BREAKING NEWS

మీడియా - ఎందుకిలా ???

మీడియా.... ఎక్కడో జరిగిన విషయాన్ని అంతా సమగ్రంగా మన ముందు ఉంచగలిగే ఓ అద్భుత సాధనం. రాజకీయ నాయకులు అయినా, సినిమా సెలబ్రిటీలు అయినా, వస్తువుల కంపెనీలు అయినా మీడియా ఉంటేనే వాటికీ ప్రాధాన్యత. అవి మనం గుర్తిస్తున్నాం అంటే కేవలం మీడియా వలనే. ఒకప్పుడు మీడియా మనకు తెలియని, మనకు ఉపయోగపడే విషయాలు మాత్రమే మన ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ప్రస్తుత మీడియా చూపిస్తున్న వార్తలు మనకు నిజంగా ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి. ఎలాంటి వార్తలను ప్రసారం చేస్తున్నారు. వాటి వలన జరిగే లాభ నష్టాల మాటేమిటి??

                 బెంగాల్ గెజిట్... స్వాతంత్ర్యానికి ముందు అంటే 1780 సంవత్సరంలో కలకత్తా నుంచి ప్రారంభం అయిన మొట్ట మొదటి వార పత్రిక... 1908లో మొట్టమొదటి తెలుగు వార పత్రిక ఆంధ్ర పత్రిక ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత కాల క్రమంలో ఎన్నో పేపర్ లు పుట్టుకొచ్చాయి. టివిలు వచ్చిన తర్వాత డిడి ఛానెల్ మాత్రమే ఉండేది. తర్వాత్తర్వాత ఒక్కో ఛానెల్ ప్రారంభం అవుతూ వచ్చాయి. ఇప్పుడు పదుల  సంఖ్యలో పత్రికలు, ఛానెల్స్ ఉన్నాయి. అయితే వీరందరూ మీడియా విలువలు పాటిస్తున్నారా... ప్రజలకు ఉపయోగపడే విషయాలు చూపించడంలో ఎంతవరకు కృషి చేస్తున్నాయి... కొన్ని విషయాలు మంచివే చూపిస్తున్నా అవసరం లేని ఎన్నో విషయాలు కోట్లాది మంది చూసే టివి ఛానల్ లో ప్రసారం చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్న మాధ్యమం టివి, న్యూస్ పేపర్స్. ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిపై శ్రద్ధ చూపించడం కన్నా అనవసర విషయాలు మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు నేటి మీడియా. ఒకప్పుడు వార్తను వార్తగా మాత్రమే చూపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త మసాలా జోడించి క్రైమ్ కథా చిత్రాలు చూపిస్తున్నారు. చీమంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తుంటారు.

                     సెలబ్రిటీలు, ప్రముఖలు పొరపాటున మాట్లాడిన మాటలను పట్టుకుని వాటినే రచ్చ చేస్తూ , వారం రోజులూ అదే పనిగా ఆ టాపిక్ నే చూపిస్తూ ఉంటారు. గతంలో జలీల్ ఖాన్ , ఇప్పుడు బండ్ల గణేష్... వాళ్ళు అన్న మాటలను జనాలు ఎప్పుడో మరచిపోయి ఉంటారు కానీ మీడియా మాత్రం మరచిపోనివ్వరు. ఉదాహరణకు బండ్ల గణేష్ మొన్న మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో "కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటా" అని కామెంట్ చేశారు. ఇక అంతే... ఆ ఒక్క ముక్క పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మీడియాలో కథనాలు ప్రసారం చేసేశారు. అతిశయోక్తి అలంకారం అని ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని కాన్ఫిడెంట్ గా చెప్పాలి అనుకున్న సమయంలో ఈ అలంకారం ఉపయోగిస్తాం... అప్పుడు ఎన్నో మాటలు చెప్తాం.అవన్నీ నిజం అనుకోవడానికి లేదు. "సంగీతం అంటే చెవి కోసుకొంటారు" అని అంటూ ఉంటారు. అంటే సంగీతం ఆ వ్యక్తికి ఎంత ఇష్టమో చెప్పడానికి తప్ప నిజంగా చెవి కట్ చేసుకుంటాడు అని కాదు కదా... బండ్ల గణేష్ కూడా అదే విధంగా ఆ మాట అన్నారు తప్ప నిజంగా గొంతు కోసుకొంటారు అని కాదు కదా... ఆ మాత్రం దానికే ప్రత్యేక కార్యక్రమాలు, స్పెషల్ బులిటెన్ లు ఎందుకో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.

        కేవలం టివి ఛానెల్స్ , పత్రికల్లో కాదు... మనలో కూడా మార్పు రావాలి. నెగిటివ్ న్యూస్ కు అట్రాక్ట్ అవుతున్నాం కాబట్టి మనకు కావాల్సిన వాటిని అందిస్తున్నారు. కాబట్టి ఇకపై మంచిని పెంచే కార్యక్రమాలు మాత్రమే చూస్తూ వాటినే ప్రోత్సహిద్దాం... అప్పుడు ఆటోమేటిక్ గా మనకు పనికొచ్చే వార్తలు మాత్రమే వస్తాయి...

TAGS:

Photo Gallery