BREAKING NEWS

గోదాదేవి వ్రతమే… 'ధనుర్మాసం'!

 
రంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గొబ్బిళ్లు, బొమ్మలు, ఆటపాటలు… ఇవేకాక మరోవైపు గోదాదేవి తెల్లవారుజామునే నిద్ర లేవడం,  తన స్నేహితులను కూడా మేల్కొలిపి… భక్తిగా శ్రీకృష్ణుడిని ధ్యానించే మాసం ఇది. 
ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న ఆచారమిది. 

'ధనుర్మాసం' ప్రారంభంలో చలిగాలులు అంతగా వీచవు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందులోనూ ఇది హేమంతరుతువు. పైన వేసిన తటాకాలతో సహా ‘మానస’సరోవరం వేకువ జామున ఎంతో నిర్మలంగా అచెంచలంగా ఉంటుంది. ఈ సమయంలో భక్తితో దేవదేవున్ని గానం చేస్తూ, జ్ఞాన తటాకంలో స్నానం చేయడం వల్ల భగవత్ ప్రాప్తి కలుగుతుంది.

ధనుర్మాసం ప్రత్యేకత కూడా ఇదే!
'తిరుప్పావై' అంటే 'శ్రీవ్రతం'. ఈ వ్రతాన్నే సిరినోము అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో… సూర్యుడు ధనస్సురాశిలోకి ప్రవేశించి అనంతరం మకరరాశిలోకి సాగే కాలాన్ని 'ధనుర్మాసం' అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గ శీర్షమని పిలుస్తారు. మార్గశిర మాసంలోనే శ్రీవ్రతం చేయాలంటారు ఎందుకంటే.. మార్గం అంటే దారి/ తోవ లేదా ఉపాయం. శీర్షం అంటే మానవునికి శిరస్సు అంత ప్రధానమైందని అర్ధం. మార్గశీర్షం అంటే భగవంతుని ప్రాప్తి కలిగించే శ్రేష్ఠమైన మార్గమని. ఉపనిషత్ సిద్ధాంతం ప్రకారం- ప్రాప్తి అనేది భగవంతుడే, అది ప్రాప్తింపజేసేది కూడా భగవంతుడే! అటువంటి విశ్వాసాన్ని మరింత పెంపొందించే వ్రతానుసారమే ధనుర్మాస వ్రతం. ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవమనే అర్ధం వస్తుంది. అది పరమాత్ముని ఉనికిని తెలియజేసే నాదం. సంగీతం(నాదం)తో ధనుర్మాసంలో గోదాదేవి తన పాశురాలను గానం చేసి దైవాన్ని చేరుకుంది. అటువంటి దివ్యమైన మాసం వృత్తాంతం గురుంచి మనం ఈరోజు తెలుసుకుందాం:
 
అసలు కథ

గోదాదేవి కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులోని ఆలయ అర్చామూర్తి వటపత్రశాయినిని శ్రీకృష్ణుడిగా భావించి, పూజించింది. తరువాత ఆలయాన్ని నందగోపాలుడి వనంగా అలాగే తోటి నేస్తాలను గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతం చేసింది. 

ద్వాపర యుగంలో... రేపల్లెలో నివసించే గోపికలు శ్రీకృష్ణున్ని పొందడానికంటూ ఈ వ్రతం చేశారని విష్ణువు చెప్పగా అది విని ఆండాళ్‌ ఈ వ్రతాన్ని చేస్తుంది. ఆమెను 'శూడికొడుత్తనాచ్చియార్‌' అని కూడా భక్తితో సంబోధిస్తారు. ఆమె విడిచిన మాలలనే వటపత్రశాయి ఇష్టంగా స్వీకరించాడు మరి. కాబట్టే ఆమెను కొందరు అలా పిలుచుకొంటారు. 

ఆండాళ్‌ అంటే 'రక్షకురాల'ని అర్థం. ఆమె ప్రసన్నురాలు. అందుచేత ప్రసన్నులు భగవంతుని ప్రేమ పొందుతారు. అలాంటి వారిని అనుసరించేవారే పరమ భక్తులు. అజ్ఞానాన్ని తొలగించి, నిద్రిస్తున్న వారిని మేల్కొనేలా చేసి, దైవాన్ని పొందేందుకు వారికి యోగ్యత, భోగ్యతలను కలిగించే ప్రేమమూర్తియే ఈ గోదాదేవి అని అంటారు. 

గోదాదేవి పాశురాలు ఆత్మార్పణకు ప్రేరణ ఆమె. ప్రారంభ పాశురమైన మార్గళిత్తింగళ్‌లో ఆమె స్నేహితులను నిద్రలేపుతూ ఈ విధంగా అంది ‘చెబుతారా! మంచి వెన్నెల రోజు ఏదో... వేకువ జామున స్నానమాచరించడానికి తగిన సమయమిదే. 

రమణులారా... 
సిరులు పొంగే రేపల్లె పడుచులారా... మేల్కొనండి. నందనందనుడైన యశోదకిశోర సింహం మనకు వరమిస్తాడు’ అని శ్రీ వ్రతాన్ని ప్రారంభిస్తుంది. గోదాతల్లి గానం చేసిన ఇటువంటి తరహా ముప్పై పాశురాలు కూడా మూలమంత్రాలే! తిరుప్పావైలో వేకువజామున ఆచరించే స్నానానికి గోదాదేవి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చేది. మనం రోజూ చేసే బాహ్యస్నానం కాక అంతర స్నానం కూడా చేయాలని తిరుప్పావైలో సూచించింది. అంతర స్నానం వల్ల అంతఃకరణం శుద్ధి అవుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తిరుప్పావైని నిత్యవ్రతంగా కొలుచుకుంటే భగవత్ అనుభవం కలుగుతుంది. భగవత్‌ గుణానుభవ స్నానానికి జ్ఞానం, భక్తి, వైరాగ్యం ప్రధానం. అందుకే 
ఈ పాశురంలో తన చెలులను ఆమె ‘సేరిళైఈర్‌’ అని సంబోధిస్తుంది. 
‘జ్ఞానభక్తి వైరాగ్యాలనే ఆభరణాలను ధరించిన చెలులారా’ అని దీని అర్థం. 
మరో పాశురం భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. 

‘కీశు కీశున్రు ఎంగుం ఆనైచ్ఛాత్తన్‌ కలన్దు’ అంటూ ప్రారంభమయ్యే ఈ పాశురంలో…
‘భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి కీశుకీశు
(కేశవా, కేశవా) అంటున్నాయి. ఆ కేశవనామాలు వినరండి. గోపెమ్మా! ఇక లేచి తలుపు తెరువు. భరద్వాజ పక్షులు సైతం దైవనామస్మరణ చేస్తున్నాయి. భగవత్‌ ప్రాప్తి కోసం మనం సైతం శ్రీవ్రతం చేద్దాం రండి.!’ అనేదే ఈ కీర్తన అర్ధం.

ఆమె పాశురాలన్నీ దైవత్వంతో కూడినవే. ఇందులో పదహారో పాశురం ‘సాయగనాయ్‌’ ఇరవై ఏడో పాశురం ‘కుడారై’ అనగా… ఈ రోజుల్లో వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
ఇతరాంశాలు...

◆ ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక వంటిది. ఈ మాసంలో ఆండాళ్‌ బాహ్య, అంతరానుభవంతో ముప్పైరోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను (కీర్తనలను) గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాశురాల గీత మాలిక తిరుప్పావై రుజువు చేస్తోంది.

◆ ధనుర్మాస కాలంలో శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి ఆలయం, అలాగే శ్రీరంగంలోని రంగనాథుని కోవెలను దర్శించడమనేది మంగళకరమని అంటారు. 

◆ గోదాదేవి రంగనాథునిలో ఐక్యమవ్వడం కలియుగంలోని మకర సంక్రాంతి ముందు రోజైన భోగినాడు జరిగిందని చరిత్ర చెబుతోంది.

◆ ధనుర్మాస వ్రతం ఇహపర ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. వాసుదేవుని చరణారవిందాల వద్ద స్థానం కలిగిస్తుందని ఎందరో ప్రగాఢంగా విశ్వసిస్తారు.

◆ శ్రీకృష్ణదేవరాయలు రచించిన గోదాదేవి చరిత్రకు ‘ఆముక్తమాల్యద’ అని పేరు పెట్టుకొన్నారు.