BREAKING NEWS

హ్యాపీ బర్త్ డే… 'వెంకీ' మామ!

మొదటి సినిమాకు తెలుగులో డైలాగ్స్ చెప్పలేక తడబడిన అబ్బాయి…
రానురానూ తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడయ్యాడు.
మూడు దశాబ్దాలుగా విభిన్న సినిమాల్లో చేస్తూ,
మూడు తరాల అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచాడు.
కుటుంబతరహా చిత్రాలతో నవ్విస్తూనే, 
సెంటిమెంట్ డైలాగ్ లతో అందుకుతగ్గ అభినయంతో కట్టిపడేసి ఫేవరేట్ స్టార్ గా మారారు. 

ఎటువంటి విమర్శకులు లేని నటుడిగా పేరు తెచ్చుకున్న 'విక్టరీ' వెంకటేష్… 
కాస్త ఇప్పుడు వెంకీ మామగా పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. 
తాజాగా ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకుని తాజాగా ఓ వీడియోను ప్రత్యేకంగా విడుదల చేసింది చిత్రబృందం. ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎఫ్ 2 లో ఫ్రస్టేషన్ ను పోగొట్టేందుకు వేసే వెంకీ ఆసనం అందరిలోనూ క్లిక్ అయ్యింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ సినీజీవిత విశేషాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
 
బాల్యం, చదువు...

1960 డిసెంబరు 13న ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో రామానాయుడు, రాజేశ్వరీ దంపతులకు జన్మించారు వెంకటేష్. అన్నయ్య సురేష్ బాబు, చెల్లెలు లక్ష్మి. విద్యాభ్యాసం మద్రాస్ లొనే జరిగింది. అగ్మోర్ లోని డాన్ బాస్కో స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు. ఇంగ్లీష్ పై పట్టు సాధించారు. తరువాత పై చదువులకు అమెరికాలోని మౌంటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో చేరి, ఎంబీఏ చేశారు. 
వెంకటేష్ భార్య నీరజ, వీరికి నలుగురు పిల్లలు ఆశ్రిత, హయవాహిని, భావన, అర్జున్.
 
సినిమాల్లోకి...

1964లో ఎస్ పీ అనే అక్షరాలతో సురేష్ ప్రొడక్షన్స్ ను స్థాపించారు రామానాయుడు. ఇందుకుగానూ ఎస్ దగ్గర వెంకటేష్ ను, పి దగ్గర సురేష్ ను నిలబడమనటంతో అలానే నిల్చున్న వారిద్దరి లాగానే లోగోను తయారు చేశారు. ఎస్ అనే అక్షరం దగ్గర నిల్చున్న వెంకటేష్ స్టార్ అయ్యారని, పి దగ్గర నిల్చున్న సురేష్ ప్రొడ్యూసర్ అయ్యారని సరదాగా అనేవారట.
కృష్ణ కోసం సిద్ధం చేసిన క‌థ‌తో హీరో అయ్యాడు వెంక‌టేష్. ఆ టైంలో కృష్ణ గారికి డేట్స్ కుదరకపోవడంతో, మీ చిన్నబ్బాయిని పిలిపించి హీరోగా చేయమని ఆయన సలహా ఇవ్వడంతో, అది నచ్చి రామానాయుడు గారు వెంకటేష్ ను పిలిపించారు. అలా 1986లో వచ్చిన క‌లియుగ పాండ‌వులు తొలి సినిమా.

డైలాగ్స్ ఎంత ప్రాక్టీస్ చేసినా, లోకేషన్ లో బాగా తడబడేవారట. ఎలాగోలా సినిమాను పూర్తి చేశారు. మొదటి సినిమాతోనే  బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టడమే కాకుండా నంది అవార్డు కూడా అందుకున్నారు వెంకటేష్. అజేయుడు, భారతంలో అర్జునుడు, విక్రమ్,
ప్రేమ, స్వ‌ర్ణ‌క‌మ‌లం, శ్రీ‌నివాస క‌ళ్యాణం లాంటి సినిమాలు 80ల్లో వరుసగా నటించి మెప్పించారు.

ఈ సినిమాల్లో వెంకటేష్ చూపించిన వేరియేషన్స్ కు గానూ ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ లు దక్కాయి.

ఇక 90ల్లో వ‌చ్చిన బొబ్బిలిరాజా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. చంటి, కూలీ నెం 1, క్షణం క్షణం, ప్రేమించుకుందాం రా, అబ్బాయిగారు, శ‌త్రువు, కొండవీటి రాజా, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, ప్రేమంటే ఇదేరా, పవిత్ర బంధం, పెళ్ళి చేసుకుందాం లాంటి ఎన్నో సంచ‌ల‌న సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యాడు.

జ‌యం మ‌న‌దేరా, మ‌ల్లీశ్వ‌రి, ఘర్షణ, సంక్రాంతి, నువ్వు నాకు న‌చ్చావ్, లక్ష్మి, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, తులసి, చింతకాయల రవి, నమో వెంకటేషా లాంటి కుటుంబ తరహా చిత్రాల్లోనూ అలరించాడు. విజయాలు ఎక్కువ ఉండడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ వెంకటేష్ కు విక్టరీ అనే బిరుదునిచ్చింది.
2021లో ఓటిటిలో విడుదలైన నారప్ప, దృశ్యం 2 సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
మల్టీ స్టారర్ కి కేరాఫ్

ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ చేయ‌డంలో వెంకీ త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్పొచ్చు. మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు తెలుగులో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. మహేష్ బాబుతో కలిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హీరో రామ్ తో కలిసి మసాలా, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల, హీరో నాగచైతన్య తో కలిసి వెంకీమామ సినిమాలు అలా వచ్చినవే. ఆ త‌ర్వాత ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.
ప్రస్తుతం వరుణ్ తో కలిసి ఎఫ్ 3 చేస్తున్నాడు.
తెలుగులో మ‌రే హీరోకు సాధ్యం కాని రీతిలో 7 నంది అవార్డుల‌ను అందుకున్నాడు వెంక‌టేష్. ఎటువంటి హేటర్స్ లేని హీరో ఆయన, ఈ పుట్టినరోజుతో 61వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. 

◆ దృశ్యం 2, నారప్ప సినిమాల్లో తన సీనియారిటీ ని మరోసారి రుజువు చేస్తూ, తండ్రి పాత్రకు న్యాయం చేశారు. మరీ రాబోయే సినిమాలు కూడా గుర్తుడిపోయేవిలా ఉండాలని మనం కోరుకుందాం.