BREAKING NEWS

మహోద్యమ సభ విజయవంతం

ఏకైక రాజధాని కోసం రైతులు కలిసి చేసిన పోరాటమే ఈ పాదయాత్ర. ఎంతోమంది మహిళలు, చిన్నారులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నడిచి నడిచి కాళ్లకు గాయాలైనా సరే పట్టించుకోకుండా పయనమయ్యారు. ఎండ, వాన అంటూ తేడా లేకుండా, కనీస మౌలిక సదుపాయాలు కరువైనా, అలుపెరగని ఉద్వేగంతో "జై అమరావతి", "జై ఆంధ్రప్రదేశ్" అంటూ ముందుకు కదిలారు. అందులో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతోమంది రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న కూడా వాళ్లను ఎవరు ఆపలేకపోయారు. వారితోపాటు మార్గమధ్యలో మరికొంత మంది ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ప్రయాణంలో రైతులు, మహిళలు కొన్ని రోజులపాటు వందల మైళ్ళు నడుస్తూ 'అమరావతి రాజధాని' గొప్పతనాన్ని అందరికి చెబుతూ, వారిలోనూ ఒకే రాజధాని ఉండాలనే నినాదాన్ని, స్ఫూర్తిని కలుగజేశారు.
 
మహోద్యమ సభ:-

'ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని' అనే నినాదంతో రైతులందరూ కలిసి పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర 45 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో "న్యాయస్థానం టు దేవస్థానం" అనే మహోద్యమ సభను ఏర్పాటు చేసారు. దీనిని అమరావతి పరిరక్షణ సమితి చేపట్టింది. ఈ బహిరంగ సభకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించగా పర్మిషన్ వచ్చింది. దాంతో ఈ కార్యక్రమంలో దాదాపు 50వేల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 17న మధ్యాహ్నం 1గంటకు మొదలై, సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది. ఈ సభకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. 

●"ఈ కార్యక్రమంలో మాతోపాటు పాదయాత్రలో పాల్గొన్న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామంటూ" కొందరు మహిళలు వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. 

●సభ మొదలవ్వగానే అన్ని పార్టీల నేతలతోపాటు, వివిధ మతాలకు చెందిన హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులను వేదికపైకి ఆహ్వానించారు. ఆయా మతాల వారు వాళ్లకు చెందిన దేవుళ్లను ప్రార్థించారు. ఆ తర్వాత వందేమాతరం గీతాన్ని ఆలపించి సభను కొనసాగించారు.
 
సభలో మిగతా పార్టీ నేతలు...

●ఈ సభలో సీపీఐ పార్టీ నారాయణ, రామకృష్ణ, బీజేపీ పార్టీ కన్నా లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తులసీ రెడ్డి, తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ సహా పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. వీరితోపాటు వైసీపీ పార్టీ నుంచి ఎంపీ రఘురామకృష్ణంరాజు నేత పాలుపంచుకున్నారు.

●"అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. కానీ రాజధానిగా 'అమరావతే' ఉండాలి. జై అమరావతి జై జై అమరావతి" అంటూ వేదికపై చంద్రబాబునాయుడు నినాదాలు చేసారు. 

●సభలో 'రాజధాని అమరావతి ఆంధ్ర ప్రజల ఊపిరి' అంటూ కళా బృందం చేసిన నృత్యాలకు అందరూ ఒక్కసారిగా నిల్చొని తమ మెడలో ఉన్న ఆకుపచ్చ కండువాలను ఊపుతూ ఉత్సాహన్ని నింపారు.
 
ఉద్యమం వెనుక అసలు గాథ:-

ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎం చంద్రబాబు నాయుడు 2014లో సెప్టెంబర్ 4న కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి పలు ప్రాంతాలు సందర్శించి 2015లో గుంటూరు జిల్లాలోని నేలపాడు గ్రామంలో ఏపీ నూతన రాజధానిగా 'అమరావతి' పేరును ప్రతిపాదించి, అదే ఏడాదిలో పనులు కూడా మొదలుపెట్టారు. కానీ 2019 ఎన్నికలో జగన్ మోహన్ రెడ్డి గెలిచి రెండో ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ఈయన అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రతిపాదనను అందరి ముందుంచారు.

అందులో భాగంగా ఎక్సుక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను, జ్యూడిషియల్ క్యాపిటల్ గా కర్నూల్ ను, లెజిస్లేటివ్‌ క్యాపిటల్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. దాంతో రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించి ఇచ్చిన అక్కడి ప్రజలు ఈ వార్త విని ఆందోళన చెందారు. మూడు రాజధానులు ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు రేకెత్తించారు. నిరాహారదీక్ష నిర్వహించారు. అక్కడితో ఆగకుండా దానినొక ఉద్యమంలా చేపట్టాలనుకున్నారు. అందుకుగానూ రైతులు అందరు కలిసి పాదయాత్ర ప్రణాళికను రూపొంచి, యాత్రను మొదలుపెట్టారు. 

●అమరావతి రాజధాని కోసం రెండేళ్లపాటు(అంటే ఇప్పటికి 701 రోజులు) సాగిన పోరులో దాదాపు 180మంది రైతులు చనిపోగా, 2,500 మంది రైతుల పైన కేసులు పెట్టారు.
 
యాత్ర ప్రయాణం ఇలా...

●నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ఈ యాత్ర సాగింది.

●రైతులందరూ కలిసి మొదటి రోజున తుళ్లూరు నుంచి తాటికొండ వరకు 14.5 కిలోమీటర్లు, అలా రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం నడిచారు. 

●మొదటి ఆరు రోజులు గుంటూరులో, నవంబర్ 8 నుంచి 17 వరకు ప్రకాశం జిల్లాలో, నవంబర్ 18 నుంచి డిసెంబర్ 3 వరకు నెల్లూరు చేరుకున్నారు.

●అక్కడ్నుంచి డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు, ఆ తర్వాత ఈ నెల 15న తిరుపతికి చేరుకోవాలని ముందుగా నిశ్చయించుకున్నారు. అలా దాదాపు 70 ప్రధాన గ్రామాల మీదగా రైతులు పాదయాత్రను కొనసాగించారు. 
 
ఈ నెల 17న మహోద్యమ సభను నిర్వహించి రైతులందరితోపాటు ప్రజలు ఈ బహిరంగ సభను విజయవంతం చేశారు. మరోసారి "జై అమరావతి" అంటూ అందరూ నినాదాన్ని మారుమోగించారు.