BREAKING NEWS

సూపర్ - డేంజర్

రయ్యిమంటూ మెరుపు వేగంతో దూసుకుపోయే బైక్ లు... ఫ్రెండ్స్ ముందో, గర్ల్ ఫ్రెండ్స్ ముందో గొప్పలు చూపించడానికి వాయు వేగంతో బైక్ లపై రివ్వుమంటూ స్పీడ్ గా చక్కర్లు కొడుతున్నారు నేటి యువత... పిల్లలు అడిగిందే ఆలస్యం...  లక్షల రూపాయలు పోసి స్పోర్ట్స్ బైక్ లు కొనిచ్చేస్తున్నారు తల్లిదండ్రులు... ఇక వారి గురించి పట్టించుకోవడమే మానేస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సు... చేతిలో బైక్ ఉంది అన్న ఉత్సాహమే తప్ప ఎలా నడపాలి అనే ఆలోచన, విచక్షణ కూడా లేకుండా రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఏ మాత్రం పాటించరు. రోడ్డు మొత్తం తమదే అన్నట్టుగా ఇష్టానుసారంగా నడుపుతూ ఉంటారు. కట్ చేస్తే ఎన్నో ప్రమాదాలు... మరెన్నో అంతులేని విషాదాలు .. తప్పు ఎవరిది.. అడగ్గానే ముందు వెనకా ఆలోచన లేకుండా బైక్ లు కొని ఇస్తున్న తల్లిదండ్రులదా.... బైక్ అవసరం లేకుండానే కొనిపించుకున్న పిల్లలదా... చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానిదా...

                     ఇంటర్ పూర్తయ్యి ఇంజనీరింగ్ లో అడుగుపెడుతున్న యువత అందరిదీ ఒకటే ఆశ... మాంచి బైక్ మీద కాలేజీకి వెళ్లి ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇవ్వాలని... వయస్సు అలాంటిది మరి. చూసిన ప్రతి దానికీ ఇట్టే అట్రాక్ట్ అవుతారు. సినిమాల ప్రభావమో, టివిల్లో బైక్ ల ప్రకటనల ప్రభావమో తెలియదు గానీ కాలేజీకి బైక్ మీదే వెళ్ళాలి అని యువత మనసుల్లో బలంగా ముద్ర పడిపోయింది.... ఆలోచన వచ్చీ రాగానే తల్లిదండ్రుల ముందు తమ మనసులో మాట ఉంచుతున్నారు. ఆ ముద్రను చెరపాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంది. కానీ కొడుకు అడిగాడు కదా అని స్థోమత ఉన్నా లేకపోయినా నిమిషాల్లో వారి కోరిక తీరుస్తున్నారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలను వారికి కనిపించడం లేదు. అదే వయస్సు దాటుకుని వచ్చిన తల్లిదండ్రులకి ఆ వయస్సు పిల్లలు మనస్తత్వాలు ఎందుకు అర్థం కావు... ఏదో బాధ పడి బైక్ కొందామనుకున్నా తక్కువ సామర్ధ్యం ఉన్న బైక్ లు విద్యార్థులకు అసలు బైక్ లే కాదు... కనీసం 250 సీసి సామర్ధ్యం అయినా ఉంది తీరాల్సిందే... కనీసం  100 సిసీ బైక్ పై నాలుగో గేరు కూడా సరిగ్గా పడని మన రద్దీ రోడ్స్ లో 6 గేర్లు ఉండే 250 సీసీ బైక్ ఎంత వరకు కరెక్ట్??? 150 సీసీ బైక్ లే మినిమం 40 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తేనే మెయింటేన్ చేయగలం . 

                  అలాంటిది 250, 500, 600 , 1000 ఇలా సీసీ లు పెంచుకుంటూ పోతే ఆ స్పీడ్ ను ఎలా రీచ్ అవ్వగలరు. మన రోడ్లు అంత స్పీడ్ కు ఏ మాత్రము సరి కాదు.. ఆ విషయం బండి నడుపుతున్న వాడికి, అది కొనిచ్చిన తల్లిదండ్రులకి, వాటిని మన రోడ్లపై అనుమతిస్తున్న అధికారులకు అందరికీ తెలుసు. అయినా సరే ఏ ఒక్కరూ కూడా దీనిపై దృష్టి సారించడం లేదు. ఉదయం లేచిన వెంటనే టివిలో, పేపర్స్ లో రోడ్డు యాక్సిడెంట్స్ అని చూస్తూనే ఉన్నాం... ఎక్కువగా ప్రమాదాల్లో బలి అవుతున్నది ఇలాంటి బైక్ లు వాడుతున్న యువతే... తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ యాక్సిడెంట్ దీనికి ఉదాహరణ.. స్పీడ్ గా వస్తున్న బైక్ ను బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మరణించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.. ఒక్కసారి యూ ట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి... పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీకే అర్థం అవుతుంది. రోడ్డు సేఫ్టీ కోసం, ప్రమాదాల నివారణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్న ప్రభుత్వం , అధికారులు ఇలాంటి హై ఎండ్ స్పోర్ట్స్ బైక్ ల విషయంలో మాత్రం ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదు??? 

                  ఈ స్పీడ్ యుగంలో బైక్ కచ్ఛితంగా వాడాలి... అదేమీ తప్పు కాదు... కానీ ఏ బైక్ వాడుతున్నాం అనేది ఇక్కడ ముఖ్యం... మా అబ్బాయి ఫలానా "సూపర్ బైక్ వాడుతున్నాడు... అది తప్ప వేరేది కన్నెత్తి కూడా చూడదు" అంటూ తెగ మురిసిపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు... ఒక్క సారి విచక్షణతో ఆలోచించండి. లక్షలు పోసి ప్రాణాలు మీదకు తెచ్చుకోవడం ఎంత వరకు కరెక్ట్... జీవితం చాలా విలువైనది.. అనుక్షణం ఎంజాయ్ చేయండి... ప్రమాదాలతో కాదు... ఆనందంతో... గొప్పలకు పోయి ఏరీ కోరి ప్రమాదాన్ని కొని ఇవ్వకండి... సో .... 

మై డియర్ పేరెంట్స్..... తస్మాత్ జాగ్రత్త.....