్చారు. అప్పటి ఏయూ వీసీ సీఆర్ రెడ్డి ఏయూకు రమ్మని ఆహ్వానించారు. అక్కడ ఒక మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి పాల్గొన్నారు. ఇంత పెద్ద ప్రాగ్రామ్‌కు కూడా కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ లాఠీ పట్టుకుని డ్యూటీ చేశాడు.
1947కు ముందు అంటే మనకు స్వాతంత్య్రం రావడానికి ముందు బీచ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వారిని అడగండి... అప్పటి మన ఆర్కే బీచ్ ఎలా ఉండేదో తెలుసుకుంటే కాస్త షాక్ అవ్వాల్సిందే... బీచ్‌కు వెళ్తే బ్రిటీష్ ఆర్మీ వాళ్లు చేసే మార్చ్ ఫాస్ట్లతో బీచ్ అంతా కిటకిటలాడిపోయేది. వాళ్లను చూస్తేనే అందరికీ భయం వేసేది. బహుశా ఆ భయం కోసమే బ్రిటిష్ వాళ్ళు అలా చేసేవారేమో... ఇక ఆహారం విషయంలో కూడా చాలా ఇబ్బందులే పడ్డారు మనవాళ్ళు అప్పట్లో... బీచ్ రోడ్లో అంతా యూరోపియన్ భోజనం మాత్రమే దొరికేది. ఇండియన్ భోజనం కావాలి అంటే ఇంట్లో వండుకుని తినాల్సిందే. కూరలు కూడా ఎక్కువగా దొరికేవి కాదు. బియ్యం మాత్రమే ఇచ్చేవారు. ఒకవారం అయితే అస్సలు బియ్యం కూడా లేవు. బంగాళదుంపలను పాడుగ్గా కట్ చేసి ఇచ్చేవారు. అవి ఎంత వండినా కూడా గుజ్జులా వచ్చేది తప్ప తినడానికి వీలుగా ఉండేవి కాదు. పాలు కూడా ఇంటికి వచ్చి పితికి ఇచ్చేవారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ల ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ అయినా, చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినా మిగిలిన వారికి పాలు ఉండేవి కాడు. మొత్తం వాళ్లే కొనుక్కునేవారు...
నోట్ : ఇదంతా దాదాపు 72 సంవత్సరాలు అంటే స్వాతంత్ర్యానికి ముందు సంగతులు... నాకు తెలిసిన ఆ కాలం నాటి వ్యక్తులు చెప్పిన దాని ప్రకారం రాశాను... ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి.. అవన్నీ మళ్లీ పార్ట్ 2 లో మాట్లాడుకుందాం... మీకు తెలిసిన ఆనాటి మన వైజాగ్ విషయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ సెక్షన్ లో షేర్ చేసుకోండి...
"సిటీ ఆఫ్ డెస్టినీ" మన విశాఖ - ఫ్లాష్ బ్యాక్
- By Chief Editor