BREAKING NEWS

ఓటు - భావి తరాల భవిష్యత్తు నిర్ణయించే ఒక అద్భుత టైమ్ మెషిన్

ఓటు... భావి తరాల భవిష్యత్తు నిర్ణయించే ఒక అద్భుత టైమ్ మెషిన్...

ఓటు.... మనకు నచ్చిన , మనం మెచ్చిన వారిని అందలం ఎక్కించే ఒక మంత్ర దండం....

ఓటు.... మన తల రాతను మార్చగలిగే బ్రహ్మాస్త్రం...

                 ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా అందరిలోనూ ఒక్కటే హడావుడి.. ఎవరికి ఓటు వేద్దామా?? ఎవరికి పట్టం కడదామా??? అని ఆలోచిస్తారు. ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ లేనంత మంది యువత ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నారు. లక్షల మంది విద్యార్థులు దేశంలో చదువుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి సంఖ్య తక్కువేమీ కాదు. వేలాది ఇంజనీరింగ్ కాలేజీల్లో లక్షలాది మంది ఉన్నారు.  అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ... అక్కడికి వస్తున్నా... దేశ రాజకీయ పరిస్థితులను మార్చాలి అన్నా... విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అన్నా యువతతో మాత్రమే సాధ్యం... దానికి యూత్ చేయాల్సిందల్లా ఒక్కటే... ఓటు హక్కును సక్రమంగా , సమయానికి వినియోగించుకోవడం... కానీ నిజానికి యువత ఇప్పుడు తమ హక్కును వినియోగించుకుంటున్నారా?? అసలు రాజకీయ పరిస్థితుల గురించి ఎంత వరకు ఆలోచిస్తున్నారు....

                 ఉదయం కాలేజీకి వెళ్ళమా? క్లాస్ లు విన్నామా.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశామా.... ఇదే ప్రస్తుతం యువత అందరూ అనుసరిస్తున్న తారక మంత్రం. అధికారంలోకి ఎవరు వస్తే మాకేంటి, మాకు ఎంజాయ్మెంట్ మాత్రమే ముఖ్యం అనుకుంటున్నారు... దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ ప్రభావం చూపించగల యువత ఓటు విషయంలో మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్థం కాదు. జనసెన అధినేత పవన్ కళ్యాణ్ కూడా  యువత ఓటు నమోదు విషయంలో శ్రద్ధ తీసుకోవాలి అంటూ ప్రతీ సభలోనూ చెప్తూనే ఉన్నారు.. అభిమానాన్ని ఎన్నికల్లో చూపించాలి అంటే ఓటరు గా నమోదు కావాల్సిందే.. "నా ఒక్క ఓటుతో రాజకీయాలు ఏమీ మారిపోవు కదా?" అనుకుంటున్నారు యూత్ అందరూ.. కానీ ఆ ఒక్క ఓటు కూడా ఎంతో కీలకంగా మారే సందర్భాలు  ఎన్నో ఉన్నాయి..

గెలుపోటములు నిర్ణయించగలిగేది ఆ ఒక్క ఓటే... ప్రభుత్వం, అధికారాలు, మీడియా ఇలా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు కోసం ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఎలా నమోదు చేసుకోవాలో కూడా పిన్ టూ పిన్ అర్థం అయ్యేలా చెప్తున్నారు. అయినా చాలా మంది మనకెందుకులే అనుకుంటున్నారు తప్ప, మన బాధ్యత అని మాత్రం అనుకోవడం లేదు. 

                     తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. దీనిలో కూడా ఓటు వేసిన యువత చాలా తక్కువ మందే ఉన్నారు. మిగిలిన ఆ 33 శాతంలో ఎంతో మంది యువత ఉన్నారు. వాళ్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఉంటే అక్కడి రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చేదేమో...  అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి... ఏ విధంగా యువత చేత ఓటు వేయించాలి... 

                      ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీలో , ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి ప్రతి విద్యార్థికి ఓటరు కార్డు కచ్చితం చేయాలి... అప్పుడే కాలేజ్ లో అడ్మిషన్ ఇవ్వాలి.. ఒకవేళ అప్పటికి అర్హుడు కాకపోతే 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేయించుకోవాలి అనే కండిషన్ పెట్టి అడ్మిషన్ ఇవ్వాలి... అయినా సరే అమలు పరచకపోతే విద్యార్థి హాల్ టికెట్ లు బ్లాక్ లో పెట్టాలి, లేదా స్కాలర్ షిప్ లు ఆపాలి... ఇక ఎలక్షన్ రోజు అన్ని కాలేజీలు , ఆఫీస్ లు కూడా ఓటు వేసేందుకు సెలవులు ఇస్తారు. కానీ ఓటు వేశారో లేదో కూడా ఆయా యాజమాన్యాలు పట్టించుకోరు. ఇకపై ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగిపై కూడా దృష్టి సారించాలి.. ఓటు వేసిన తర్వాత వేలుకి పెట్టే ఇంక్ మార్క్ తో ఒక సెల్ఫీ తీసుకుని ఆయా యాజమాన్యాలకు పంపించాలి... లేదంటే విద్యార్థులకు  అటెండెన్స్, స్కాలర్ షిప్, ఇంటర్నల్ మార్క్స్ ఇలా ఎన్నో రకాలుగా పనిష్మెంట్ ఇవ్వచ్చు... ఇక ఉద్యోగులు అయితే ఇంక్రిమెంట్, బోనస్, ప్రమోషన్ ఇలా ఎన్నో అస్త్రాలు సంధించవచ్చు... ఈ విధంగా కనీసం ఒక్కరైనా అమలు చేస్తే చాలు... అందరిలోనూ కచ్ఛితంగా మార్పు వస్తుంది. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుంది. 

                   ఓటు... మన బాధ్యత మాత్రమే కాదు. మన భవిష్యత్తు కూడా... నాకెందుకులే అనుకుని ఇంట్లో కూర్చుంటే నీకు నచ్చని వాళ్ళు అధికారంలోకి రావచ్చు... ఓ యువతా గుర్తుంచుకో.... ఓటు హక్కు వినియోగించుకో... నాకూ బాధ్యత ఉందని నిరూపించుకో... 


నోట్: ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే.... అనవసరం అయిన వాటికి ఎన్నింటికో పనిష్మెంట్ లు ఇస్తున్నారు. భవిష్యత్తు గురించి ఈ మాత్రం చేయలేమా.... ఒక్కసారి ఆలోచించండి...