BREAKING NEWS

జాతివివక్ష పోరాట యోధుడు: డెస్మండ్ టుటు కన్నుమూత

జాతివివక్ష అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు దక్షిణాఫ్రికా…
అటువంటి దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులపై జరుగుతున్న జాతివివక్షను రూపుమాపడానికి ఆయన ఉద్యమించారు. వారి హక్కుల కోసం ఎన్నో కీలక ప్రసంగాలు చేశారు.
దక్షిణాఫ్రికానే కాక ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం గొంతెత్తిన ధీశాలి...
ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి సైతం దక్కింది. 
అటువంటి ఆర్చ్ బిషప్‌ డెస్మండ్‌ టుటు గత ఆదివారం(ఈ నెల 26న) కన్నుమూశారు.

కెకేప్ టౌన్‌లోని ఒయాసిస్ ఫ్రైల్ కేర్ సెంటర్‌లో టుటు తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు అధికారికంగా వెల్లడించారు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో మరొకరిని కోల్పోయామని అధ్యక్షుడు రామఫోసా ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు. ఈరోజు మనం ఆయన గురుంచి తెలుసుకుందాం:
 
దక్షిణాఫ్రికా నైతిక దిక్సూచిగా పేరుగాంచిన టుటు.. 1980ల్లో స్థానికంగా నల్ల జాతీయులపై జరుగుతున్న క్రూరమైన అణచివేతకు, జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.

మానవహక్కుల ఉద్యమకారుడు,  నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీతేగాక 
క్రైస్తవ మతగురువు కూడా...
ఆయన గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చాలాసార్లు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. గత ఆదివారం ఆయన కేప్‌టౌన్‌లోని ఒయాసిస్‌ ఫ్రెయిల్‌ కేర్‌ సెంటర్‌లో తుది శ్వాస విడిచినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా ప్రకటించారు. గొప్ప పోరాటయోధుడిని మన దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతి వివక్షను బైబిల్‌ సమర్థిస్తుందని ఎవరైనా చెబితే ఆ రోజున నేను నా బైబిల్‌ను చింపేస్తా’ అని ప్రకటించాడు. 

నల్లజాతి వారిని మాములు మానవుల్లా గుర్తించాలంటూ ఎనభైల్లో ఆయన చేసిన ప్రసంగాలు, ప్రదర్శనలు దక్షిణాఫ్రికా తెల్లజాతి పాలకుల గుండెల్లో గగ్గోలు పుట్టించాయి. ఉద్యమంలో భాగంగా ఎన్నడూ హింసను ప్రేరేపించని వ్యక్తి ఆయన, మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లాంటి మహనీయులు పాటించిన అహింసా మార్గాన్నే ఈయన నమ్మారు. 

ఆయన పోరాటాన్ని గుర్తించిన నోబెల్‌ కమిటీ 1984లో శాంతి బహుమతిని సైతం ప్రకటించింది. అప్పటికి ఆయన జొహన్నెస్‌బర్గ్‌ బిషప్‌గా ఉన్నారు. తర్వాత కేప్‌టౌన్‌ ఆర్చి బిషప్‌ అయ్యారు. బిషప్‌గా ఉంటూనే వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా ప్రజలను చైతన్యపరిచి ఆపై నాటి తెల్లజాతి పాలకులపై రాజీలేని పోరాటం చేశారు.

ఈ పురస్కారంతో దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాటం ఓ మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమానికి ఓ గుర్తింపు వచ్చింది. దీంతో ప్రపంచనేతలు సంఘీభావం ప్రకటించడం మొదలెట్టాయి.
 
నెల్సన్కు అండగా..

దక్షిణాఫ్రికా దిగ్గజనేత నెల్సన్‌ మండేలాకు టుటు సన్నిహితుడుగా వ్యవహరించేవాడు. ఆప్తమిత్రుడు కూడా… 27 ఏళ్లపాటు మండేలా జైల్లో ఉన్నప్పుడు, ఉద్యమానికి టుటునే అండగా నిలిచాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం మండేలా తన మొదటిరోజును డెస్మండ్‌ ఇంట్లోనే గడపడం విశేషం! 

1994లో జాతి వివక్ష చెర నుంచి దక్షిణాఫ్రికా విముక్తి పొందింది. అటుపై జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మండేలాను ప్రజలకు టుటుయే పరిచయం చేశారు. తర్వాత తెల్లజాతీయుల పాలనలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై మండేలా వేసిన 'ట్రూత్‌ అండ్‌ రికన్సీలియేషన్‌' కమిటీకి సైతం టుటుయే నేతృత్వం వహించారు. అయినప్పటికీ, అత్యంత కఠినమైన నేరాలు చేసిన తెల్లజాతీయులను ఆయన వదిలేశారని అప్పట్లో ఆరోపణలు గుమ్మెత్తాయి. శాంతికి, క్షమాగుణానికి మించిన మందు ఇంకోటి లేదంటూ వాటిని టుటు కొట్టి పారేశారు. జాతుల మధ్య ఐక్యత.. దక్షిణాఫ్రికా భవిష్యత్తుకు కీలకమని ఆయన వ్యాఖ్యానించేవారు.
 
అపరిమతం ఆయన సేవలు

టుటు సేవలు కేవలం దక్షిణాఫ్రికాకే పరిమితం కాలేదు. ప్రపంచంలో ఎక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరిగినా తన గళాన్ని వినిపించేవారు. 2003లో ఇరాక్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అది అనైతిక యుద్ధంగా నిర్వచించారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ వహించిన దమనకాండను ఖండించారు. మండేలా తర్వాత వచ్చిన పలు దక్షిణాఫ్రికా ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. నాటి తెల్ల పాలకుల జాతివివక్షకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలే ఎక్కువ వివక్షను చూపుతున్నాయంటూ ఆయనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

1997లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్‌ నిర్ధారణ కాగా.. కొన్నేళ్లుగా దాని చికిత్సకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌లతో చాలాసార్లు ఆయన ఆసుపత్రిలో చేరారు. టుటు మృతికి భారత ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాధినేతల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.