BREAKING NEWS

మృత్యు ఒడిలోకి... శివశంకర్ మాస్టర్!

ఆయన డ్యాన్స్ అంటే ప్రాణమిస్తారు. చిన్నప్పటి గాయం ఆయనకు ఎన్నో కళలను నేర్పింది. జ్యోతిష్యుడే ఈయనను చూసి పెద్ద నృత్యకారుడవుతాడు అని చెప్పడం. చెప్పిన్నట్లే పలు భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడం విశేషం! నృత్య సహాయకుడిగా చేరి మాస్టర్ గా ఎదిగారు. అందుకుగానూ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నాటితరం నుంచి నేటితరం అగ్రకథానాయకులెందరికో శివశంకర్ మాస్టర్(73ఏళ్లు) అనేక నృత్యరీతులను నేర్పించారు.

ఇటీవల ఆయన కరోనా బారిన పడడంతో హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ గత ఆదివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో ఈయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎంతోమంది నటీనటులు, కళాకారులు హాజరై మాస్టర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈయన కుటుంబ సభ్యులు సంతాపం తెలిపారు. శివశంకర్ మాస్టర్ గురుంచి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం...
 
బాల్యం...
1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు. తండ్రి కల్యాణ సుందర్ పండ్ల వ్యాపారి, తల్లి కోమల. 
శివశంకర్ మాస్టర్ వివాహం సుకన్య తో జరిగింది. ఈయనకు విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్ పిల్లలు. ఇద్దరు నృత్య దర్శకులుగానే కొనసాగుతున్నారు. 
 
సినీరంగ ప్రవేశం...

ఈయన తండ్రి 'సభ' అనే సాంస్కృతిక కార్యక్రమాల్లో సభ్యుడిగా ఉండేవారు. దాంతో అక్కడ నాటకాలు, డ్యాన్సులు చూడటానికి డ్రైవర్ ని ఇచ్చి పంపించేవారు. వాటిని చూసిన తర్వాత తనంతట తానే డ్యాన్స్ నేర్చుకొని, 16వ ఏటా నుంచి ట్రూప్ ల వెంట వెళ్లి నృత్య ప్రదర్శనలు చేసేవారట. ఆ తర్వాత మద్రాసులో నటరాజ శకుంతల నృత్యకారుడి దగ్గర పదేళ్లు డ్యాన్స్ తో పాటు అమ్మాయిల హావభావాల్ని మగవాళ్ళు ఎలా చేయగలరో నేర్చుకున్నారు.
●'పాట్టు భరదము' అనే చిత్రంలో సహాయకుడిగా పనిచేశారు.
●1974లో మాస్టర్ సలీమ్ దగ్గర సహాయ నృత్య దర్శకుడిగా చేరారు. 
●1977లో ‘కురువికూడు’ సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారారు.
●2003లో 'ఆలయ్' చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు.
 
అనుకోని సంఘటన...

శివశంకర్ మాస్టర్ ఒకటిన్నర సంవత్సరాల వయసున్నపుడు ఈయన పెద్దమ్మవాళ్లు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంటి ఆరుబయట ఉన్న సమయంలో రోడ్డుపై ఉన్న ఆవు తాడు తెంపేసుకొని ఒక్కసారిగా వీరిపైకి రావడంతో భయపడి ఇంట్లోకి పరుగెత్తుతుండగా ఈయన జారి గుమ్మం దగ్గర పడిపోయారు. దాంతో వెన్నుముకకు తీవ్రంగా గాయం అవ్వడంతో ఎనిమిదేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ సమయంలో అమ్మతోపాటు పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కలిసి ఈయన్ని చూసుకునేవారట. అలా వాళ్ళను చూస్తూనే ముఖంలో హావభావాలను నేర్చుకున్నారు. ఆ తర్వాత శివశంకర్ చికిత్స కోసం విదేశాల నుంచి వచ్చిన నరసింహ అయ్యర్ అనే వైద్యుడు ట్రీట్మెంట్ చేయడంతో తిరిగి కోలుకున్నారు.
 
నృత్య దర్శకుడిగా

●శివ శంకర్ మాస్టర్ నృత్య దర్శకుడిగా అప్పటి అగ్ర కథనాయకులైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణలతోపాటు ఇప్పటి యువ కథనాయకులైన రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి ఎంతోమంది హీరోల సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేశారు. అందులో
●ఖైదీ
●అమ్మోరు
●సూర్యవంశం
●అల్లరిపిడుగు
●అరుంధతి
●మహాత్మ
●మగధీర
●బాహుబలి: ది బిగినింగ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేశారు.
●నేనే రాజు నేనే మంత్రి
●అక్షర
●సర్కార్
●ఎన్టీఆర్ కథానాయకుడు
●రాజుగారి గది 3 వంటి తదితర చిత్రాల్లో కమెడియన్ గా నటించారు.
 
పురస్కారాలు...

●భారతీయ సినీపరిశ్రమలో దాదాపు 10 భాషల్లో (అందులో జపనీస్ భాష ఒకటి) అనేక చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు.

●ఇప్పటివరకు 800ల చిత్రాల్లో, దాదాపు 15వేల పాటలకు నృత్య దర్శకత్వం వహించారు.

●తెలుగు, తమిళ భాషల్లో కలిపి 30కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ యాక్టర్ గా నటించారు.

●తెలుగులో 'ఢీ' , 'ఆట', 'ఛాలెంజ్' తోపాటు అనేక టెలివిజన్ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా వ్యవహారించారు.

●తెలుగులో మగధీర సినిమాలో 'ధీర ధీర ధీర…' అనే పాటకు నృత్యాన్ని సమకూర్చినందుకుగానూ జాతీయ పురస్కారం అందుకున్నారు. ●తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ 'నృత్యదర్శకుడి'గా నాలుగుసార్లు పురస్కారాలను అందుకున్నారు.
 
ఇతరాంశాలు...

●వెన్నెముక గాయం వలన ఇంట్లోనే ట్యూషన్లు చెప్పించుకుంటూ, ఎలాగోలా ఎస్సెల్సీ పూర్తి చేశారు.

●ఈయనకు హీరోయిన్ రాధ అంటే చాలా ఇష్టం.

●తెలుగులో 'ఖైదీ' చిత్రంతో మొదటిసారిగా నృత్యదర్శకుడిగా పరిచయమయ్యారు.

●సీనియర్ నందమూరి తారక రామారావు ఈయన్ని 'చిన్న మాస్టర్' అని ముద్దుగా పిలిచేవారట.

●ఈయన ఎక్కువగా కృష్ణ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు.

●ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ అంటే 'నా హృదయం' అని అన్నారు.

●ఈయనకు సాంప్రదాయకంగా రెడీ అవ్వడమంటే ఇష్టమట.

●'సెట్లో డ్యాన్స్ చేస్తూనే కన్నుమూయాలనేది నా చివరి కోరిక అని' ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

●రాజేంద్రప్రసాద్‌ శివశంకర్ మాస్టర్ ని 'ఒక ఇనిస్టిట్యూట్‌ పెట్టండి. మీ తర్వాత అలా హావభావాలు పలికించేవారు ఎవరూ లేరు' అని అన్నారట.

●ఈయన చికిత్స కోసం పలువురు నటులు ఆర్థిక సాయం చేశారు.
 
ఈయన కొరియోగ్రఫీలో
●ధీర ధీర ధీర….
●మన్మధ రాజా మన్మధ రాజా…
●రగులుతోంది మొదలిపోద….
●తకిట తదిమి తకిట తదిమి తందాన...

Photo Gallery