BREAKING NEWS

మాటే మంత్రము....

ప్రతినిత్యం మనం ఎన్నో సభలకు వెళ్తూ ఉంటాం.... అనేక మంది వక్తల ప్రసంగాలు వింటూ ఉంటాం... సాధారణంగా మనం ఏదైనా కార్యక్రమంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముందు ఆ కార్యక్రమం ఉద్దేశం, సందర్భం, ఎవరి గురించి మాట్లాడాలి లాంటి బేసిక్ విషయాలు తెలుసుకుని మాట్లాడడం ఔచిత్యం... ఒకరిని పొగిడే క్రమంలో మరొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం మనం చాలా సార్లు గమనిస్తూ ఉంటాం.. కానీ ఇది ఎంత వరకు సమంజసం??

ఒక్కోసారి అవతల వారిని పోగడబోయి తెలియకుండానే సొంత డబ్బా కి దిగుతూ ఉంటారు కొంతమంది. ఇంకొంత మంది సరిగ్గా మాట్లాడడం రాక, ఆ విషయ పరిజ్ఞానం లేక పైగా తనకు తెలియదు అనే విషయం కూడా తెలుసుకోలేక తడబడుతూ మాట్లాడుతూ అపహాస్యం పాలు అవుతుంటారు. కొంత మంది మేధావులు, గొప్పవారు కూడా ప్రసంగం చేయాల్సి వచ్చేసరికి ఆ సందర్భానికి ఎంత వరకు అవసరం అనేది తెలుసుకోలేక తమ విషయ పరిజ్ఞానం అంతా ఒకేసారి చెప్పేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు.  ఇంకొంత మంది వేదికెక్కి తమ సొంత ప్రతిభను నిరూపించుకోవడానికి చూస్తూ ఉంటారు. అప్ కమింగ్ వాళ్ళు అయితే పర్వాలేదు గానీ అప్పటికే ఒక రేంజ్ లో ఉన్నవాళ్ళకి కూడా అదే విధమైన ఆరాటం ఎందుకో మరి... 

                  చాలా మంది వక్తలు ఓ రాజకీయ నాయకుడిని, సినిమా యాక్టర్ నో పొగిడినప్పుడు "నిజాయితీపరుడు అయిన ఒకే ఒక్క నాయకుడు" అంటూ ఉంటారు. అంటే మిగిలిన వారు అందరూ అవినీతిపరులు అనే భావన వచ్చినట్లే కదా.... "రాజుగారి మొదటి భార్య చాలా మంచిది" అన్న చందంగా సాగుతోంది వీరి ప్రసంగం... ఇప్పుడు ఫలానా వ్యక్తి గురించి గొప్పగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మనకు ఉన్న అనుబంధాన్ని చెప్పే క్రమంలో చెప్పదగిన రెండు మూడు సందర్భాలు ప్రస్తావించడం ఔన్నత్యం తప్ప ఆ వ్యక్తికి ఫలానా సందర్భంలో వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చి ఆదుకున్నది నేనే అని చెప్పుకోవడం పరమ అసంబద్ధం...  

             వారు వాళ్ళ వాళ్ళ విధుల్లో ఎంతో గొప్పగా పనిచేస్తున్నా సరే కేవలం మాట్లాడడం సరిగ్గా రాని కారణంగా సోషల్ మీడియా సాక్షిగా అపహాస్యం పాలవ్వడం చూస్తూనే ఉన్నాం... జలీల్ ఖాన్ బీకాం ఫిజిక్స్ అయినా , లోకేష్ బాబు తెలుగు తప్పుడు తడకలైనా , బాలయ్యబాబు బుల్ బుల్ అయినా, మంచు లక్ష్మి నిలదీసిఫై అయినా.. ఈ మాటల వలన మాత్రమే... జోక్ ఎంటి అంటే అప్పుడప్పుడు జారిన మాటలు కూడా అనుకోకుండా మనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చి పెడుతూ ఉంటాయి.  
         
              చాలా సందర్భాలలో పండితులైన వారి ప్రసంగాల్లో కూడా ఉదాహరణకు వినేవాళ్ళు స్థాయిని గుర్తించకుండా వారి వారి మేధస్సును బట్టి పరమాణు నుంచి బ్రహ్మాండం వరకు అన్నీ చెప్పుకుంటూ పోయే వాళ్ళను మనం చాలా మందిని చూసాం...

          చాలామంది ఆర్టిస్ట్ లు ఒక సభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్రసంగాలు భాగంగా ఒక మిమిక్రీ చేయడం ఓ పాట పాడడం, ఒక డైలాగ్ చెప్పడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ప్రతిభ నిరూపించుకోవడానికి అది ఓ సువర్ణ అవకాశం.. కానీ అదే సమయంలో అవే పనులు అవసరం లేకపోయినా ఒక పెద్ద స్థాయి వ్యక్తులు చేయడం లేకితనం అనిపించుకుంటుంది. 

                  పై రకాలన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే ప్రసంగం మరో ప్రమాదకరమైన ఎత్తు. వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని, తమ సొంత ఎజెండాను ప్రచారం చేసుకోవడం కోసం తనకు సంబంధం లేని పక్కవాళ్ళ స్టేజ్ ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వీళ్ళు అవతల వారి మీద ద్వేషాన్ని, అసూయను ఆ విధంగా ప్రకటించుకుంటూ  ఉంటారు. కానీ అది ఎంతమాత్రం సంస్కార వంతం కాదు.

ఉదాహరణకు నిన్న జరిగిన ఎన్.టీ.ఆర్ కథానాయకుడు , మహానాయకుడు ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు గారి ప్రసంగం పరిశీలిస్తే మనం చెప్పుకున్న అన్ని రకాల ప్రసంగాలు కనిపిస్తాయి. అన్ని నిజాలు కాకుండా  కొన్ని నిజాలు మాత్రమే చెప్పాలి అని మొదలుపెట్టినప్పుడే  ఆయన ఉద్దేశం స్పష్టం అయ్యింది. ఏ వ్యక్తి గురించి చెప్పాలి వచ్చినప్పుడు అయినా అన్నీ నిజాలే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏ వ్యక్తీ 100 శాతం పర్ఫెక్ట్ కాదుగా. ఇకపోతే అన్నగారి గురించి మా 90 వ దశకం జనరేషన్ కు సరిగ్గా తెలుసుకోవాలి అని మోహన్ బాబు గారు అనేసరికి అన్నగారి గురించి ఏం చెప్తారా అని అందరం ఎంతో ఆసక్తిగా చూసాం. తీరా మొత్తం విన్నాక మాకు అర్థమయ్యింది ఎంటి అంటే అందరూ డౌన్ డౌన్ అంటూ ఉంటే వెనుకుండి జై కొట్టి పార్టీ పెట్టించింది , అన్నగారి చేత తరతరాలు గుర్తుండిపోయేలా మేజర్ చంద్రకాంత్ సినిమాలో  పెర్ఫార్మెన్స్ చేయించింది, అన్నగారి పదవి పోయాక షిర్డీలో  సాయి గుడికి తీసుకెళ్లి సాంత్వన చేకూర్చింది, తిరిగి అన్నగారి 1995 లో సీఎం అవ్వడానికి మొక్కు ద్వారా కృషి చేసినది... వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక్క మహా వ్యక్తి మోహన్ బాబు గారు అని అపార్థం అయ్యేలా సాగింది ఆయన ప్రసంగం.. చూసారా.. ఎంత భయంకరమైన అర్థం వచ్చిందో,!!! నిజంగా తన అభిమాన నటుడి బయోపిక్ ఆడియో రిలీజ్ కి వచ్చి రాజకీయ విభేదాలు దృష్టిలో ఉంచుకుని తన సొంత ఉద్దేసాలతో ఈ విధంగా ప్రసంగించడం చాలా పొరపాటు అవునా కాదా?? అయితే తను ఎంత వరకు చెప్పాలి అనుకున్నారో అంత వరకు మాత్రమే చెప్పి వడిలేయచ్చు. అసలే నచ్చకుంటే కార్యక్రమానికి గైర్హాజరు కూడా అవ్వచ్చు. కానీ ఇటువంటి ప్రసంగము చేయడం ఆ మహా నటుడుని అవమానించినట్లే కదా... ఇలాంటి దురుద్దేశ స్పీచ్ లు ఇవ్వటం వలన సదరు స్పీచ్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళని వాళ్ళే తగ్గించుకోవడం తప్ప మరొకటి కాదు..  

          ఇన్ని రకాల అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టే మాట్లాడడం ఒక కళ అన్నారు. ఇన్ని కోచింగ్ సెంటర్లు, సాఫ్టు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లు , స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు లాంటి రకరకాల శిక్షణలు అవసరం ఏర్పడింది. మాటే మంత్రం అన్నారు...   మనం ఒక అంశం గురించి మాట్లాడితే అవతలి వాళ్ళు ఆసక్తిగా వాళ్ళంతట వాళ్ళే వినగలిగే నైపుణ్యం అలవరచుకోవాలి. స్వామి వివేకానంద ప్రఖ్యాత చికాగో స్పీచ్ కొన్ని గంటల పాటు సాగినా ఒక్కరు కూడా కదలకుండా విని స్పీచ్ అయిన తర్వాత రెండు నిమిషాలు పాటు స్టాండింగ్ ఓవేశన్ ఇచ్చారట. ఆ స్థాయిని అందుకోవడానికి మన అందరం ప్రయత్నించాలి.  అంతే తప్ప మనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షణాల్లో వైరల్ చేసేందుకు సోషల్ మీడియా ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటుంది. బీ కేర్ ఫుల్... 
 
కొస మెరుపు : వక్తల గురించి చెప్పుకున్నాం బాగానే ఉంది . కానీ కార్యక్రమానికి హాజరైన వాళ్ళు కూడా దాని యొక్క ఉద్దేశం , సందర్భం గురించి తెలుసుకుని వాటిని వినడానికి సిద్ధపడి వెళ్ళాలి.. అంతే తప్ప మనకు పనిలేదు కదా అని ప్రతి కార్యక్రమానికి వెళ్లిపోయి మనకు కావాల్సిన దాని కోసం అరచి సభను డిస్టర్బ్ చేయడం, వక్తల ను ఇబ్బందులు పెట్టడం సభ్యత అనిపించుకోదు అని గ్రహించాలి. విన్నవాడు ఎప్పుడూ చిన్నవాడు కాదు... 

Photo Gallery