BREAKING NEWS

జాతీయ రైతు దినోత్సవం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

రోజులు మారుతున్న కొద్దీ పచ్చని పొలాలు తగ్గిపోతున్నాయి. పొలాలు పండించే భూముల్లో మేడలు కట్టేస్తున్నారు. వ్యవసాయం చేసే రైతులు  మాత్రం గుప్పెడు గింజల కోసం పొట్ట పట్టుకుంటున్నారు. ఇదే నేటి దుస్థితి. 
 
అసలు వ్యవసాయం అంటే ఏమిటి..?
 
ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. ఒక జీవనం ఇది. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి ఒక కీలకాంశం. ఇదిలా ఉండగా ప్రపంచం లోని 42 శాతం మంది వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు. అందుచేత వ్యవసాయం ప్రపంచంలోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి అని చెప్పవచ్చు. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో కేవలం ఐదు శాతం మాత్రమే అని అంచనా. భారతదేశం వ్యవసాయం ఆధారిత దేశం. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం లేకపోతే జీవితం లేదు, మనుగడ లేదు. 
 
వ్యవసాయం గురించి మరెన్నో విషయాలు:
 
మొదట ఆదిమానవులు జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు ఇటువంటివి సేకరించి ఆహారంగా తీసుకునేవారు. కానీ కొంత కాలం తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొంచెం కొంచెం ఆహారాన్ని ఉత్పత్తి చేయడం వారు నేర్చుకోవడం జరిగింది. ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పు దినుసులు మొదలైన ఆహార పదార్థాలు వంటివిక్రీస్తుపూర్వం 7000 లోనే  మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. క్రీస్తు పూర్వం 3000 నాటికి ఈజిప్షియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు. ఇలా ఆనాటి నుండి వ్యవసాయం విభిన్న పద్ధతులను ఉపయోగించి చేయడం జరుగుతోంది. నేటికీ కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు.
  
జాతీయ రైతు దినోత్సవం:
 
రైతేరాజు అని మనకి తెలుసు. నిజంగా రైతు లేకపోతే మనం ఏమి తింటాము..?  అని మనమే ప్రశ్నించుకోవాలి. ఒకసారి ప్రశ్నించుకుని చూడండి.. బతుకే లేదు కదా..! అయితే గత చరిత్రను మన పూర్వీకులు అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి ఉత్సవాలని చేస్తూ ఉంటాం. అలానే మన సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకునేందుకు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడు ఏది చేసినా, ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే అని మనం తెలుసుకోవాలి. ఏవైనా ఒక పండుగని కాని దినోత్సవాన్ని కానీ జరుపుకునేటప్పుడు ప్రత్యేకంగా వాళ్ల కోసం ఆలోచించి మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి. అందుకే ఇటువంటి రోజులు జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు అనగా డిసెంబర్ 23న రైతు దినోత్సవం. అంటే మనం ఏం చేయాలి..?, మన బాధ్యత ఏమిటి..? ఇటువంటి వాటి కోసం మనం ఇప్పుడే ఎన్నో తెలుసుకుందాం..
 
డిసెంబర్ 23న మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినం. ఆయన జన్మించిన రోజును భారత్ లో  రైతు దినోత్సవంగా జరుపుకుంటాము. భారత భాగ్య విధాత జీవన ప్రదాత ఓ రైతన్న నీకు నెనరులు....
 
నేలతల్లిని నమ్ముకుని పలు రకాల ప్రతికూల పరిస్థితులు తట్టుకుంటూ.. శ్రమించి పంటలు పండించే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రైతులందరికీ ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. అయితే రైతు కుటుంబం నుండి వచ్చిన ప్రధాని పదవిని అలంకరించిన చరణ్ సింగ్  జన్మదినం. అందుకే ఈరోజు జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవంగా జరుపుకుంటాము. అంతర్జాతీయ వ్యవసాయ దారుల దినోత్సవం జరుగుతున్నప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేక రోజు ఉండాలని ఆ లక్ష్యంతోనే మనం  జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చేసిన మార్పులు అన్నీ ఇన్నీ కావు.
 
చరణ్ సింగ్  చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే జమీందారీ చట్టం రద్దు అయింది. తద్వారా కౌలుదారీ చట్టం వచ్చింది. మరి కొందరి నాయకుల ఆలోచనల నుండి భూసంస్కరణలు వచ్చాయి. అంతే కాదండి పేదలకు భూములు పంపిణీ కూడా జరిగింది. రైతులను వడ్డీ వ్యాపారాలు, కబంధహస్తాల నుండి విడిపించి వారికి బ్యాంకు రుణాలు అందించే విధానాలు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. వీటన్నింటి వెనక చరణ్ సింగ్  నిర్వహించిన రైతు ఉద్యమాలు ఉన్నాయి. ఆయన వ్యవసాయం కోసం, రైతుల కోసం ఎంతగానో తపించారు. ఆయన కృషి కారణంగానే రైతాంగం ఆనంద పడింది. కొంతకాలం తర్వాత పార్లమెంట్ ని  ఎదుర్కోలేక పోయారు. తాత్కాలిక ప్రధానిగా 1980వ సంవత్సరం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒక రైతు నాయకుడిగానే 1987 మే 29 న మరణించారు. అయితే రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మదినం నాడు రైతుల దినోత్సవంగా ప్రకటించింది.
 
రైతన్నని రక్షించుకోవడానికి ఏం చేయాలి..?
 
మనకి కావాల్సింది కేవలం ఉద్యమం కాదు. పట్టెడన్నం పెట్టే రైతుల సమస్యలు తప్పక పరిష్కరించాలి. రైతన్న విలువని నవతరానికి తెలియజెప్పే ఉద్యమం కావాలి. రైతుల కంట కన్నీరు మన దేశాన్ని ప్రళయంలో చుట్టేయక ముందే ఓదార్పు నిచ్చే ఉద్యమం చాలా అవసరం. వ్యవసాయం దండగ కాదు పండగ అనే వాతావరణం నెలకొల్పాలి.
 
జై కిసాన్..!