BREAKING NEWS

జగమంత పండుగ: 'క్రీస్తు జననం'

 క్రిస్మస్.. ఇల్లంతా వెలుగులు, 
ఇంటి ముందు క్రిస్మస్ చెట్టు,
నక్షత్రాకారాలతో అందంగా తీర్చిదిద్దిన లైట్లు… 
శాంతాక్లాజ్ తాత తెచ్చే చాక్ లెట్లు, గిఫ్టులు...
ఏ చర్చిల్లో చూసిన ప్రార్ధనలు...
ఇవన్నీ క్రిస్మస్ కి తీయని స్వాగతం చెబుతున్నాయి.
క్రైస్తవుల పర్వదినాల్లో అతి ముఖ్యమైందిగా... 
యేసు క్రీస్తు పుట్టినరోజుగా... ఈ పండుగను ప్రతి యేటా మనం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరి క్రిస్మస్ అంటే ఏంటి… దాని వెనుక దాగి ఉన్న చరిత్ర, ఇతర ప్రత్యేకతల గురుంచి ఈరోజు మనం తెలుసుకుందాం.
 
లాటిన్ భాషలో చూసుకుంటే 'క్రిస్ట' అంటే క్రీస్తు.. అని 'మస్' అంటే ఆరాధన అని అర్ధం. క్రీస్తును ఆరాధించి, ప్రార్ధనలు చేస్తూ ఆనందించడమే క్రిస్మస్ పండగంటే! యేసు క్రీస్తు పుట్టినరోజున జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది, పరమార్ధం ఉన్నది. అలానే యేసు పుట్టుక వెనుక ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని అంటారు.
 
క్రీస్తు పుట్టుక వెనుక చరిత్ర

పూర్వం రోమ్ సామర్ధ్యాన్ని అగస్టర్ సిజర్ అనే చక్రవర్తి పాలిస్తుండేవాడు. ఒకానొక సందర్భంలో ఆయన తన రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారో వారందరినీ లెక్కపెట్టాలని భావించాడు. దీంతో అక్కడ నివసించే ప్రజలందరూ ఎవరి ఊళ్లకు వాళ్లు డిసెంబర్ 25వ తేదీలోగా వెళ్లిపోవాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ, జోసెఫ్ లు నివసిస్తుండేవారు. అప్పటికే మేరీకి, జోసెఫ్‌తో పెళ్లి కూడా కుదిరింది.
 
ఇదిలా ఉంటే, ఒకరోజు మేరీకి తన కలలో గ్యాబ్రియల్ అనే దేవదూత ప్రత్యక్షమై.. ‘ఓ మేరీ నువ్వు దేవుడి అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతి అవుతావు. అలానే కుమారుడిని కూడా కంటావు. ఇక ఆ శిశువుకు 'యేసు' అని నామకరణం చేయు… అప్పుడు అతను దేవుడి కుమారుడిగా అవతారమెత్తుతాడని' చెప్పి ఆ దేవదూత మాయమవుతాడు.

కొన్నిరోజుల్లో మేరీ గర్భవతి అవుతుంది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న తర్వాత... ఒక రాత్రి అతని కలలోకి సైతం దేవదూత కనపడి.. ‘మేరీని నువ్వు విడిచి పెట్టవద్దు.. ఆమె దేవుడి వరం వల్లనే గర్భవతి అయ్యింది. ఆమెకు పుట్టే కొడుకు కూడా దేవుడి కుమారుడవుతాడు. తనను నమ్మిన ప్రజలందరినీ పాపాల నుంచి కాపాడే లోకరక్షకుడు అవుతాడని' చెప్పి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత జోసెఫ్, మేరీని పెళ్లి చేసుకుంటాడు.

జోసెఫ్ స్వగృహం బెత్లెహెం. అందువల్ల రాజాజ్ఞను శిరసావహించి స్వగ్రామానికి మేరీతో కలసి బయల్దేరతాడు. వీరిద్దరూ బెత్లెహెం చేరుకునేసరికి వాళ్లకు అక్కడ ఉండడానికంటూ వసతి దొరకదు. చివరికి ఒక సత్రపు యజమానిని వేడుకోగా ఆయన తన పశువుల పాకలో వాళ్లకి కాస్త చోటు ఇస్తాడు. అక్కడే మేరీ శిశివుకు జన్మనిస్తుంది.
 
ఇక ఆ రాత్రి బెత్లెహెంలోని పొలాల్లో కొంతమంది పశువుల కాపరులు తమ గొర్రెలను కాపలా కాస్తుండగా.. ఒక దేవదూత ఉన్నట్టుండి ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చి.. ‘మీకు ఒక సంతోషకరమైన శుభవార్తను తీసుకొచ్చాను. ఈరోజు బెత్లెహెంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించాడు. ఆయనే మీ అందరికి ప్రభువు. అతను ఇప్పుడు ఒక పసికందు పురుటి దుస్తుల్లో చుట్టబడి పశువుల తొట్టెలో పడుకుని ఉన్నాడు. ఇదే మీకు గుర్తుపట్టే ఆనవాలు అని చెప్పి అకస్మాత్తుగా మాయమవుతాడు.

ఇది విన్న గొర్రెల కాపరులు అట్నుంచి హుటాహుటిన వెళ్లి ఆ పశువుల పాక దగ్గరకు చేరుకుంటారు. అక్కడ పడుకుని ఉన్న శిశువును, వారి తల్లిదండ్రులైన మేరీ, జోసెఫ్‌లను చూసి ఆనందపడతారు. ఇక వారు తాము చూసింది. దేవదూత తమతో చెప్పింది ఊళ్లో వాళ్ళందరికి తెలియజేస్తారు. 
ఇది జరిగి దాదాపు 2000ల సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ వేళ డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి పూట యేసుక్రీస్తు జన్మించాడు. లోకరక్షకుడిగా ప్రజలను పాపాల నుంచి కాపాడడానికి అవతారం ఎత్తాడని ప్రజలు విశ్వసిస్తారు.
 
బైబిల్ ప్రాముఖ్యత...

చాలా సంవత్సరాల క్రితం ఒక పార్కులో ఒక అక్క తమ్ముడు కూర్చుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ను చదువుకుంటున్నారు. అటుగా వెళ్తున్న ఒక నాస్తికుడు వారిని చూసి, దగ్గరగా వచ్చి...  ‘మీరెందుకనీ ఈ బైబిల్‌ ను చదువుతున్నారో నాకర్థం కావట్లేదు. బైబిల్‌ దైవగ్రంథం కాదు. అసలు దేవుడనే వాడే లేడు. ఈ సృష్టంతా దానికదే వచ్చింది. దేవుణ్ణి మానవుడు తనకున్న భయాల నుంచి బయటపడటానికి సృష్టించుకున్నాడు. ఈ చెడు పుస్తకం మీకు ఎన్నటికీ ప్రయోజనాన్ని చేకూర్చదు’ అని ఇష్టమొచ్చినట్లుగా అంటాడు. 

అతని మాటలు విన్నాక… అక్కడున్న ఇద్దరిలో అక్క అతనితో ఇలా అంది. ‘ఒకప్పుడు నా తమ్ముడు తాగుతూ, తిరుగుతూ జల్సాలు చేస్తూ తిరిగేవాడు. ఎక్కువశాతం జూదశాలలోనే తన సమయమంతా గడిపేవాడు. తల్లిదండ్రులను లెక్కచేసేవాడు కాదు కూడా. అలాంటి వ్యక్తిలో మార్పు వస్తుందని మేము ఎవ్వరం ఊహించలేదు. ఒకరోజు తను బైబిల్‌ చదవడంవల్ల దేవుని గురించి  సత్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తును తన గుండెల్లో ఆరాధించడం మొదలు పెట్టాడు.

దివ్యమైన వెలుగు కలిగిన దేవుడు తన హృదయంలోకి వచ్చినందునే తన జీవితంలో నెలకొన్న చీకటంతా తొలగిపోయి, జీవితం పావనమైంది. ఇలాంటి మార్పును అతని జీవితంలో మేం గమనించాం. నీవనుకుంటున్నట్టు ఈ గ్రంథం చెడ్డదైతే, ఎందుకు పనికి రాకుండా దుర్లభమైన జీవితాన్ని గడిపిన నా సోదరుడిలో ఇంత మంచి మార్పును ఎలా తీసుకురాగలదు?’ అని అనగానే... తన అంతరంగంలో నుంచి వచ్చిన వాస్తవమైన జీవితానుభవాలకు నిశ్చేష్టుడై తలదించుకొని అక్కడ్నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు ఆ నాస్తికుడు. 
మన హృదయంలో దేవుడు కలిగించే మార్పు చాలా ఉన్నతమైంది. అది తెలుసుకుని సాటివారి పట్ల కరుణ, దయ, ప్రేమాభిమానాల్ని కలిగి ఉండటమే నిజమైన క్రీస్తు భావమని చెప్పకనే చెబుతోంది ఈ పర్వదినం.