BREAKING NEWS

ఆంధ్ర ఊటీగా పేరు గాంచిన హార్సిలీ హిల్స్ గురించి అనేక విషయాలు మీకోసం...!

అందమైన ప్రకృతి.. ఆకాశాన్ని తాకే కొండలు.. నీలి మేఘాల మధ్య పచ్చని ప్రకృతి తో అబ్బా ఒక రోజు గడిపితే చాలు. ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం... ఏంటి ఇంత అందమైన ప్రకృతి, ప్రదేశం ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా..?  మనం ఏమీ ఈ ప్రదేశాన్ని చూడడానికి ఏడు సముద్రాలు దాటి వెళ్ళక్కర్లేదు. ఇది మన ఆంధ్ర రాష్ట్రం లోనే ఉంది. సముద్ర మట్టానికి 1314 మీటర్ల ఎత్తు లో ఈ ప్రదేశం ఉంది. దీనినే మనం ఆంధ్ర ఊటీగా పిలుస్తాము. అదేనండి మన హార్సిలీ హిల్స్. మరి ఆంధ్రా ఊటీగా పిలువబడ్డ హార్సిలీ హిల్స్ కోసం పూర్తిగా ఇప్పుడే చూసేయండి.  ఎందుకు ఈ ప్రదేశానికి వెళ్లాలి..? ఎప్పుడు వెళ్ళాలి  అనే విషయం మీకు తెలుస్తుంది.
 
ప్రకృతి ప్రేమికులను ఈ ప్రదేశం కనువిందు చేస్తుంది. అలానే ఫోటోగ్రాఫర్లు కూడా ఈ ప్రదేశం బాగా నచ్చుతుంది. ప్రకృతి సౌందర్యం అంటే దాని ప్రత్యేకత వేరు కదా..!  హార్సిలీ హిల్స్ ఎక్కడ ఉన్నాయి...?  ఈ హార్సిలీ హిల్స్ చిత్తూరు జిల్లా లోని మదనపల్లి పట్టణానికి 29 కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే ఎత్తు లో ఉండడం వల్ల వేసవి లో సైతం ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. అందమైన వాతావరణం, ప్రకృతి నిజంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ఇంతకీ ఆహ్లాదకరమైన ఈ హార్సిలీ హిల్స్ ప్రత్యేకతలు, వివరాలు ఇవే...
 
హార్సిలీ హిల్స్ ఆంధ్ర ప్రదేశ్ లో మదనపల్లి పట్టణ సమీపం లో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన ఈ రిసార్ట్ కు బెంగళూరు, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుంచి కూడా సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రదేశాన్ని చూడడానికి ఏప్రిల్ మరియు మే నెల లోనే పర్ఫెక్ట్. ఎందుకంటే వేడి అధికంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రదేశాలకు వెళ్లడం చాలా బాగుంటుంది. అలానే పర్యాటకుల సందడి తో ఈ ప్రదేశమంతా కళకళ్ళాడిపొతుంది. వేడి వాతావరణం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
ఈ హార్సిలీ హిల్స్ ని  గతంలో ఏమనేవారు అంటే..?
 
ఈ కొండలను ఇంతకు ముందు ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచే వారు. అయితే ఈ ప్రదేశం లో మల్లమ్మ అనే ఒక ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఏనుగులని సంరక్షించేదట. అందుకే ఈ కొండకి ఏనుగు మల్లమ్మ అని పేరు వచ్చింది. అయితే మల్లమ్మ సమీపం లోని గిరిజన జాతులు మరియు రోగాల బారిన పడిన వ్యక్తుల కోసం చాల శ్రద్ధ తీసుకునేది. అయితే ఆమె ఒకరోజు ఆకస్మాత్తుగా అదృశ్యమవడం తో తన ప్రజలు తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత వాళ్లు ఆలయం నిర్మించారు.
 
తర్వాత వేసవి విడిది కోసం వచ్చిన ఒక బ్రిటీష్ అధికారి డబ్ల్యు డి హార్స్లి ఈ హిల్ స్టేషన్ లో రెండు ఇళ్లు, కరాచీ రూమ్ మరియు పాల బంగ్లా నిర్మాణం చేశారు. తద్వారా దీనికి హార్స్లీ హిల్స్ అనే పేరు వచ్చింది,
 
 హార్స్లీ హిల్స్ ఎలా చేరుకోవాలి..?
 
మదనపల్లి నుంచి 29 కిలో మీటర్లు మాత్రమే కాబట్టి ఈ ప్రదేశానికి సులువుగా వచ్చేయొచ్చు. తిరుపతి నుండి ఈ ప్రదేశం చేరుకోవాలంటే 130 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. మదనపల్లి నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటు లో ఉన్నాయి లేదా ప్రైవేటు టాక్సీలు కూడా అందుబాటు లో ఉంటాయి కాబట్టి సులువుగా ప్రయాణం చేయవచ్చు. ఇక కొండ పైకి వచ్చే సరికి పర్యాటక అటవీ శాఖకు చెందిన ప్రైవేటు అతిథి గృహాలు అద్దెకు లభిస్తాయి. కాబట్టి ఏ చింత అవసరం లేదు. 
 
ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు:
 
అందమైన ప్రకృతి తో ఈ ప్రదేశం బాగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటంటే...?  హార్సిలీ హిల్స్ కి  వెళ్లే కొండ దారి ఎంతో అందంగా ఉంటుంది. అంతే కాదు ఇక్కడ రెండు వైపులా నీలగిరి వంటి అనేక జాతుల చెట్ల తో కళ్లకు ఇంపుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణాన్ని మీరు మిస్ కాకండి. అలానే  చిరుతలు, జింకలు వంటి వన్య మృగాలు కూడా ఈ ప్రాంతం లో సంచరిస్తూ ఉంటాయి. కనుక చక్కగా వీటన్నిటి నడుము సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయవచ్చు.  అలానే సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా దీనిని చూడటానికి కూడా దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. అలానే ట్రెక్కింగ్, కొండలు పాకడం ఇతర సాహస కృత్యాల లో  కూడా పాల్గొనవచ్చు. సాహసాలు పర్యాటకుల్ని వినోదాన్ని పంచుతాయి. కాబట్టి సాహసికులకి ఈ ప్రదేశం బాగుటుంది.
 
ఇక్కడ ప్రధాన ఆకర్షణలు:
 

142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అలాగే ఇక్కడ ఒక జూ పార్కు కూడా ఉంది. ఇదిలా ఉండగా ప్రముఖ రచయిత, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయం ఇక్కడ ఉంది. అలానే ఫారెస్ట్ బంగ్లా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కనుక వీలైతే వీటిని చూసేయండి ఆనందంగా గడిపేయండి.